వేల వేల సంవత్సరాలు మనుషులు సమృద్ధిగా ఆహారం, సమతుల శీతోష్ణస్థితి ఎక్కడుంటే అక్కడికి వలసలు వెళుతుండేవారు. భయాలు, భ్రాంతులూ లేక శిలాయుగమంతా స్వేచ్ఛా జీవులుగా సంచార జీవితం గడిపారు. క్రీ.పూ.(బీసీఈ) 7000 ఏండ్ల వరకూ స్థిరనివాసాలు ఏర్పరుచుకున్న దాఖలాలు లేవు. క్రీ.పూ.5000 నుంచి మాత్రమే స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడం.. ఫలితంగా నాగరికతలు ప్రారంభం కావడం జరుగుతూ వచ్చింది. అన్నిటికన్నా ముందు మొసపొటేమియా నాగరికత ఏర్పడితే, తర్వాత గ్రీకు మంచూరియన్, సుమేరియన్ నాగరికతలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారత భూభాగంలో సింధూ నాగరికత ఏర్పడింది. తొలినాళ్ళలో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. ఆ తర్వాత గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి వంటివాటిని గుర్తించుకున్నారు. అవే జీవనాధారాలని గుర్తించి, వాటిని పూజించడం ప్రారంభించారు. మూలకాల కలయిక వల్లనే జీవి ఏర్పడిందని తెలుసుకున్నారు. తర్వాత కాలంలో సృష్టికి మూలకారణం మానవ ప్రత్యుత్పత్తి అవయవాలు గనక, వాటిని పూజించడం మొదలు పెట్టారు. అందుకే వాటికి గుళ్ళు కట్టుకుని పూజలు చేయడం మొదలైంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత దేవుడు ఒక్కడే అనే భావన ఉండేది. తర్వాత, దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనే భావనతో ...