Kepler

            P.c: Britannia.com
కెప్లర్ 
 
         అతనో అవిటివాడో, కుంటివాడో, గ్రుడ్డివాడో కావచ్చు. కానీ అతని యొక్క నిరంతరకృషి, పట్టుదల వల్ల ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ - అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. అది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క కృషికి నిదర్శనం.మనిషి తలుచుకుంటే సాధించలేని కార్యమంటూ లేదు. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలను అధిగమించడం మాత్రం కొద్దిమందే చేస్తారు. ఆ కోవకు చెందిన వాడు కెప్లర్.

         సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేసి అఖండమైన ఖ్యాతిని గడించిన “కెప్లర్" మూడు ముఖ్యమైన సూత్రాలు ఖగోళ గణితంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.  

         కెప్లర్ జర్మనీలోని వైల్' నగరంలో 1571లో డిసెంబరు 27వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి పేరు "హైన్శ్ కెప్లర్”. ఇతనో రాజ సైనికుడు. తాగుబోతు. బాధ్యతలను మరచి ప్రవర్తించేవాడు. విధి నిర్వహణ సైతం సక్రమంగా చేయని కారణంగా సైనికుడి పదవి నుండి తొలగించివేశారు. తరువాత ఈయన తనకున్న యావదాస్తినీ అమ్మివేసి ప్రత్యేకంగా ఓ లాడ్జిని నడిపాడు. కెప్లర్ చిన్నతనం నుండీ ఆ లాడ్జిలోనే పనిచేసేవాడు. కెప్లర్ తల్లిపేరు "కాతరిన్ గుల్డెన్ మాన్". ఈమెకు చిత్తచాంచల్యం మెండు. మతిస్థిమితం లేనిది. అనవసర ఆవేశ కావేశాలతో తల్లి - సదా కోపగించుకొని కెప్లర్ను బాధించేది. ఆమె కట్టుకున్న భర్తకూ - కన్నకొడుక్కు దూరమయింది. ఆలోచనా పరిజ్ఞానం ఆమెకు యిసుమంతయినా వుండేదికాదు.
     దాదాపు 15 సంవత్సరాల వయసు వరకూ కన్నీరు కార్చని రోజు లేకుండా భయంకరంగా గడిచిపోయింది కెప్లర్ బాల్యం. అంతవరకూ కనీసం ప్రాథమిక విద్యకు సైతం నోచుకోలేకపోయాడు. బాల్యం నుండీ తీవ్రమయిన రోగాలతో అలమటించిపోయాడు. ఒడి చేర్చి లాలించే తల్లిలేదు. ఓదార్చే తండ్రి లేడు. ఆ దశలో దేనిమీదా ఆసక్తి, అనురక్తి, అభిరుచీ లేవు.

ఎన్నో సమయాలలో బ్రతుకు భారంగా అన్పించేది. చిన్నతనంలోనే మశూచి సోకి దృష్టిలోపం ఏర్పడింది. ప్రపంచాన్ని చూచే అదృష్టాన్ని సైతం కోల్పోయానే అనే బాధ ఆయన్ను కృంగదీసింది. ఏదైనా ఒక పని చేయాలంటే కుంటివైన చేతులు అంతగా సహకరించేవి కావు..
      ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో15 సంవత్సరాల వయసులో "టుబెజిన్ యూనివర్సిటీలో యూనివర్శిటీ"లో ప్రవేశపరీక్ష రాసి, 20 సంవత్సరాల వయసులో అదే యూనివర్శిటీలో ఎమ్.ఏ.లో పట్టభద్రుడయ్యాడు. ఇది అతని కఠోర దీక్షా తత్పరతకు చక్కటి నిదర్శనం. అక్కడే ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన గెలిలియోకు సమకాలీనుడు.

     మొదట్లో క్రైస్తవ మతబోధకుడు కావాలను కొన్నాడు. కానీ అది నచ్చక ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం అభ్యసించటం ప్రారంభించాడు.

"చదువుతున్న దశలోనే" ప్రొఫెసర్ మైఖేల్ మాస్టిలిన్ సమర్థించే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తాను కూడా యిష్టపడేవాడు.  

        జీవితంలో ఊహించని పరిస్థితులూ సహకరించని తల్లిదండ్రులూ, ప్రతిచోటా అపహాస్యానికి గురవుతూ కూడా ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న మహనీయుడుగా, ప్రపంచ చరిత్రపుటల్లో తన స్థానాన్ని స్థిరపరచుకొన్నాడు కెప్లర్.
        ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల ఉపాధ్యాయుడిగా చేరారు. 
 తర్వాత 1954వ సంవత్సరంలో గ్రాట్స్ యూనివర్శిటీలో ఖగోళశాస్త్ర లెక్చరర్ గా పనిచేసినాడు. అక్కడ రోమన్ కేథలిక్ మతాన్ని స్వీకరించమని వత్తిడి వచ్చింది. దాంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొన్నాడు.

1957లో కెప్లర్ "బార్బారా ముల్లర్వాన్ ములేఖ్"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె వల్ల కెప్లర్కు ఒక కొడుకు కలిగాడు. కానీ దురదృష్టవశాత్తు 1610వ లో అతని భార్య కుమారుడూ ఇద్దరూ ఓ ప్రమాదంలో మరణించారు. 1612వ సంవత్సరంలో కెప్లర్ మరలా వివాహం చేసుకొన్నాడు.

కెప్లర్ జీవితంలో ముఖ్యమైన మలుపు తిరిగింది. 
వ్రేగ్ అంతరిక్షశాలలో గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త, అత్యంత కోపిష్టి, భగవత్ ప్రియుడు, ఆచారాలూ సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించే టైకో బ్రాహి కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. పైగా
 టైకోబ్రాహి "భూకేంద్రక వాది”. కెప్లర్ "సూర్యకేంద్రకవాది". వీరిద్దరి మధ్య సంబంధం సిద్ధాంత పరంగా వ్యతిరేకమయినప్పటికీ అత్యంత సన్నిహితులుగా మసలేవారు.
అయినా టైకో బ్రాహి సైతం కెప్లర్ తో ఏకీభవించి తన
అమూల్యమైన పరిశోధనలను కెప్లర్కు అందించి వాటిని ఓ రూపంలో అమర్చి ప్రచురించమని చెప్పి 1601వ సంవత్సరంలో మరణించాడు. 1601 నుండి రోమన్ రెండవ చక్రవర్తి అయిన "రుడాల్ఫ్”, కెప్లర్ను తన ఆస్థానంలో "గణితశాస్త్రవేత్త"గా నియమించాడు.

      ఈ దశలోనే కెప్లర్ దాదాపుగా 10 సంవత్సరాలు అవిరళ కృషి జరిపి

(1) "కామెన్టరీస్ ఆన్ ది మోషన్స్ ఆఫ్ మార్స్"

(2) "హార్మోనీ ఆఫ్ ది వరల్డ్" అన్న గ్రంథాలు రాశాడు. వీటిల్లో తాను కనుగొన్న మూడు ముఖ్య సూత్రాలను వివరించాడు. ఇపుడు ఇవే ప్రపంచానికి మార్గదర్శకాలయ్యాయి.

ఆ ముఖ్యసూత్రాలు
 
(1) "సూర్యుని కేంద్రంగా (నాభిగా) చేసుకొని ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూంటుంది.
    రెండు గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిగుగుతుంటే మొదటి గ్రహం కేంద్రాలు (నాభులు) రెండవ గ్రహం కేంద్రాలు (నాభులు) ƒ1, ƒ2, ƒ1, ƒ3 అయితే వాటిలో ఒక నాభి ƒ1 వద్ద సూర్యుడు ఉంటాడు.
(2) సూర్యునీ, గ్రహాన్నీ కలిపే వ్యాసార్ధ సదిశ, సమాన కాలవ్యవధులలో, సమాన విస్తీర్ణాలను కల్గి వుంటుంది. (వ్యాసార్ధ సదిశ “విస్తీర్ణావేశం” స్థిరం).
       రంగువేయబడిన సెక్టార్లు A1, A2లు సమాన కాలవ్యవధులలో సమాన వైశాల్యాలు కలిగిఉంటాయి. అంటే A1 వైశాల్యం యేర్పడానికయ్యే కాలం, A2 వైశాల్యం యేర్పడానికయ్యే కాలం సమానం, వాటి వైశాల్యాలు సమానం.
(3) గ్రహాల భ్రమణ ఆవర్తన కాలాల వర్గాలు, సూర్యుని నుండి వాటి సగటు దూరాల, ఘనాలతో స్థిరాను పాతంలో ఉంటాయి.
      మొదటి గ్రహం, రెండవ గ్రహం యొక్క పరిభ్రమణ కాలాల నిష్పత్తి a13/2 : a23/2.
 
       కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి.సూర్య కేంద్రక సిద్ధాంతానికీ కచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని నియమాలు ప్రతిపాదించాడు. అవే కెప్లర్ గ్రహ గమన నియమాలు (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనుసరిస్తున్నారు.
    సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలో కదిలే ఒక బిందువు యొక్క స్థానాన్ని గణించడంలో కెప్లర్ సమీకరణం 
  M = E −ε sin E తోడ్పడుతుంది. 
       ఆస్థాన గణిత శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా సక్రమంగా జీతభత్యాలు వచ్చేవికావు. అధికార, నిర్లక్ష్య వైఖరి భరింపరానిదిగా వుండేది.  
1612లో ఆస్ట్రియాలోని "మింట్స్ యూనివర్శిటీ"లో గణితశాస్త్ర ప్రొఫెసర్ పదవిని నిర్వహించేవాడు. మతఛాందసుల నిర్వాకాల వల్ల ఆ పదవినీ త్వరలోనే కోల్పోయాడు. మరలా దారిద్య్రం - ఆర్థిక పరమైన ఇబ్బందులూ, బాధలూ కృంగదీస్తున్న పరిస్థితులలో ఆస్ట్రియా వదలి "ఊల్స్" నగరాన్ని చేరి 1627లో తన గురువుగారైన టైకోబ్రాహీ పరిశోధనల ఆధారంతో "రుడాల్ఫ్ టేబుల్స్" ప్రచురించి గురువు కోరిన చిరకాల వాంఛను తీర్చేశాడు. 
        చిట్టచివరి అవకాశంగా 1629లో "రాస్టాక్ యూనివర్శిటీ"లో గణితశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేయవలసినదిగా ఫ్రిడ్ లాండ్ రాజు కెప్లర్ను సగౌరవంగా ఆహ్వానించాడు.
      ఇలాంటి తరుణంలో తనకు రావలసిన బకాయిల కోసం కాటిస్బన్ నగరానికి అధికారులను కలవడానికి వెళ్ళినపుడు ఎవరూ అతని మొర ఎవరూ వినిపించుకోలేదు. ఈ వ్యవస్థ మీద ఏవగింపూ, అసహ్యం ఏర్పరచుకున్నాడు. ఆ నిరాశా నైరాశ్యాలతో చలి జ్వరంతో బాధపడుతూ 1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో అవిశ్రాంతమయిన తన జీవన సమరానికి తుది వీడ్కోలిచ్చాడు.

అటు ఖగోళ విజ్ఞానాన్నీ, ఇటు గణితశాస్త్రాన్నీ కొత్తపుంతలు తొక్కించి, భావితరాలకు మార్గదర్శకుడయిన మహనీయుడు కెప్లర్.నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది.చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు. 2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న తపాలా బిళ్ల విడుదలజేసింది.



ఆధారాలు:

1.గణిత మేధావులు గణాంక చిట్కాలు__ శ్రీధర చంద్రశేఖర శాస్త్రి
2. వికిపీడియా

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata