సౌర వ్యవస్థ ఆవిర్భావం

సౌర వ్యవస్థ ఆవిర్భావం

         pc: YouTube

 వినీలాకాశంలో   రాత్రి పూట కనిపించే నక్షత్రాలు, చందమామ, పగలు కనిపించే సూర్యుడు,మనం నివసించే భూమి ఇవన్నీ విశ్వం అనుకున్నాడు మనిషి మొదట్లో.  దీన్ని అంతరిక్షం,రోదసి,గగనం మొదలైన పేర్లతో పిలిచేవాడు.వీటి  కదలికలను అధ్యయనం చేశాడు గానీ వీటి ద్వారా   విశ్వం గురించి కొంచెం కొంచెం తెలిసింది గానీ కచ్చితంగా తెలుసుకోవడానికి గెలీలియో దూరదర్శన్ ని కనుగొన్నది వరకు వేచి ఉండాల్సి వచ్చింది  . 

      విజ్ఞాన వికసిస్తున్న తొలి దశలో,  గడియారాలు కొనుక్కోక ముందు సూర్యుని వెలుగు లో భూమి పై మనిషి  నీడల ను బట్టి  టైమెంతయిందో తెలుసుకునేవారు. నక్షత్రాల కదలికలను బట్టి రాత్రి సమయాన్ని అంచనా వేసేవారు. ఆకాశంలోని నక్షత్రాలు,ఇతర గ్రహాలు, చంద్రుని  కదలికల పరిశీలన ఆధారంగానే కేలండర్లూ, పంచాంగాలూ వెలిశాయి.  అయితే పాత జ్ఞానాన్ని పూర్వం   పూర్వపక్షం చేసేవారు. దీనిని మీమాంస అన్నారు. ఇలా శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఏ మధ్య యుగాలలో రాచరిక వ్యవస్థ ఏర్పడ్డాక ప్రజల్లో అనేక మూఢ విశ్వాసాలు పెంచి తమపై  విశ్వాసాన్ని పెంచుకోవడానికి  పాలకులు పురోహితుల సాయంతో ప్రచారం చేశారు.దీని కోసం అనేక పురాణాగాథలు రాశారు. తమది చంద్ర వంశమని, సూర్యవంశమని చెప్పి తాము గొప్ప వారమనే అభిప్రాయం కలగడానికి ప్రజల్లో తమ పట్ల తిరుగుబాటు రాకుండా ఉండడానికి ప్రజలను పూర్తిగా తమకు విశ్వాసపాత్రులుగా ఉంచడానికి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు రాయించారు.

     పురాణాల్లో  అదితి, కశ్యపులకు  సూర్యుడు జన్మించినట్లు రాశారు. ఈ సూర్యుడు, మనకు నింగిలో కనిపించే సూర్యుడు వేరు వేరు.ఆకాశంలో కనిపించే సూర్యుని పేరు కశ్యపుని కుమారునికి పెట్టాడు రచయిత. ఈ సూర్యుడికి సంధ్య, ఛాయ, పద్మిని అనే పేరు గల ముగ్గురు భార్యలున్నారు. మొదటి భార్య  సంధ్య ద్వారా ముగ్గురు పిల్లలు కలిగారు. వీరికి   మనువు, యముడు, యమున అని పేర్లు పెట్టారు. సూర్యుని కుమారుడైన మనువు పరిపాలించడం వలన మనల్ని  మానవులని పిలిచారని పురాణాల ద్వారా ప్రచారం చేశారు.

      మహాభారత కథలో నైతే   సూర్యునికి కుంతికి కర్ణుడు పుడతాడు. మన సూర్యునికి ఈ కథలో కర్ణుని తండ్రి సూర్యునికి ఎలాంటి  సంబంధం లేదు. కవి సొంత పైత్యం తప్ప మరేమీ కాదు.

      మరో పురాణగాథలో సూర్యుని కి,  ఊర్వశి కి వశిష్ఠుడు పుట్టినట్లు, వరుణుడు ( వాన) కు ఊర్వశి కి అగస్త్యుడు జన్మించినట్లు రాశారు.సూర్యుడు, వరుణుడు ఇద్దరూ మనుషులే.సూర్యుని ఆరాధించే గణానికి సంబంధించిన వ్యక్తి ని చెప్పడానికి బదులు ఆ వ్యక్తి ని సూర్యునిగా వర్ణించారు. రామాయణం లో సూర్యుని ద్వారా రుక్షవిరజునికి సుగ్రీవుడు జన్మించినట్లు రాశారు.ఇక్కడా అంతే. మాతృ స్వామిక సమాజంలో తండ్రి పాత్ర పరిమితం. అందువల్ల కవులు తాము రాసిన కథలలో ఆనాటి గణ సమాజాలు గుర్తు గానో లేదా తమకు ఆరాధ్యునిగానో భావించే సూర్యుని తండ్రి పాత్రగా రాసినారు. అందువల్ల నింగిలో కనిపించే సూర్యునికి కథలో సూర్యునికి సంబంధం లేదు. అలా నమ్మడం మూఢ విశ్వాసం తప్ప మరేమీ కాదు

'జీవులకు పుట్టుక, పెరుగుదల, మరణం అనేదశలున్నట్లే, సూర్యునికీ ఆ దశలు ప్రతిరోజూ కనబడుతున్నాయి.ఉదయం పెద్దగా, ఎర్రగా మధ్యాహ్నం చిన్నగా,తేజో వంతంగా, అస్తమయంలో మరీ పెద్దగా, ఎర్రగా సూర్యుడు  కనిపిస్తాడు. ముఖ్యంగా, ఉదయ అస్తమయాల్లో అది ఎర్రగా ఉంటుంది. ఇది ఎందుకిలా ఉంటుందనేందుకు ఒక కథ చెప్పుకున్నారు ప్రాచీనులు.  'మందేహులు' అనే రాక్షసగణం ఉదయాస్తమయాల్లో సూర్య దేవునితో తలపడతారట! ఆ పోరాటగాయాల కారణంగానే 'సూర్యుడు 'రక్తవర్ణం'తో కన్పిస్తాడన్నారు. సూర్యుని ఆ యుద్ధంలో గెలిపించటంకోసం, భూమిపైనుంచి 'మంత్రాస్త్రాలను ప్రయోగిస్తే వాటి ధాటికి తట్టుకోలేక మందేహులు పారిపోతారని అందుకోసం ఉ దయ, మధ్యాహ్న, అస్తమయ సమయాలలో మంత్రాలతో 'సంధ్యావందనాలు చేయాలి' అని ప్రాచీన వైదిక రుషులు ఒక  నియమాన్ని ఏర్పర్చారట!

రుగ్వేదంలో కాంతివేగాన్ని గురించి తరచుగా ఉటంకించే శ్లోకం ఉంది. అదేమంటే...

తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య।

విశ్వమా భాసి రోచనం ( రుగ్వేదం 1.050.04)

( ఈ శ్లోకానికి అర్థం: ఎంతో వేగంగా పయనిస్తూ అందమైన వెలుగును సృష్టించేవాడా! విశ్వమంతటా వెలుగును పంచేవాడా! ఓ సూర్యుడా!)

     నక్షత్ర మండలాన్ని 12 రాసులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు.సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. 

       క్రీ.పూ.2000నాటి  మన ప్రాచీన వేద సాహిత్యం లో  ద్వాదశ(12) ఆదిత్యుల  (సూర్యులను) గురించి ప్రస్తావించారు. వారికి మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు అని పేర్లు పెట్టారు.కానీ మన పాలపుంత  (గేలక్సీ)లో 3200 సూర్యులున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి నుండి ఓంకార ధ్వని వెలువడుతూందని ఇటీవల కొంతమంది ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు.కానీ ఇది తప్పని నాసా ఖండించింది. సూర్యుని కంపనం హమ్మింగ్ ధ్వని లా వినిపిస్తోంది తప్ప అది ఓంకార ధ్వని కాదని తేల్చింది.    

      ప్రాచీన గ్రీకు సాహిత్యకారులు సూర్యుడిని హేలియోస్  అనే అందమైన దేవుడిగా పేర్కొన్నారు.  అతను టైటాన్ హైపెరియన్, టైటానెస్ థియాల కుమారుడు. హేలియోస్ ను,సెలీన్ పేరుతో పిలువబడే చంద్రుడికి,   వేకువ దేవతైన ఈయోస్ కు సోదరునిగా ప్రస్తావించారు.

      ఇలాంటి కథలన్నీ 17వ శతాబ్దంలోగెలీలియో దూరదర్శిని కనుగొనక ముందు వరకు సాగినాయి. ఒక్కసారి దూరదర్శిని (టెలిస్కోప్) తో విశ్వం ను మన కళ్ళతో మనమే పరిశీలించడం మొదలుకాగానే సూర్యుడు కూడా ఒక నక్షత్రమని, దాని చుట్టూ భూమి,ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని తెలుసుకున్నారు. అప్పటి నుంచి సూర్యుని గురించి పరిశోధనలు సాగాయి.సూర్యుని పుట్టుక గురించి, సూర్యుని స్వరూప స్వభావాల గురించి  తెలిశాయి.

       నీహారిక(nebula)   అనేది ఒక రకమైన నక్షత్ర మేఘం.ఇది చాలా దట్టంగా ఉంటుంది. ఇది  హైడ్రోజన్, హీలియం మరియు స్టార్ డస్ట్ లతో నిండి ఉంటుంది. నిహారిక ఘనీభవించి అత్యధిక వేడి కారణంగా పేలిన సందర్భంలో అనేక మేఘ శకలాలు ఏర్పడ్డాయి. అందులోని  శకలాల కుటుంబమే  మన సూర్య కుటుంబం.దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. సూర్యుడి కన్నా దాదాపు 40 నుండి 50 రెట్లు పెద్దదయిన 'వుల్ఫ్ రాయెట్' అన్న భారీ నక్షత్రం చుట్టూ గాలి బుడగల రూపంలో ఈ సౌర వ్యవస్థ ఏర్పడినట్లు వారు చెబుతున్నారు. భారీ పరిమాణంలో వున్న ఈ వుల్ఫ్ రాయెట్ నక్షత్రంలో వున్నపదార్ధాలన్నీ, వాటి పై నుండి వీచిన పెనుగాలుల ధాటికి గోళాకారంలో ఏర్పడినట్లు భావిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మన పురాణాల్లో సూర్యుడు గురించి చెప్పినవి వాస్తవం కాదని అవి కట్టుకథలని లోకానికి తేటతెల్లమైంది.

    మన సౌర కుటుంబం 4.6 బిలియన్(460కోట్ల) సంవత్సరాల ముందు ఏర్పడింది.  మొట్ట మొదట మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తర్వాత మిగిలిన గ్యాస్, డస్ట్ అంతా ఒక ప్లేన్ డిస్క్ లా అయి కొత్తగా ఏర్పడిన సూర్యుని చుట్టూ తిరిగింది. దీనినే ప్రొటోప్లానెటరీ డిస్క్ అంటారు. దీని నుండి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు ఏర్పడ్డాయి.

     మన గెలాక్సీ పేరు పాలపుంత. అది మన పొరుగు గెలాక్సీ ఆండ్రోమెడ కు దగ్గరలో ఉంది. మన సౌర కుటుంబం పాలపుంతలోని ఒక చివర ఉంటుంది . పాలపుంత కేంద్ర భాగానికి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో వుంది మన సౌర వ్యవస్థ. మనం వున్న ప్రాంతంలో నక్షత్రాల మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలు ఉంటుంది . సూర్యునికి దగ్గరగా వున్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ బి ( proxima centauri b) ఈ నక్షత్రం , సూర్యుని నుండి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. అంటే కొన్ని ట్రిలియన్ కిలోమీటర్ల దూరం .సూర్యుడు మిల్క్ వే (పాలపుంత) కేంద్రం చుట్టూ సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది.సూర్యుడు పాలపుంత గెలాక్సీ కేంద్రం చుట్టూ ఒకసారి పరిభ్రమి మించేందుకు పట్టే కాలం 250 మిలియన్  సంవత్సరాలు.ఇలా అంతరాళం లో పరిభ్రమిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు సూర్యుడు.

     మన సౌరకుటుంబానికి మూలాధారం కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే భూమి మీద నమస్త జీవజాలానికి సూర్యుడే ప్రాణదాత.మనకు వెలుగు, వేడి, శక్తి ప్రసాదించేది అతడే.జీవకోటికే కాదు.భూమికి కూడా అతడే ఆధారం. మిగిలిన గ్రహాలకు, ఉప గ్రహాలకు, గ్రహ శకలాలకు, తోక చుక్కలకు అన్నిటికి అతడే ఆధారం. సూర్యుడు లేనినాడు అవేవీ ఉండవు.శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్య నక్షత్రం, భూగ్రహం ఒకేసారి దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట ఆవిర్భవించాయి.

మనిషి పుట్టిన సమయానికి ఖగోళంలోని గ్రహస్థితులను బట్టి మనిషి జీవితం ప్రభావితం అవుతుందనే నమ్మకం మధ్యయుగాల్లో ప్రారంభమైంది. ఆ మనిషి జన్మించిన సమయం ప్రదేశం ఆధారంగా జాతక చక్రం తయారు చేయడం మొదలు పెట్టారు వాస్తవానికి గ్రహాలు మనుషుల పై చూపే ప్రభావం పై ఎలాంటి ఆధారాలు లేవు. వేదాలలో జ్యోతిష్యం లేదు ఆరు భాగాలుగా ఉన్న వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి.  ఇవి క్రీస్తు శకంఒకటో శతాబ్దం ప్రారంభంలో వచ్చాయి.  జ్యోతిష్యాన్ని 2,400 సంవత్సరాల క్రితం బాబిలోనియన్లు ప్రారంభించారు. అక్కడ్నుంచి అది ఈజిప్టుకు ఆ తర్వాత గ్రీకులకు చేరింది. గ్రీకు నుంచి భారతదేశానికి చేరింది.అలా జ్యోతిష్యం వేదాంగాలలో చేరింది.

      గ్రహాలు స్వయంప్రకాశం కావు. వాటి నుంచి వెలుతురు కూడా రాదు. వాటి ప్రభావం మనిషిపై ఎలా ఉంటుందో అర్థం కాదు. జ్యోతిష్యశాస్త్రం లో 9 గ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం సౌర కుటుంబం లో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. జ్యోతిష్యం లో సూర్యుడు చంద్రుడు గ్రహాలు. వాస్తవానికి సూర్యుడు ఒక నక్షత్రం.   చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుని వల్ల భూమిపై సముద్రాలలో ఆటుపోట్లు సంభవిస్తాయని అలాగే చంద్రుని వల్ల మనిషి పై ప్రభావం ఉంటుందని వాదించే ఛాందసులు కూడా ఉన్నారు. వాస్తవానికి భూమిపై సముద్రంలో ఆటుపోట్లు చంద్రుడు లేకపోయినా సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనిషికి భవిష్యత్తుపై ఆశ ఉంటుంది. గ్రహాలు ఏదో సహాయం చేస్తాయంటే తమపై ఆత్మ విశ్వాసం లేని వాళ్ళు నమ్ముతారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొంతమంది పరాన్నజీవులు జ్యోతిషాన్ని ప్రచారం చేసి తమ కడుపు నింపుకుంటున్నారు.

       జ్యోతిష్య శాస్త్రంలో ప్రవీణునిగా వరాహ మిహిరుని గురించి చెబుతారు. వాస్తవానికి మిహిరుడు తన దేశపు రాజు కొడుకు వరాహం ద్వారా చనిపోతాడని జోష్యం చెప్తాడు. అది నిజం కావడం కోసం ఆయనే ఒక చెలికత్తె ద్వారా బంగారు వరాహ విగ్రహాన్ని రాకుమారుని పుట్టినరోజు బహుమతిగా పంపిస్తాడు. ఆ పిల్లవాడు బొమ్మ తో ఆడుకుంటూ దాన్ని మీద వేసుకుని దాని బరువు శ్వాస ఆడక మరణిస్తాడు. దాంతో మిత్రునికి మంచి గుర్తింపు పేరు వస్తుంది. అప్పటి నుంచి అతని వరాహమిహిరుడు అని అంటారు.

జ్యోతిష్య శాస్త్రం గా చెప్పిన నా అది శాస్త్రం కాదు. అది శాస్త్రీయ పరిశీలనకు నిలబడదు. కేవలం నమ్మకాల మీద సాగుతోంది సైన్స్ అభివృద్ధి చెందుతున్న విద్యావంతులు కూడా జ్యోతిష్యం విశ్వసిస్తున్నారు. ఇందుకు టీవీలు ఇతోధికంగా ప్రచారం కల్పిస్తున్నాయి కానీ ఇదొక సూడోసైన్స్ మాత్రమే.

      విద్యావంతులు కూడా ఇరువురి జాతకాలు సరిపోతాయో లేదో  చూసి  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మనదేశంలో. వేమన దీనిని చూసి ఏనాడో

విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి,
సతిపతులను కూర్చి సమ్మతమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా 
|| విశ్వ!! 

అని జాతకాలను విమర్శించాడు.

        కానీ ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలనుకునేవారు జాతకాలకు బదులు జన్యు క్రమాలను పరీక్షించుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెపుతున్నారు. యూదులు జన్యు పరీక్షల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. డోర్‌ యషోరిమ్‌ అనే వెబ్‌సైట్‌ యూదుల జన్యుక్రమాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుందని.   వివాహం చేసుకోవాలనుకున్నవారు సంప్రదించినప్పుడు ఇద్దరిలోనూ వ్యాధికారకమార్పులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తుందన్నారు. దక్షిణాసియా ప్రాంత ప్రజలకూ ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే తర్వాతి తరాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.

      Pc:Wikipedia

         మన సౌర కుటుంబంలో ప్రస్తుతం 8 గ్రహాలున్నాయి. సౌర కుటుంబం 3 భాగాలు గా వుంటుంది. 

1. ఇన్నర్ సోలార్ సిస్టం  (అంతర గ్రహాలు)

2. ఔటర్ సోలార్ సిస్టం (బాహ్య గ్రహాలు)

3. ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజన్  

       ఇన్నర్ సోలార్ సిస్టమ్ లో 4 గ్రహాలు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఆస్టిరాయిడ్స్ బెల్ట్ వుంటుంది. ఆ 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు(కుజుడు).వీటిని రాతి గ్రహాలు అని కూడా అంటారు. . ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి. వీటిని ‘టెరిస్ట్రియల్’ గ్రహాలంటారు.

       ఔటర్ సోలార్ సిస్టంలో గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్‌లు. ఇవి హైడ్రోజన్, హీలియం సమ్మేళనంతో ఉంటాయి. వీటిని ‘జోవియన్’ గ్రహాలు అని కూడా అంటారు.

     నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజియన్) ఆవల  మంచుతో కూడిన ప్రాంతం ఉందని కైపర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు.ఆ ప్రాంతాన్నే కైపర్ బెల్ట్ అంటారు.ఇక్కడ అనేకడజన్ల నుండి కొన్ని వేల మరుగుజ్జు గ్రహాలున్నాయి.     ప్లూటో, ఐరిస్, సెరెస్ లాంటివన్నీ కూడా అలాంటివే.   

      సూర్యుని చుట్టూ ఓ ప్రత్యేక కక్ష్యలో బుధుడు(Mercury), శుక్రుడు(venus), భూమి(earth), అంగారకుడు(mars) బృహస్పతి(Jupiter), శని(Saturn), యురేనస్(Uranus), నెప్ట్యూన్(Neptune) మొత్తం ఎనిమిది గ్రహాలు తిరుగుతున్నాయి.

         గ్రహాలన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతాయి.  

   జ్యోతిష్యశాస్త్రం నవగ్రహాలున్నాయని చెపుతుంది. అందులో సూర్యుడు  గ్రహమే. చంద్రుడు కూడా గ్రహమే. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు ఇతర గ్రహాలు.

       సూర్యుడు గ్రహంకాదు.అది స్వయం ప్రకాశక నక్షత్రం మనకు తెలుసు.దాని చుట్టూ భూమితో సహా ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి.జ్యోతిష శాస్త్రం సైన్సు కాదని అది చెప్పే విషయాలు వాస్తవం కాదని ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందేకొద్దీ  మనకు తేటతెల్లం అయినాయి.   జ్యోతిష శాస్త్రం చంద్రుని గ్రహంగా పేర్కొంటుంది. కాని చంద్రుడు గ్రహం కాదు. భూమికి ఉపగ్రహం మాత్రమే. అలాగే జ్యోతిష్యశాస్త్రం చెప్పే రాహువు, కేతువు నిజంగా లేవు. అవి గ్రహాలని వారు చెప్పినా వాటిని రాక్షసులుగా చిత్రీకరించారు.యురేనస్, నెప్ట్యూన్  గ్రహాలు జ్యోతిష్యశాస్త్రంలో లేవు.

     నిజానికి సూర్యుడు మండుతున్న ఒక అగ్నిగోళం. ఇంకా చెప్పాలంటే ఒక వాయు గోళం.సూర్యుడు తన చుట్టూ తాను తిరిగేందుకు   27 రోజులు, 7గం|| 43 ని.లు పడుతుంది.తన చుట్టూ తాను తిరుగుతూ తనతో పాటు సౌర కుటుంబం గాలక్సీ చుట్టూ తిరుగుతుంది.ఇలా ఒక చుట్టు తిరగడానికి సుమారు 250 మిలియన్ల సంవత్సరాలు తీసుకుంటుంది.

 సూర్యునిలో 71 %  హైడ్రోజన్ ఉంటే, 26.5%  హీలియం ఉంటుంది. సూర్యునిలో హైడ్రోజన్ అణువుల సంయోగం వల్ల  హీలియం గా మారుతుంది.అపుడు అపారమైన శక్తి వెలువడుతుంది. ఇదే విధంగా ఇతర నక్షత్రాలలోకూడా హైడ్రోజన్ హీలియంగా మారి శ క్తి ఉత్పన్న మవుతున్నది. సూర్యుని లో సెకనుకు 58 కోట్ల 40 లక్షల టన్నుల హైడ్రొజన్, 5 కోట్ల టన్నుల హీలియంగా మారిపోతున్నది. దీనివల్ల సెకనుకు 10 లక్షల టన్నుల హైడ్రోజన్ నష్టమై పోతోంది. ఇలా నష్టమైన ద్రవ్యమే శక్తిగా మారుతున్నది. ఆ శక్తే సూర్యుని ప్రకాశింపజేస్తోంది.అందులో కొంతభాగం భూమికి చేరడంవల్లనే మనకు కాంతి, ఉష్టం లభిస్తోంది.సూర్యునిలోనుంచి గుండు సూది గుండంత(pinhead)  పదార్థాన్ని  భూమికి తీసుకువస్తే దాని శక్తితో కొన్ని నగరాలను భస్మీపటలం చేయొచ్చు.ఇలా సుమారు 500 కోట్ల సంవత్సరాలుగా అలాగే ప్రకాశిస్తున్నాడు.సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. సూర్యుని గర్భంలో ఉష్ణోగ్రత ఒక కోటి 40 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్.సూర్యుడి వ్యాసం సుమారు 14 లక్షల కిలోమీటర్లు. (13,91,980 కి.మీ.)

     మన సూర్యుడు ప్రస్తుతం నడివయసులో ఉన్నాడు. వయసు మళ్లుతోంది. నిరంతరం మండే ప్రక్రియలో హైడ్రోజన్ అయిపోతోంది. ఇది మరో 500 కోట్ల ఏళ్లలో పూర్తిగా ఖర్చవుతుంది.అప్పుడు ప్రళయం వస్తుంది. అంతవరకు భూమికి ఢోకా లేదు.

     సూపర్ నోవా లాగానే 500 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కూడా కుచించుకుపోయి చిన్నగా అయ్యి ఒక్కసారిగా పేలిపోతాడనీ ఆ పేలుడుతో వచ్చే మంటలు, ఎనర్జీ దాటికి సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు, గ్రహశకలాలూ అల్లకల్లోలం అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అప్పుడు మన భూమి అంతమవు తుందన్నమాట.

     సౌర కుటుంబంలో సూర్యుడు, ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. ఎనిమిది గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది. 

     కళ్లకు కనిపించేదంతా నిజం కాదు. అందువల్ల పరిశీలన ద్వారా నే వాస్తవాన్ని కనుగొనగలం.   ఆకాశంలోని సూర్యబింబం దాదాపు చంద్రబింబం అంత చిన్నదిగా ఉంటుంది.అయితే అదొక భ్రమ మాత్రమే. వాస్తవానికి సూర్యుడు అతి పెద్ద నక్షత్రం.ఆ భ్రమకి కారణం భూమికీ సూర్యుడికీ మధ్యనున్న దూరం భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరానికి 400 రెట్లు ఎక్కువగా ఉండటమే. సౌర వ్యవస్థలో అత్యంత దూరంలో వున్న ప్లూటో  నుంచి  మనం సూర్యుడిని చూస్తే  సూర్యుడు మనకి చిన్న బిందువులాగా కనిపిస్తాడు.

     సౌరవ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే. దీన్ని గ్రహాంతర మాధ్యమం (ఇంటర్‌ప్లానెటరీ మీడియమ్) అంటారు. కాంతితో పాటు, సూర్యుడు ఛార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లు తుంటాడు. వీటిని సౌరగాలులు అంటారు. ఈ పదార్థాలు గంటకు 15 లక్షల కి.మీ. వేగంతో విస్తరిస్తుంటాయి.సౌరగాలులు భూమిపైన వాతావరణాన్ని చెదరగొట్టి నాశనం చెయ్యకుండా దాని అయస్కాంత క్షేత్రం కాపాడుతుంది.శుక్రుడు, అంగారకులపై ఎలాంటి అయస్కాంత క్షేత్రం లేదు. అందువల్ల సౌరగాలులు ఈ గ్రహాల పైన వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.

      అప్పుడప్పుడు సూర్యునికి గ్రహణం పడుతుంది. గ్రహణం అంటే సూర్యుని కాంతి తాత్కాలికంగా కనిపించకపోవడం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని పూర్వీకులు దీనికి ఒక కథ అల్లారు. ఆ కథలో దేవగణం,రాక్షస గణం ఒకసారి అమృతం(మద్యం) కోసం పోట్లాడుకుంటారు. వారి తగవు తీర్చడానికి విష్ణువు ఆడ వేషం వేసుకొని వారికి మద్యం పంచడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో రాక్షస గణానికి చెందిన రాహువు,కేతువు అనే వారిద్దరూ  దేవగణంలో సూర్య చంద్రుల మధ్య రహస్యంగా కూర్చొని అమృతం సేవిస్తారు. ఆవిషయాన్ని సూర్యచంద్రులు చూసి విష్ణువుకు సైగ చేసి తో చెప్తారు. అప్పుడు విష్ణువు తన చక్రంతో వారిని కొడతాడు. దాంతో రాహుకేతువులు ఇద్దరూ సూర్యచంద్రుల పై కోపంతో పగతో రగులుతూ ఉంటారు. అందువల్ల నే వారిద్దరూ  గ్రహణం నాడు సూర్యున్ని, చంద్రున్ని మింగుతూ ఉంటారని కథలల్లారు.

    మరో కథలో  జమదగ్ని,తన భార్య తో పట్ట పగలు శృంగారం జరుపుతూ ఉంటాడు. అది చూచిన సూర్యుడు ఇదేం పద్దతి అని జమదగ్ని నుంచి నిలదీస్తాడు. అందుకు జమదగ్ని కోపంతో నిన్ను రాహుకేతువులు అప్పుడప్పుడు మింగేస్తూ ఉంటారని శపిస్తాడు. సూర్యునికి ఏర్పడే గ్రహణాన్ని  ఈ కథ ద్వారా  అన్వయించారు. సూర్యుని గ్రహణం ఏర్పడడం అంటే రాహుకేతువులు మింగేస్తున్నారని ఇలాంటి పుక్కిటి పురాణాల ద్వారా ప్రచారం చేశారు. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడంతో ఈ గ్రహణాల బండారం బయటపడింది.17వ శతాబ్దం చివరి వరకూ ఎక్కువ మందికి గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో, నక్షత్రాలు ఎందుకు రాలుతాయో తెలీదు. అయితే 18వ శతాబ్దం నాటికి ఖగోళశాస్త్రజ్ఞులు గ్రహణాల వెనుక వైజ్ఞానిక కారణాలు కనుగొన్నారు. 

       కొన్ని సార్లు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి, భూమికి మధ్యలో ప్రయాణిస్తాడు. దాంతో, సూర్యుని నుంచి వచ్చే కాంతికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, భూమి ఉపరితలం పై చంద్రుని నీడ పడుతుంది.

కానీ, సూర్య గ్రహణాల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి. ఇవి చంద్రుడు సూర్యునిలో ఎంత భాగాన్ని కప్పాడు అనే విషయాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి.

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు.

కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా మారిపోయి, రాత్రిని తలపిస్తుంది.

     ఖగోళంలో జరిగే అరుదైన మార్పుల వల్లే సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడు చంద్రుని కంటే 400 రెట్లు వెడల్పుగా, 400 రెట్లు దూరంగా ఉంటాడు. సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ లోకి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వచ్చినప్పుడు, సూర్యుని ఉపరితలాన్ని చంద్రుడు కప్పేస్తాడు. దాంతో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అత్యంత సుదీర్ఘమైన సూర్య గ్రహణం 7 నిమిషాల 32 సెకండ్ల పాటు ఉంటుంది. ఇది తరచుగా ప్రతి 18 నెలలకొకటి వస్తూనే ఉంటుంది.కాకపొతే, సంపూర్ణ సూర్య గ్రహణం ఒకే చోట నుంచి మళ్లీ కనిపించదు. ఇది సగటున 375 సంవత్సరాల కొక్కసారి జరుగుతుంది.

       Pic courtesy: bbc.com

చంద్రుడు భూమి నుంచి దూరంగా ఉన్నప్పుడు, పూర్తిగా సూర్యుని ఉపరితలాన్ని కప్పినప్పుడు, చాలా చిన్నగా కనపడతాడు.

దాంతో, చంద్రుని చుట్టూ ఒక రింగ్ ఆకారంలో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. దీనినే వలయాకార సూర్య గ్రహణం అంటారు.సాధారణంగా ఈ గ్రహణాలు 5 లేదా 6 నిమిషాలు మించి ఉండవు.

గ్రహణం సమయంలో సూర్యుడు వలయాకారంలో కనిపిస్తాడు. దీనిని 'రింగ్ ఆఫ్ ఫైర్' లేదా 'అగ్ని వలయం'గా వర్ణిస్తున్నారు.ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' కేవలం భూమిమీద  కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఈ వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ ఖగోళ ఘటన సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. దానివల్ల కొంత సమయంపాటు ఒక నిర్ధిష్ట ప్రాంతంలో చీకట్లు అలుముకుంటాయి.

           pic courtesy: NASA,(bbc.com)

అయితే చంద్రుడు చిన్నగా ఉండడం వల్ల, అది సూర్యుడిని పూర్తిగా కప్పేయలేదు. అందుకే, చంద్రుడి అంచుల్లో సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపిస్తాడు. 

    విజ్ఞానం ఎంతో వికసించినా గ్రహణం అరిష్టాలకు సంకేతమని నమ్మేవారు ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు. అంటే వీరంతా గ్రహణాన్ని  భయంకరమైన కల్లోలాలకు ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. 

     శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్ర‌గ‌తి సాధించిన అమెరికాలోనూ మూఢ‌న‌మ్మ‌కాలు బలంగా ఉన్నాయి. గ్రహణం రోజున ‘బల్లి మనిషి’ ఎదురుకావచ్చని అక్కడి ప్రజల నమ్మకం. 1988లో క్రిస్టోఫర్ డేవిడ్ అనే వ్యక్తి బల్లి మనిషిని చూశాడని అక్క‌డి వారి న‌మ్మ‌కం. అత‌డు విచిత్రంగా ఉన్నాడ‌ని అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయంగా హ‌ల్‌చ‌ల్ చేసింది. సూర్యగ్రహణం రోజున అతడి నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి అంద‌రూ నల్లని టీ షర్టులు ధరించాలనే ఓ వార్త‌ కూడా అక్క‌డ‌ వైర‌ల్‌గా మారింది.

పశ్చిమ ఆసియాలో (యూరప్, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అని, మధ్య ప్రాచ్యం అని అంటారు)గ్రహణం సమయంలో ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేయడానికి ప్రయత్నిస్తుందని, అందుకే, దాన్ని తరిమేయడానికి గ్రహణం సమయంలో డోలు బాజా మోగిస్తారు.

   చైనాలో స్వర్గానికి చెందిన ఒక కుక్క సూర్యుడిని మింగేసేందుకు ప్రయత్నిస్తుందని అందుకే గ్రహణం ఏర్పడుందని భావిస్తున్నారు.

     సూర్య గ్రహణం సమయంలో ఆకాశంలో ఒక తోడేళ్ల జంట సూర్యుడిపై దాడి చేస్తుందని గ్రీసు పురాణాల్లో నమ్ముతారు.

మధ్యయుగంలో యూరప్‌ ప్రజలు సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణాన్ని బైబిల్‌లో ప్రళయంగా భావించేవారు. యుగాంతం రోజున సూర్యుడు పూర్తిగా నల్లగా మారుతాడని, చంద్రుడు ఎర్ర రంగులో కనిపిస్తాడని బైబిల్లో ప్రస్తావన ఉంది.

     మనదేశంలో జ్యోతిష్కులు ఇలాంటివే ఇప్పటికీ టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇవి కేవలం మూఢనమ్మకాలు తప్ప మరేమీ కాదు.

     గ్రహణాలు , ప్రత్యేకించి సంపూర్ణ సూర్య గ్రహణాలు పరిశోధకులకు ఎంతో ఇష్టమైనవి. ఎన్నో అద్భుత రహస్యాల్ని పరిశోధించేందుకు అవి ఎంతో మంచి అవకాశాలు!

     గ్రహణం గురించి మొదటగా చైనీస్ భాషలో ఉన్న షంచింగ్ అనే గ్రంథంలో ప్రస్తావించారు. ఈ పుస్తకం దాదాపు 4వేల సంవత్సరాల క్రితానికి చెందింది. క్రీస్తూపూర్వం 2137 అక్టోబరు 22న సంభవించిన సూర్య గ్రహణం గురించి ఇందులో పొందుపరిచారు.



Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం