సత్యాన్వేషన దినం
ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం. ఇటలీలోని రోమ్ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు. 'నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారుల...