విశ్వమంటే ఏమిటి?
విశ్వమంటే ఏమిటి?
"విశ్వానికి అవధులు లేవు, లేకపోతే దానికి అంచులనేవి ఉండితీరేవి."
___లుక్రెటియస్('డె రేరమ్ నతూర',పదార్థాల స్వభావం )
ఆకాశంలో మనకు కనిపించే కోటాను
కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, మన సౌర కుటుంబం మొదలైన అంతరిక్ష పదార్ధాల సముదాయాన్ని విశ్వం అంటాం. విశ్వం లోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షం, కాలం, అన్ని రూపాల పదార్థం, బలం,గతి,భౌతిక నియమాలు వీటిని నియంత్రిస్తూ వుంటాయి. విశ్వం అనే పదానికి 'జగత్తు', 'ప్రపంచం', 'ప్రకృతి' అనే అర్థాలూ ఉన్నాయి.
విశ్వం లోని నక్షత్రాల సమూహం గురించి మానవుడు నాలుగు వేల సంవత్సరాల కిందటే అధ్యయనం చేశాడు. ప్రథమంగా సుమేరియన్లు ఆ తర్వాత బాబిలోనియన్లు పటాల ఆధారంగా వీటిని అధ్యయనం చేశారు.
మొదట భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఉంటాయనుకున్నారు. భూమిని చాపలాగా చుట్టు కోవచ్చని భావించారు.
క్రీ శ. 2వ శతాబ్దంలో (140 AD) గ్రీకు దేశానికి చెందిన క్లాడియన్ టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం నక్షత్రాలు, ఇతర గ్రహాలు మొదలైనవి భూమిని కేంద్రంగా చేసుకొని తిరుగుతున్నా యని పేర్కొన్నాడు.
భూమి ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయన్న విషయాన్ని క్రీ. పూ. 3 శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కస్ లోకానికి వెల్లడించాడు. భూమి నుంచి సూర్య చంద్రుల దూరాలను లెక్కించడానికి అతడు చాలా ప్రయత్నాలు చేశాడు.
దాదాపు 300 సంవత్సరాల తరువాత ఆర్యభట్ట క్రీ.శ.506కాలంలో గ్రహాలు వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం లో (elliptical)
తిరుగుతున్నాయని కూడా ఆయన ప్రతిపాదించారు. ఇక అప్పటివరకూ భూమి చుట్టూ ఆకాశం తిరుగుతోందనే భావనకు విరుద్ధంగా, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తున్నాయని చెప్పినాడు.భూకేంద్రక సిద్దాంతం ఆధారంగా మన దేశంలో జ్యోతిష్యం పుట్టింది.ఆనాటి వ్యవసాయ సమాజం నడవడానికి రుతుపవనాలు,ప్రకృతి లో కాల గమనం గురించి చెప్పడానికి ఉపయోగపడింది. కానీ గ్రహాలు జీవితాన్ని నిర్దేశిస్తాయని చెపుతూ విశ్రాంత జీవులు
సమాజ పరాన్నభుక్కులు గా మారి ప్రజల్లో అనేక విశ్వాసాలను పెంపొందించారు.శాస్త్రవిజ్ఞానం పెరిగేకొద్దీ జ్యోతిషం విలువ తగ్గిపోతోంది.
Pc: Wikipedia, omar khayyaam
క్రీ.శ. 11 వ శతాబ్దానికి పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన ఒమర్ ఖయ్యామ్ కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
క్రీ.శ 16వ శతాబ్దం లో (1543AD) పోలెండ్ కు చెందిన నికోలస్ కోపర్నికస్ విశ్వం నక్షత్రాల పుట్టుకకు సూర్యుడు మాతృక అన్నాడు.
గ్రహాల కదలికలు ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించాడు. దీన్ని సూర్య కేంద్రక సిద్ధాంతం అన్నారు.భూమి తన అక్షం పైనే తిరుగుతుందని అందువల్లే రాత్రి పగలూ ఏర్పడుతున్నాయని తెలిపాడు. భూభ్రమణ, పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, రుతువులు మారుతున్నాయని గ్రహించాడు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా వాటిని బయట పెట్టడానికి కోపర్నికస్‌కు ధైర్యం చాలలేదు. అప్పట్లో ఎవరూ ఇతన్ని నమ్మలేదు. ఎందుకంటే ఆనాటి మత పెద్దలు బైబిల్ ను మాత్రమే నమ్ముతున్నారు.మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలలో సూర్యుడే భూమి చుట్టూ తిరుగు తున్నాడని రాసి ఉండటమే దీనికి కారణం.
అయితే గెలీలియో టెలిస్కోప్ కనుక్కోవడం తో కోపర్నికస్ సిద్ధాంతం వాస్తవమని తేలింది . అప్పుడు అందరూ ఆమోదించారు.
"ఈ విశ్వమంతా nebula అనే వాయువుతో పెద్ద వెలుగున్న మేఘంలా ప్రారంభమై ఉంటుంది" అని ఊహించాడు ఇమాన్యుయేల్ కాంట్ అనే జర్మనీ తత్వవేత్త(1724_1804). ఈ విశ్వమంతా ఒకేసారి తయారవక ఒక పరిణామక్రమంలో ఏర్పడి ఉంటుందని కాంట్ భావించాడు.
క్రీ.శ.1805 లో హెర్బల్ ఆకాశాన్ని టెలిస్కోప్ ద్వారా నిశితంగా పరిశీలించి విశ్వమంటే
సౌర కుటుంబం ఒకటే కాదనిఅంత కన్నా పెద్దది కనుగొన్నాడు. సూర్యుని లాంటి లక్షలాది నక్షత్రాలు గల 'పాలపుంత నక్షత్ర మండలం' మన విశ్వం అని చెప్పాడు. దీనిని గెలాక్సీ అన్నారు.
1925లో ఎడ్విన్ హబుల్ ఈ విశ్వంలో మన పాలపుంత గెలాక్సీ లాంటివి లక్షలాది ఉన్నాయని కనుగొన్నాడు. ఆ గెలాక్సీలు ఒకదాని నుండి మరొకటి దూరంగా ఎక్కడికో పరిగెత్తుకు పోతున్నాయని కనుగొన్నాడు.
గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒక నక్షత్రం. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఇతర గ్రహాలతో పాటు తానున్న గెలాక్సీ కేంద్రకం చుట్టూ గంటకు 7,20,000 కి.మీ. వేగంతో తిరుగుతోంది. దానికి పట్టే కాలం 225×10(6). దీన్ని ఒక కాస్మిక్ యూనిట్ అంటారు. భూమి నుండి సూర్యుడి దూరం 14,95,98,500 కి.మీ. దీనిని ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ అంటారు. గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ తమని ఆకర్షించే వాటి చుట్టూ గురుత్వాకర్షణ బలంతో
పడిపోకుండా తిరుగుతున్నాయి.
విశ్వంలో 1100 ఏళ్ల క్రితం ఏర్పడిన అతిపురాతనమైన సర్పిలాకార పాలపుంతను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి 'ఏ1689బీ11 గా నామకరణం చేశారు. దీన్ని అధ్యయనం చేస్తే జగత్తు ప్రారంభం గురించి అనేక విశే షాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం(ఏఎన్ యూ), స్విన్ బర్న్ సాంకేతిక విశ్వవి ద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ నక్షత్రవీధిని కనుగొన్నారు.
విశ్వంలో 900 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్న ఒక నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్ అంతరిక్ష టెలిస్కోపు దీని ఆచూకీని పసిగట్టింది. నీలవర్ణంలో ఉన్న ఈ భారీ తారకు 'ఐకారస్' అని పేరు పెట్టారు. విశ్వం నిడివిలో ఇది దాదాపు మధ్యభాగంలో కొలువై ఉంది. ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని వీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు ఒక రికార్డు సృష్టించారు. ఓ శంఖాకార గెలాక్సీలో ఈ నక్షత్రం ఉంది. ఇది ఎంత దూరంలో ఉందంటే.. దాని కాంతి భూమిని చేరడానికి ఏకంగా 900 కోట్ల సంవత్సరాలు పడుతుంది. గురుత్వాకర్షణ లెన్సింగ్ పాటు హబుల్ టెలిస్కోపునకున్న అద్భుత స్పష్టత సామర్థ్యాన్ని ఉపయోగించుకొని శాస్త్రవేత్తలు ఐకారస్ నక్షత్రాన్ని వీక్షించగలి గారు.
నేడు విశ్వం అంటే లక్షలాది గెలాక్సీల సమూహం. అది ఎక్కడికో పయనిస్తూ ఉంది.
అందులో ఒక పాలపుంత నక్షత్ర మండలం ఒక గెలాక్సీ అని పైన చెప్పుకున్నాం. అందులో ఉన్న ఒక సౌర కుటుంబంలో మన భూమి ఉంది. మన సౌరకుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ లో అనేక ఇతర నక్షత్రాలు ఉన్నాయి. వాటి మధ్య కోట్లాది కిలోమీటర్ల దూరం ఉంది.
మన పాలపుంత గెలాక్సీ వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలు.ఈ విషయం లో ఒక్కో గాలక్సీ కి మధ్య కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది.
విశ్వం 1250 కోట్ల కాంతి సంవత్సరాల దూరం విస్తరించి ఉంది. ఆ తర్వాత అది అగోచరం.
కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరం లో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరం అని అర్థం.కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.(1,86,282మైళ్లు).
మనకు ఐదు కాంతి సంవత్సరాల దూరంలో ఒఫియాకస్ అనే నక్షత్ర రాశి ఉంది.
స్థూలంగా విశ్వరూపం ఇలా ఉంది. మన సౌర కుటుంబం ఒక పాలపుంత (మిల్క్వే)కు చెందింది. ఆ పాలపుంత ఒక గెలాక్సీ. ఇటువంటి కొన్ని వేల గెలాక్సీలు కలిసి ఒక గుంపుగా ఏర్పడ్డాయి. అటువంటి కొన్ని కోట్ల గెలాక్సీ గుంపులు కలిస్తే విశ్వం అవుతుంది.
విశ్వంలో ప్రతిదీ పరస్పర ఆధారంతో నిలిచి ఉన్నాయి ప్రతి రెండింటి మధ్య ఆకర్షణ వికర్షణ శక్తులు ఉన్నాయి. విశ్వానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది.విశ్వంలో కాంతి ఉంది.చలనం ఉంది. సౌరమండలంలో ని సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు అన్ని తిరుగుతున్నాయి. మిల్క్ వే కూడా తిరుగుతూ ప్రయాణిస్తోంది అలాగే భూమి 18.5 మైళ్ల వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టు తాను తిరుగుతూ ఉంది.
విశ్వం లో చీకటి ఉంది. చీకటి అంటే మనకు కనిపించనదని భావిస్తాం. కాని అక్కడ అపారమైన శక్తి ఉందని అందరూ భావిస్తున్నారు. దానిని డార్క్ మేటర్ అంటున్నారు.
విశ్వంలో ఖాళీ స్థలం ఉంది. నిజంగా అది శూన్యంగా లేదు. దాని నిండా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ శక్తి ఉంది. ఆశక్తి క్రమంగా తిరిగి అణువుగా రూపాంతరం చెందుతుంది. అణువులు గురుత్వాకర్షణ కారణంగా దగ్గరగా వాయు పదార్థంగా ఒక్కచోట చేరుతాయి. ఆ వాయు పదార్థం అండాకారాన్ని పొంది అది సంకోచించే కొద్దీ వేడి పెరుగుతుంది చివరకు అదే నక్షత్రంగా ప్రకాశిస్తుంది. అటువంటివి కొన్ని కోట్లు చేరి గ్యాలక్సీ గా మారిపోతాయి.
ఈ విషయం గురించి మనకు తెలిసింది ఐదు శాతం అయితే తెలియనిది 90 శాతం ఉంది. విశ్వం నిత్యం మార్పు చెందుతూ ఉంది. ప్రతి క్షణం ఈ మార్పు జరుగుతోంది. ఏది మార్పు కు అతీతం కాదు. ఈ లక్షణాల్ని మనం నివసించే భూమి పైన కూడా చూడగలం.
దేవుడెలా పుట్టాడంటే అతను స్వంతంగా పుట్టాడు అంటారు భావవాదులు. ఆయనను స్వయంభువు అన్నారు. ఆయన ఆడా మగా అని అడిగితే, అవేం కాదు ఆయన ఆది మధ్యాంత రహితుడన్నారు. విశ్వం కూడా అంతే. విశ్వమే
విశ్వాన్ని సృష్టించుకుంది.అది స్వయంభువు.
ఏ దేవుడూ తీరికగా కూర్చుని ఈ విశ్వాన్ని (సకలచరాచరజగత్తుని) గానీ , జీవాన్ని గానీ ఎవరూ సృష్టించలేదు. కాలగమనంలో పరిణామ క్రమంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి.
సుమారు 1470 కోట్ల సంవత్సరాల క్రితం
మేఘాల రూపంలో ఉన్న హైడ్రోజన్ వాయువు గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఘనీభవించి ఒక ముద్దలాగా ఉండేది.అది 10 కోట్ల టన్నుల బరువుతో అతి చిన్న ముద్దగా ఉండేది. దీనినే ఆది పదార్థం లేదా బ్రహ్మాణువు అంటారు. దీనికి న్యూట్రానియం అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. జార్జ్ గమోన్ అనే శాస్త్రవేత్త ఇలెమ్ అనే లాటిన్ పేరు పెట్టారు. ఇలెమ్ అంటే ఆది పదార్థం అని అర్థం.
ఆది పదార్థం ఉక్కు కన్నా కోటానుకోట్ల సాంద్రత కలిగి వుండేది. ఒక పదార్థం వ్యాకోచిస్తే చల్లబడుతుంది. అదే సంకోచిస్తే వేడెక్కుతుంది. ఆది పదార్థం (ముద్దగా మారిన మేఘం) కుంచించుకుపోవటం (సంకోచించటం) వలన దానిలోని గురుత్వాకర్షణ శక్తి మెల్లగా ధర్మల్ శక్తిగా మారిపోయి వేడెక్కిపోయింది. దాని ఉష్ణోగ్రత 1500కోట్లు సెల్సియస్ స్థాయికి చేరుకుంది.
ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ముద్దలా ఉన్న ఆది పదార్థం పెద్ద ప్రేలుడుతో బ్రద్దలైంది. దీన్నే బిగ్ బ్యాంగ్ అన్నారు.
ఒక కంకరరాళ్ళ కుప్పను పెద్దరాయితో కొడితే ఎలా రాళ్లు చెల్లాచెదురవుతాయో అలా ప్రేలుడుతో ఆది పదార్థం చిన్న చిన్న ధూళి వాయు ముద్దల శకలాలుగా దూరంగా మహావేగంగా విస్తరించడం మొదలు పెట్టాయి. వాటినే గెలాక్సీ (పాలపుంత)లు అంటారు.
అలా ఈ విశ్వం పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది క్రమేపీ చల్లబడటంతో పాటు విస్తరించడం మొదలైంది. సుమారు నాలుగు లక్షల సంవత్సరాల తరువాత నుంచి విశ్వం మొత్తం పారదర్శకంగా మారిపోవడంతో బిగ్ బ్యాంగ్ కాలం నాటి కాంతి సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం మొదలైంది. కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్ అని పిలిచే ఈ కాంతి ద్వారా విశ్వం తాలూకూ ఆసుపాసులు అనేకం తెలుసుకోవచ్చునని జీమ్స్ పీబుల్స్ చెబుతారు. పీబుల్స్ చెప్పేదేమంటే... విశ్వంలో మొత్తం కిలో గ్రాము పదార్థం ఉందనుకుంటే.. మన చుట్టూ ఉన్న చెట్టూ చేమ, కంటికి కనిపించే గ్రహాలు, నక్షత్రాలు కనిపించని ఇతర పదార్థమూ కలుపుకుని ఉన్నది 50 గ్రాములే. మిగి లిన 950 గ్రాముల పదార్థం కృష్ణశక్తి, కృష్ణ పదార్థం. ఈ రెండింటి వివరాలు తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
విశ్వం పుట్టుక బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటం) ద్వారా జరిగిందనే సిద్ధాంతాన్ని ధ్రువీకరించడానికి
శాస్త్రవేత్తలు నవంబర్ 2010లో ఒక ప్రయోగం జరిపారు.విశ్వావిర్భావాన్ని కనుక్కోవడానికి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులోని భూగర్భంలో పదేళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన, ఖరీదైన 'లార్జ్ హార్డాన్ కొల్లైడర్' అనే యంత్రాన్ని నిర్మించారు.
ఈ యంత్రాలలో కాంతి వేగంతో ప్రయాణించే ప్రొటాన్ లను పంపించారు.ఇవి ఒకదానినొకటి ఢీ కొని విచ్ఛిన్నమయ్యాయి. ఆ ప్రయోగం లో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు.వారి ప్రకారం
ఈ విశ్వాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వ శక్తి క్షేత్రం ఒకటి ఆవరించుకుని ఉంది.ఈ క్షేత్రం విశ్వంలో ఉండే పదార్థంలోని మౌలిక కణాలతో సంపర్కం చెందడంతో higbosons అనే కణాలు ఏర్పడ్డాయి.
ఇవి పదార్థంలో ఉండే పరమాణువుల నిర్మాణానికి ఉపయోగపడే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులు పరమాణువులు ఏవీ ఉండేవి కాదు. నక్షత్రాలు గ్రహాలు ఏవీ ఉండేవి కాదు. జీవం అసలు ఉండేది కాదు. ఆఖరికి విశ్వం కూడా ఉండేది కాదు. ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకు నారు నీరు పోస్తున్నది ఈ ' హిగ్ బోసాను' అనే అనే అద్భుత కణమే. దీనినే శాస్త్రవేత్తలు దైవకణం ( God particle) అని పిలిచారు.
ప్రొటాన్లు ఢీ కొని విచ్ఛిన్నమైనప్పుడు
ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మ కణాల నుంచి శాస్త్రవేత్తలు 'హిగ్ బోసాను' అనే దైవకణాన్ని గుర్తించారు.
ప్రస్తుతం ప్రపంచంలో రెండు సిద్ధాంతాలున్నాయి. ఒకటి థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. దీన్ని మత విశ్వాసకులు నమ్ముతున్నారు. తమ తమ దేవుళ్లే ఈ సృష్టికి కారణమని వారు విశ్వసిస్తున్నారు. రెండోది పరిణామ సిద్ధాంతం. దీన్ని ప్రపంచమంతా ఆమోదిస్తున్నారు. అందువల్లనే శాస్త్రజ్ఞులు పై పరిశోధన చేసి మనకు వాస్తవాన్ని ముందుంచారు.ఇప్పటివరకు విశ్వాన్ని గురించిన పరిశోధనలన్నీ పరిణామక్రమంలో భాగంగానే ఏర్పడిందని రూఢీ అవుతూ వస్తోంది.
అన్నీ వేదాల్లో ఉన్నాయని చెప్పేవారు విశ్వం గురించి వేదకాలంలో( క్రీ.పూ.1500) ఆర్యులు
చెప్పినట్లు చెపుతుంటారు.ప్రకృతి గురించి, విశ్వం గురించి ఏమీ తెలియని దశలో సూర్యుడు, భూమి, అంతరిక్షం పై ఆనాటి బుద్ది జీవులు అనేక కవితలల్లారు. వీరు చెప్పే రుగ్వేదంలోని పదవ మండలంలో 128,129 నాసదీయ సూక్తం కవిత ఇలా చెపుతుంది.
"నా సదాసీ న్నో సదాసీ త్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరోయత్ |
కిమావరీవ: కుహ కస్య శర్మన్నంభ: కిమాసీద్ గహనం గభీరం || "
దీని అర్థం ఏమంటే: అప్పుడు అసత్తు లేదు, సత్తు లేదు. రజసి లేదు అనగా పాలపుంతలు,నక్షత్రాలు,లోకాలు ఏమీ లేవు.వ్యోమం (మహా శూన్యం)తప్ప దానికంటే ఇతరమైనది ఏమీలేదు.ఆవరణ ఏమిటి? ఎక్కడ, దేనికి స్థానము? (అంతు తెలియనిచోటు). గర్భంలోఎంతో లోతున నిగూఢంగా ఉన్నట్లుంది.
ఇలా ఆ సూక్తుల్లో "సృష్టికి ముందు అక్కడ 'సత్తు' లేదు. సత్తు అంటే ఉండటం. 'ఉండటం' అనేది లేదు. 'అసత్తు' కూడా లేదు. అసత్తు అంటే 'ఉండకపోవడం'. ఉండకపోవడం కూడా లేదు. ఆకాశము లేదు భూమి లేదు.పగలు లేదు రాత్రి లేదు. మృత్యువు లేదు. అమృతం లేదు. అక్కడ గంభీరంగా ఏదో ఆవరించి ఉంది.వాయువు లేని చోట ఏదో శ్వాసిస్తూ ఉంది"అని ఊహాత్మక గానం
చేశారు. దీన్ని బట్టి వారికి తెలియని విషయాన్ని
భౌతిక వాద దృష్టి తో చక్కగా వర్ణించారు.
అయితే తమకు తెలియని ప్రతి అద్భుతాన్ని దేవుని చర్యగా భావించారు. ఈ విశ్వాన్ని ఏదో ఒక శక్తి సృష్టించందన్నారు.అలాగే సూర్యుని కూడా దేవుని గా భావించారు.ఇప్పటికీ చాలా మంది విశ్వాన్ని ఏదో ఒక శక్తి సృష్టించిందని భావించేవారు చాలా మంది ఉన్నారు.
శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందే కొద్ది పాతభావాలు పటాపంచలై శాస్త్రీయ భావాలు ప్రజల్లో ఏర్పడతాయి.

Comments
Post a Comment