Darwin theory
Uma Maheswara Rao Dwadasi
మెండలీఫ్ ఆవర్తన పట్టికను తయారు చేసినప్పుడు పరమాణుభారాల ఆధారంగా ఆ పట్టికను ఏర్పాటు చేసేడు. అయితే ఆ పట్టికలో కొన్ని ఖాళీలుండి పోయేయి. ఎందు కంటే ఆ మూలకాలను అప్పటికి ఇంకా కనుక్కో లేదు. కానీ ప్రకృతి ఓ క్రమాన్ని అనుసరిస్తుందనీ కాబట్టి అవి ఖచ్చితంగా ఉంటాయనీ భావించి ఆ ఖాళీలు ఉంచాడు. చాలా మంది దీన్ని వ్యతిరేకించేరు. ఊహలు నిజాలు కావన్నారు. కొన్ని అతనున్నప్పుడే కనుక్కో బడ్డాయి. మరి కొన్ని అతను మరణించిన తరువాత కనుక్కోబడ్డాయి. కానీ ఆయన ప్రతిపాదనలు మాత్రం నిజమని రుజువయ్యాయి. సిద్ధాంతం మీద విమర్శలుంటాయి. వాటిని సమాధాన పరచ గలిగితే అదే శాస్త్రం అవుతుంది. అలాక్కాకుండా అసాధ్యమైన నేల విడిచి సాముచేసే ఊహలు పుక్కిటి పురాణాలౌతాయి.:
సీబీఎస్ఈ సిలబస్ మార్చేరుట. అయితే ఇప్పటి ప్రణాళిక కాదు.వసుంధరా రాజే రాజస్థాన్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడే దీనికి తెర లేచింది. ఇప్పుడు పూర్తి క్రియాత్మక రూపాన్ని తీసుకొంది. చదువనేది మనిషిని ఆటవికం వైపు నుంచీ నాగరికత వైపుకి ప్రయాణింప చేస్తుంది.అదీ పరిశోధనాత్మక మైన, అనుభవ పూర్వకమైనదైతే! అలాంటి చదువు మన నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నాసరే దానిమీదే ఆధార పడాలి. అలా పడ్డాం కాబట్టే ఈనాడు మిగతా జీవులకు భిన్నంగా ఇంత అభివృద్ధి చెందేం. అలాంటి అభివృద్ధి కారకమైన ఆవిష్కరణలలో ప్రధానమైనది మనం ఎవరం? ఎలా రూపొందేం? ఇక్కడి దాకా మన ప్రయాణం ఎలా సాగింది? అన్న ప్రశ్నలకు వెదికి పరిశీలించి పరిశోధించిన వివరాల సారమే చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం.
జీవపరిణామం - 1.
ప్రతి జీవీ తన సంతానాన్ని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
గుడ్లలో, పిల్లల్లో వివిధ రూపాలుగా ఉండే వైవిధ్య లక్షణాలు ఉంటాయి.
జీవులు పెట్టిన గుడ్లన్నీ అవన్నీ పిల్లలై ,పెరిగి, సంతానోత్పత్తి దశకు పోవడం కష్టం. ఉదాహరణకు తాబేళ్లు సముద్రపు ఒడ్డున గుడ్లు అసంఖ్యాంగా పెడతాయి. తీరా పిల్లలై సముద్రంలోకి చేరేవి పదుల్లోనే ఉంటాయి. ఈ ఇసుక లోంచీ నీటిలోకి చేరే ఈ పది మీటర్ల దూరంలోనే రకరకాల పక్షులు వీటి కోసం కాసుక్కూర్చుంటాయి. ఇలా చాలా గుడ్లు ఇతర జీవులకు ఆహారం కావచ్చు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని గుడ్ల నుండి పిల్లలు రాకుండానే చనిపోవచ్చు.
పిల్లలు గుడ్ల నుంచి వచ్చినా వివిధ పెరిగే దశలలో ఇతర జీవులకు ఆహారంగా మార వచ్చు.
అన్ని పిల్లలకు ఆహారం సరిపడినంత దొరకక కొన్ని చని పోవచ్చు.
ఎదిగి గుడ్లు పెట్టే దశకు వచ్చే లోపు చాలా పిల్లలు చనిపోవచ్చు.
ఈ విధంగా జీవుల జనాభా నియంత్రణ జరుగుతుంది.
గుడ్లన్నీ పిల్లలై, ఆ పిల్లలన్నీ పెరుగుతూ ఉంటే సరిపడి నంత ఆహారం దొరక్క పోవచ్చు.
కాబట్టి ఒక జాతి జీవుల మధ్యనే మనుగడ కోసం పోరాటం జరుగుతుంది.
కొన్ని మరణిస్తాయి.
కొన్ని బతికి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి.
ఏవైతే బతికాయో, అవి బతకడానికి ఏ లక్షణాలైతే ఉపయోగపడ్డాయో ఆ లక్షణాలను తర్వాత తరానికి అందిస్తాయి.
బతకలేని జీవుల లక్షణాలు తర్వాత తరంలో తొలగించ బడతాయి.
ఇలా కొన్ని తరాల పాటు దీర్ఘ కాలం పాటు జరగడం వలన నూతన లక్షణాలతో నూతన జీవ జాతులు వస్తాయి.
జీవపరిణామం - 2.
ప్రతిజీవీ ఎక్కువ సంఖ్యలో సంతానోత్పత్తి చేసినప్పటికీ అవన్నీ ఒకే రూపంలో, ఒకే లక్షణాలతో ఉండవు.
సంతాన జీవుల్లో తేడాలు ఉంటాయి.
అలా తేడాలు ఉండడాన్నే వైవిధ్యం అంటారు.
జీవుల లక్షణాలకు మూలం వాటి జీవ కణాలలోని జన్యువులు.
ఎలాంటి జన్యువులు ఉంటే అలాంటి లక్షణాలు జీవులకు వస్తాయి.
జీవులు స్త్రీ పురుష బీజ కణాలను ఉత్పత్తి చేసే సమయంలో క్షయకరణ విభజన జరిగినప్పుడు నూతన జన్యువులు రూపొందుతాయి.
అవి కలిస్తే వచ్చే సంతానంలో వివిధ నూతన లక్షణాలు వచ్చి, వాటి మధ్య వైవిధ్య పూరిత లక్షణాలు ఉంటాయి.
పరిసరాలు మారుతుంటాయి.
కొన్ని పరిసరాల్లో కొన్ని రకాల జన్యువులు కల జీవులు బతికి పెరుగుతాయి.
కొన్ని రకాల జన్యువులు కలవి ఆ పరిసరాల్లో మనుగడ సాగించ లేక మరణిస్తాయి.
జీవుల్లో ఉండే వైవిధ్య లక్షణాల వలన కొన్ని బతికి తమలాంటి లక్షణాలు కల సంతానాన్ని ఉత్పత్తి చేయడం, కొన్ని లక్షణాలు కలవి చని పోవడం వలన వాటి జన్యువుల వల్ల రాగల లక్షణాలు తర్వాత తరంలో తొలగించ బడడం జరుగుతుంది.
ఈ విధంగా నూతన లక్షణాలు రావడం, కొన్నిలక్షణాలు కలవే బతకడం, తమ లక్షణాలను సంతానానికి ఇవ్వడం, ఇలా సుదీర్ఘ కాలం పాటు జరగడం వలన నూతన లక్షణాలు పోగుబడి నూతన జాతులు క్రమపరిణామంలో వస్తాయి.
జీవపరిణామం - 3.
పిల్లలు బతికే అవకాశం పెరిగే కొలది ఉన్నత స్థాయి జీవుల్లో కనే పిల్లల సంఖ్య తగ్గింది.
ఆల్చిప్పలు, నత్తలు, కప్పలు, చేపలు పెట్టే గుడ్లన్నీ పిల్లలుగా పొదిగి, ఎదిగి అదే స్థాయిలో పిల్లలను ఉత్పత్తి చేస్తూ ఉంటే కొన్ని తరాల్లోనే నిలువ చోటు లేనంతగా పెరిగి పోతాయి.
కాని, వాస్తవంగా సహజంగా ప్రకృతిలో అలా జరగదు.
గుడ్లు, పిల్లలు బతికేందుకు, ఎదిగేందుకు అవకాశాలు తక్కువ కాబట్టే వాటి ఉత్పత్తి ఎక్కువ.
బల్లులు, పక్షులు, క్షీరదాల్లో బతికే అవకాశాలు పెరగడంతో అవి పెట్టే గుడ్ల సంఖ్య, కనే పిల్లల సంఖ్య క్రమేణా తగ్గింది.
ఒక సారి ఒక బిడ్డను మాత్రమే ఉత్పత్తి చేసే మనిషిలోనూ జనాభా విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చి, వారు బతికే అవకాశం పెరగడంతో కృత్రిమంగా కుటుంబ నియంత్రణ పాటించాల్సి వచ్చింది.
క్షీరదాల తెలివి తేటలు పెరిగే కొలది పిల్లలను కనే సంఖ్య తగ్గింది.
పిల్లలను అధికంగా ఉత్పత్తి చేయడమంటే మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుందని గమనించాలి.
అన్ని జీవులూ ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేసే దిశగా సాగడంతో వాటి మధ్య ఆవాసం, ఆహారం, శత్రువుల దాడుల వల్ల,లైంగిక జీవుల మధ్య పోటీల వల్ల మనుగడ కోసం పోరాటం సాగుతుందని ప్రకృతి వరణం ద్వారా జీవపరిణామం సాగుతుందని ఆధారాలతో సిద్ధాంతీకరించిన చార్లెస్ డార్విన్ సూత్రీకరించాడు.
జీవ పరిణామం - 4.
ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న లక్షలాది జీవ జాతులు అన్నీ ఒకే మూలం నుంచి పరిణామంలో వైవిధ్య పూరితంగా ఆవిర్భవించాయి.
సూక్ష్మ ఏక కణ జీవులే భూమి మీద 100 కోట్ల ఏళ్ల పాటు పరిణమించి, ఎన్నో జాతులుగా పరిణమించగా వాటి నుంచి బహుకణ జీవులు వచ్చాయి.
అంటే బహుకణ జీవులు గత 200 కోట్ల ఏళ్లుగా భూమి మీద పరిణామం చెందుతూ లక్షలాది జాతులుగా పరిణమించాయి.
బహుకణ జీవుల్లో వెన్నెముక లేని వాన పాములు, నత్తలు, కీటకాలు, నక్షత్రపు చేపలు, ఆక్టోపస్ లు పరిణమించగా వాటి నుంచి వెన్నెముక గల చేపలు పరిణామంలో వచ్చాయి.
40-50 కోట్ల ఏళ్ల క్రితం మాత్రమే ఈ వెన్నెముక గల చేపలు ఆవిర్భవించి సముద్రాలను, సరస్సులను, నదులను ఆక్రమించాయి.
చేపల నుంచే ఉభయచర జీవులైన కప్పలు పరిణ మించి ఆహారం కోసం నేల మీదకు, ప్రత్యుత్పత్తి కోసం నీటిలోకి వెళ్ళడం ప్రారంభంచి ఉభయ చర జీవులయ్యాయి.
కప్పల్లో గాలిని పీల్చి ఆక్సిజన్ గ్రహించేందుకు ఊపిరి తిత్తులు పరిణామం చెందాయి.
నీటిలో మునిగి ఉంటే చర్మం ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ను పీల్చుకుంటాయి.
గెంతుతూ కీటకాలను పట్టి తినేందుకు అలవాటు పడ్డాయి.
తొలి సారిగా శబ్దాలను చేయడం, వినడం చేసినవి ఈ ఉభయచర జీవులైన కప్పల జాతులే.
వినికిడి క్రమంగా పెరిగింది.
క్షీరదాల్లో వినికిడి విపరీతంగా పెరిగి మనుషుల్లో భాషగా పరిణమించింది.
బల్లుల నుంచే పరిణమించిన పక్షుల్లోనూ తెలివి పెరిగి, అరుపులతో కిలికిలలు పెంచాయి.
జీవపరిణామం - 5.
ఉభయచరాల నుంచి పరిణమించిన బల్లులు పూర్తి కాలం నేల మీద జీవించేందుకు పరిణమించాయి.
బల్లుల గుడ్డు ఒక ఉన్నత స్థాయి రక్షణ వ్యవస్థ కలిగి సంతానానికి అండగా మారింది.
స్త్రీపురుష బీజ కణాల కలయిక తర్వాత ఆడ బల్లి గుడ్డులో పిండాన్ని ఉంచి, దానికి ఎదిగేప్పుడు అవసరమైన ఆహారం కోసం ప్రొటీన్లతో నిండిన సొనను ఉంచి, పుష్టికర ఆహారాన్ని సంతానానికి ఏర్పాటు చేస్తుంది!
గుడ్డులో ఉన్న అండం, పిల్లగా ఎదిగి బయటకు వచ్చేంత వరకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం గుడ్డు పెంకులో సన్నని సూక్ష్మ రంద్రాల ఏర్పాటు ఉంటుంది.
బల్లులు గుడ్లను పొదగవు కాని, అనుకూలమైన ప్రాంతంలో వాటిని పెడతాయి.
వాతావరణ ఉష్ణోగ్రత వల్లనే గుడ్లు పొదగ బడి, సొనంతా ఆహారంగా తీసుకో బడి ఎదిగిన తర్వాత పెంకును ముక్కుతో పగలగొట్టుకుని పిల్ల బయటకు వస్తుంది.
బల్లుల్లో తల్లికీ పిల్లకూ ఎలాంటి సబంధమూ ఉండదు.
సంతాన పాలన ఉండదు.
గుడ్డు పెట్టడంతో సరి.
గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల బల్లి స్వతంత్రంగా, సహజాత స్పందనలతో కీటకాలను పట్టి తినడం అలవాటు చేసుకోవాలి లేదా అంతరించి పోవాలి.
దానిది జన్యు ప్రేరిత అలవాటు.
బల్లులు నీళ్ళు తాగవు.
అవి తినే కీటకాల్లోని నీరే వాటికి సరిపోతుంది.
చర్మం మీద స్వేద రంధ్రాలు ఉండక పోగా, పైన పొలుసులు ఉండి శరీరం నుంచి నీటి నష్టం జరగ నీయవు.
మలినాల విసర్జనలోనూ నీటి నష్టం ఉండదు.
కాళ్ళతో నడవలేవు కాని పాకుతాయి.
పాకుతూనే దూరాలను జయిస్తాయి.
కదిలే,ఎగిరే కీటకాలను గుర్తించి, పట్టి తింటాయి.
బల్లుల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు.
వాతావరణంలో వేడి ఎక్కువ ఉంటే అవి వేడెక్కుతాయి, చల్లగా ఉంటే చల్లబడతాయి.
అవి అస్థిరోష్ణ జీవులు.
క్రియాశీలత తక్కువ.
బల్లుల ఫార్ములాతోనే డైనోసార్లు పరిణమించి భారీ శరీరాలతో ఆనాటి భూమిని ఏలాయి కానీ, హఠాత్తుగా పెను వాతావరణ మార్పుల కారణంగా అంతరించాయి.
డైనో సార్ల నుంచే పక్షులు పరిణమించాయి.
మరొక వైపున బల్లి జాతులనుంచే క్షీరదాలు పరిణమించాయి.
నేల జీవితపు ఒడిదుడుకులను జయించిన బల్లులు మన పూర్వులు.
జీవపరిణామం - 6.
ఉన్నత స్థాయి జీవుల శరీర నిర్మాణ ప్రణాళిక వెన్నెముక కల చేపలతోనే మొదలైంది.
వెన్నెముక ఆధారంగా జీవి శరీరం పరిమాణం పెరగడం మొదలైంది.
నీటిలో వేగంగా దూసుకు పోవడానికి అనుగుణంగా చేపల ముట్టె,మొండెం, తోక రూపు దిద్దుకున్నాయి.
చలన దిశ వైపున జ్ఞానేంద్రియాల కేంద్రీకరణ అంతకు ముందటి జీవుల వారసత్వంగానే చేపలు పొందాయి.
శరీరం సైజు పెరగడం, చలన వేగం పెరగడం, చలాకి తనం పెరగడంతో శరీర భాగాలను సమన్వయం చేసేందుకు మెదడుకు పునాది ఏర్పడడమే కాక, దాని రక్షణకు పుర్రె ఎముకలతో తల నిర్మాణం మొదలైంది.
మెడ లేనందువల్ల తలను తిప్పలేకపోయినా చేపలు అటూ ఇటూ తిరుగుతూ మెడలేని లోపాన్ని అధిగమిస్తాయి.
మెదడులోని భాగాలు అన్నీ ఏదో ఒక సైజులో చేప మెదడులో స్థానం పొందాయి.
నీటిలో ఈదడానికి తోక మొదలు కాగా ఉన్నత జీవులన్నిటిలో ఏదో ఒక ఉపయోగం కొరకు తోకలు కొనసాగాయి.
రెండు జతల వాజాలు ముందొక జత, వెనుక ఒక జత బ్యాలెన్సింగుకు ఉపకరించేందుకు మొదలై ఉన్నత జీవుల కాళ్ళకు, చేతులకు, రెక్కలకు పునాదిగా రూపు దుద్దుకున్నాయి.
చేపల రెండు జతల వాజాలే నాలుగు కాళ్ళుగా పరిణమించాయి.
చేపల్లో ఉన్న తోక మనుషుల్లోనూ అంతర్గత ఎముకల రూపంలో కొనసాగుతూనే ఉంది.
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ను పీల్చుకునేందుకు మొప్పలు రూపొందాయి.
ఉన్నత స్థాయి భూ జీవుల్లో మొప్పలు పోయి ఊపిరి తిత్తులు రూపొందాయి.
చేపల్లోని గాలి గదులే ఊపిరితిత్తులుగా పరిణమించాయని ఒక అంచనా.
మనిషి రెండు కాళ్ళ మీద నిలబడి నడిచేంత వరకు చేపల నాలుగు కాళ్ళ పునాది ఫార్ములా కొద్ది మార్పులతో ఉన్నత స్థాయి పరిణిత జీవుల్లో కొనసాగింది.
కప్పల్లో గెంతడానికి, బల్లుల్లో పాకడానికి ,క్షీరదాల్లో నడవడానికి పరుగెత్తడానికి, పక్షుల్లో ఎగరడానికీ వాజాలు పరిణమించాయి.
అవయవాలు జీవన అనుకూలంగా పరిణామంలో మారుతూ వచ్చాయి.
ప్రకృతి ఎంపిక జరిగి ఎన్నో ఫార్ములాలతో జీవ జాతులు ఆవిర్భవించాయి.
ఈ నలభై కోట్ల సంవత్సరాల పరిణామ ఫలితమే కప్పలు, బల్లులు, పక్షులు, క్షీరదాలు.
జీవపరిణామం - 7.
శరీర భాగాల కదలికలను సమన్వయం చేయడానికి మొదటగా వెన్నెముక లేని బహుకణ జీవుల్లోనే నాడులు, నాడీ సంధులు మొదలయ్యాయి.
పరిణామంలో జీవుల సైజు పెరగడం, అవయవాల సంక్లిష్ట పెరగడం, చలన వేగం పెరగడం, వేగంగా చలన దిశను మార్చుకోవలసి రావడం; అవయవాలను ఆదేశించి, సమన్వయంతో చలింప చేయడం, ఆహార సంపాదనలో పోటీ, శత్రు దాడుల నుంచి తప్పించు కోవలసి రావడం లాంటి అనేక ప్రక్రియల ఒత్తిళ్ళ వల్ల నాడీ సంధులు నిర్ణాయక పాత్ర పోషిస్తూ క్రమంగా పెరిగి మెదళ్ళుగా పరిణమించాయి.
చేపల్లో ఒక నిర్మాణ సంక్లిష్టతకు చేరిన మెదడు అంతకంతకు సంక్లిష్టతను పెంచుకుంటూ, పని విధాన విశిష్టతను పెంచుకుంటూ, కప్పల్లో, బల్లుల్లో క్రమంగా పెరిగి, పక్షుల్లో, క్షీరదాల్లో తెలివి తేటలుగా వ్యక్తం చేయడం జరిగింది.
చెట్లెక్కిన క్షీరదాల్లో, ఏప్స్ లో పరిసరాల ఎంపికతో తెలివినిచ్చే మెదడు భాగాలు అంత కంతకు పరిణమిస్తూ ప్రాముఖ్యతను పొందాయి.
ఏప్స్ లో నుంచి పరిణమించిన మనిషిలో మస్తిష్క అర్ధ గోళాలు, సెరబ్రల్ హెమిస్పియర్స్ విపరీతంగా పెరిగి మెదడు బరువులో 70% కు పెరిగి, ఆలోచన, విశ్లేషణ, తార్మికత, నిర్ధారణ, సంకల్ప స్థాయిలకు ఎదిగేందుకు పరిణామం చెందడమే కాక భాష ద్వారా భావాలను వ్యక్తం చేయడం, భావ వ్యక్తీకరణ నైపుణ్య స్థాయికి అభివృద్ధి చెందడంతో జంతు జాతుల నుంచి దూరంగా జరిగి ఆలోచించగల ఆధునిక మానవులమయ్యాం.
మనిషి జంతువే కాని విచక్షణ చేయగల, వివేకాన్ని ఉన్నత స్థాయిలో ప్రదర్శించగల జీవి అయ్యాడు.
మానవ పరిణామమూ ఇంతటితో ఆగక మిగతా జీవ జాతులతో పాటు కొనసాగుతుంది.
మానవుడు తన పరిణామాన్ని తాను డ్రైవ్ చేసుకోగల స్థాయికి చేరాడు.
కానీ, ప్రకృతి పరిణామం మనిషితో ఆగదు,
అది నిరంతరాయం
జీవపరిణామం - 8.
డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి ఆవరణం , సహజ ఎంపిక ద్వారా నూతన జాతుల ఉత్పత్తి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే ఆధార సహిత సిద్ధాంతాన్ని డార్విన్ 1859 లో తన రచన "ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్" గ్రంథం లో వివరించాడు.
1830 లలో నాలుగు సంవత్సరాల పాటు డార్విన్ హెచ్.యం.యస్. బీగిల్ అనే నౌకలో ప్రకృతి శాస్త్రవేత్త హోదాలో ప్రపంచ పర్యటన చేశాడు.
వివాహం కాక ముందు తన ప్రొఫెసర్ హెన్స్లో సలహా మేరకు ఆయన ఆ నౌక కెప్టెన్ ఫ్రిట్జ్ రాయ్ కు సహచరుడిగా , ప్రకృతి పరిశీలకుడిగా ప్రపంచ పర్యటన చేస్తూ వివిధ ప్రాంతాలలోని జీవులను పరిశీలించాడు.
దక్షిణ అమెరికా ఉత్తర తీర ప్రాంతం నుంచి దక్షిణ తీర ప్రాంతం వరకు ఓడ ఆగిన చోటల్లా దిగి, నేల మీద తిరుగుతూ అక్కడి జీవులను పరిశీలిస్తూ, జంతువుల బొమ్మలు గీస్తూ, నోట్సు రాసుకుంటూ సాగాడు.
ఒక ప్రాంతంలో ఉండే ఒక జీవ జాతి స్థానాన్ని మరొక ప్రాంతంలో మరొక జాతి ఆక్రమించడం చూశాడు.
పరిసరాలకు జీవుల లక్షణాలకు మధ్య సంబంధం ఉందని గ్రహించాడు.
దక్షిణ అమెరికా పడమర 600 కిలోమీటర్ల దూరంలోని గెలపాగస్ దీవులను నౌక చేరినప్పుడు ఆ దీవులలోని రాక్షస తాబేళ్ళు, ఫించ్ పక్షులు ఆయన దృష్టిని ఆకర్షించాయి.
రాక్షస తాబేళ్ళ మీద ఎక్కి కూర్చొని ఆ దీవుల్లో పర్యటించాడు.
ఆ దీవుల్లోని ఫించ్ పక్షులు శరీర నిర్మాణంలో ఒకే విధంగా కనిపించినప్పటికీ వాటి ముక్కుల నిర్మాణంలో వైవిధ్యాలు గమనించాడు.
ఒక్కో దీవిలో దొరికే గింజల సైజును బట్టి, వాటిని తినే ఫించ్ పక్షుల ముక్కు సైజు నిర్ణయమైందని, అలా ఒక్కో దీవికి ఒక్కో సైజులో ఫించ్ పక్షుల ముక్కులు ఉన్నాయని, తినే గింజల సైజుకు పక్షుల ముక్కుల సైజుకు మధ్య సంబంధం ఉందని గమనించాడు.
ఆ ఫించ్ పక్షులన్నీ ఎప్పుడో ప్రధాన భూభాగం నుంచి ఈ దీవులకు వచ్చాయనీ, క్రమేణా అవి ఆ దీవిలో ఆహారపు పరిమాణానికి అనుగుణమైన విధంగా ముక్కులను మార్చాయని అభిప్రాయ పడ్డాడు.
ఒక పొడవైన పుష్పాన్ని చూసి అంత పొడవైన తొండం కల సీతాకోక చిలుక ఉండాలని వెతికాడు. ఆయనకు కనపడ లేదు కానీ దాన్ని తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
తాను సేకరించిన జంతువుల స్పెసిమన్లను ఎప్పటికప్పుడు స్పిరిట్ లో దాచి, ఇంగ్లాండుకు పంపించాడు.
ఎన్నో స్పెసిమన్లను, చిత్రాలను, ఎంతో నోట్సును సేకరించి నాలుగు ఏళ్ల తర్వాత లండన్ చేరాడు.
ఆయన మాల్థస్ , లయోల్ రచనలు చదివాడు.
ఆయన భౌగోళిక పరిస్థితులు మారుతుంటాయని, జీవుల మధ్య పోటీ ఉంటుందని గ్రహించాడు, జనాభా నియంత్రణ జరుగుతుందని గ్రహించాడు.
ఆయన ఒక నోట్సును ప్రారంభించి తన పరిశీలనలను, అభిప్రాయాలను, నూతన విషయాలను సేకరించి రికార్డు చేయడం మొదలు పెట్టాడు.
ఇలా ఆయన 20 సంవత్సరాలపాటు పరిశోధన చేసిన ఫలితంగా తన "ప్రకృతి ఆవరణం ద్వారా నూతన జాతులు ఉత్పత్తి " అవుతాయనే సిద్ధాంతాన్ని ఆధారాలతో సహా ప్రతిపాదించి 1859 లో ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ గ్రంథంలో, 1871 లో "మానవావిర్భావం" గ్రంథంలో వివరించాడు.
విస్తారమైన ఆధారాలతో, పరిశోధన ఫలితంగా ప్రకటించి ఆ సిద్ధాంతం శాస్త్రవేత్తల ఆమోదాన్ని పొందింది.
మానవుడి అవగాహనలో ఒక విప్లవాన్ని తెచ్చిన వ్యక్తిగా చార్లెస్ డార్విన్ ను మానవాళి గుర్తించింది.
ఆ తర్వాత అనేక శాస్త్ర శాఖల ఆధారాలతో ఆయన సిద్ధాంతం ఒక నిజంగా నిరూపణ అయింది.
సంకరణ ప్రయోగాలతో శాస్త్రవేత్తలు కృత్రిమంగా నూతన జాతులను ఉత్పత్తి చేయడంతో ప్రాక్టికల్ గా ఆయన సిద్ధాంతం ఆమోదాన్ని పొందింది.
జీవపరిణామం - 9.
తన జీవపరిణామ సిద్ధాంతంలో చార్లెస్ రాబర్ట్ డార్విన్ ప్రతిపాదించిన సూత్రాలు:
1. ప్రతిజీవీ తన సంతానాన్ని అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తుంది.
అవన్నీ బతికి, పెరిగి, ప్రత్యుత్పత్తి అదే విధంగా చేస్తూ పోతే కొన్ని తరాల్లోనే వాటి జనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది.
కానీ ప్రకృతిలో అలా జరగక జనాభా నియంత్రణ ఉంటుంది.
2. జీవులు ఉత్పత్తి చేసే సంతానంలోని జీవుల మధ్య వైవిధ్యాలు ఉంటాయి.
ఒకే తల్లిదండ్రుల పిల్లల మధ్య అయినా ఈ వివిధ రూపాలు, లక్షణాలు ఉంటాయి.
సంతానంలో వైవిధ్యాలు సహజం.
3. అధిక ఉత్పత్తి వల్ల వ్యక్తిగత జీవుల మధ్య ఆవాసం కోసం, ఆహారం కోసం, లైంగిక భాగస్వాముల ఎంపికలో, ఇతర అంశాల్లో ఒక రకమైన పోటీ ఉంటుంది.
4.జీవుల సంఖ్య విపరీతంగా పెరిగితే వాటి మధ్య "మనుగడ కోసం పోరాటం" Struggle for existence"జరుగుతుంది.
ఈ పోరాటం ప్రకృతి నిర్బంధాలు, వైపరీత్యాలు, కరువులు, కాటకాల సమయంలో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
5.జీవుల మధ్య మనుగడ కోసం, బతకడం కోసం జరిగే పోరాటంలో విజయం సాధించి, బతికి, పెరిగి, ప్రత్యుత్పత్తి దశకు చేరిన జీవులు తమ లక్షణాలు కల సంతానాన్ని తర్వాతి తరంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి.
ఈ పోరాటంలో అపజయం పాలై ప్రత్యుత్పత్తి కి ముందే మరణించిన వాటి లోపభూయిష్టమైన లక్షణాలు తర్వాత తరానికి అందవు.
ఇది దీర్ఘ కాలం పాటు జరగడం వలన ఏ జీవులకైతే విజయం సాధించేందుకు ఉపయోగపడే లక్షణాలు, వైవిధ్యాలు ఉంటాయో, ఆ లక్షణాలు కల జీవులే సంతానంలో, తర్వాత తరంలో అత్యధికంగా ఉంటాయి.
క్రమంగా నూతన అనుకూల లక్షణాలు పోగై నూతన జాతులు ఉత్పత్తి అవుతాయి.
6. జీవుల ఎంపికను పరిసరాలు చేస్తాయి కాబట్టి, కొన్నిటిని తమ పరిసరాల్లో బతకనిచ్చి, మరికొన్నిటిని బతకనీయవు కాబట్టి, దీనిని ప్రకృతి వరణం, నేచురల్ సెలెక్షన్ అన్నాడు.
7. ఇలా జరిగే పరిణామంలో నూతన జాతులు రావడం వల్లనే ఈనాడు భిన్న రూప నూతన జాతులు ఉత్పత్తి అయ్యాయి.
ఇదే "ఆరిజన్ ఆఫ్ స్పీసీస్" గ్రంథంలో డార్విన్ వెల్లడించిన విషయాల సారం.
ఈ సూత్రాలను వివరించేందుకు, ఆధారాలు ఇచ్చేందుకు అనేక వాస్తవాలను వివిధ విజ్ఞాన శాస్త్ర శాఖల నుంచి ఆయన ఆ గ్రంథంలో ఇచ్చాడు.
అప్పటికే ప్రచారం అయినందువల్ల, ఈ గ్రంథం ప్రచురణ అయిన 1200 కాపీలు విడుదలైన రోజే అమ్ముడు పోయాయి.
ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ గ్రంథంలో, 2011 నాటి ఇండియన్ ఎడిషన్ లో 440 పేజీలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ అంశాల మీద పలు రచయితలు పలు గ్రంథాలను ప్రచురించారు.
గత 160 సంవత్సరాలుగా డార్విన్ సిద్ధాంతానికి ఊతంగా అనేక శాస్త్ర శాఖల నుంచి అనేక ఆధారాలు, సాక్ష్యాలు లభ్యమై ఈనాడు డార్విన్ సిద్ధాంతం ఒక వాస్తవమైందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
వాస్తవాల పునాదిగా ఉన్న హేతుబద్ధమైన సిద్ధాంతాలు ఎక్కువ కాలం నిలబడతాయి.
వాటికి మెరుగులు దిద్దబడతాయి.
జీవపరిణామం - 10.
జీవపరిణామ సిద్ధాంత ప్రకటన ప్రపంచంలోనే ఒక పెను సంచలనమైంది.
దైవ సృష్టివాదులు కలవర పడ్డారు.
ఒక వారంలోనే ఇప్పుడు ఉన్న జీవజాతులన్నీ సృష్టించబడ్డాయనీ,
అప్పటి నుంచి ఏ మార్పూ లేకుండా కొనసాగు తున్నాయనీ,
పురుషుని పక్కటెముక నుంచి స్త్రీ సృష్టి జరిగిందనీ,
ప్రళయకాలంలో జీవుల్లో ఒక జత మగ ఆడ జంతువులను ఓడలో ఎక్కించి కాపాడబడ్డాయని కథలు విని, విశ్వసించిన వారంతా డార్విన్ ఒక పూర్వ జాతి నుంచి మరొక నూతన జాతి నూతన లక్షణాలతో ఆవిర్భవిస్తుందన్నందుకు వారంతా కలవర పాటుకు గురయ్యారు.
మానవావిర్భావం పూర్వ జాతి జీవులనుండి పరిణామ క్రమంలో జరిగిందేనని సిద్ధాంత ప్రతిపాదన రావడంతో మత పెద్దలు ఒక కుదుపుకు లోనయ్యారు.
కోతులు మీ తాతలా?
అన్నారు.
కోడిగుడ్లు విసిరి తమ అజ్ఞానాన్ని ప్రదర్శించారు.
డార్విన్ పవిత్ర గ్రంథానికి విరుద్ధంగా చెపుతున్నాడన్నారు.
కోపర్నెకస్ సూర్యకేంద్ర సిద్ధాంతం నిలదొక్కుకోవడంతో అప్పటికే మతానికి బీటలు వారి, బలహీన పడిన నేపధ్యంలో, అనేక మంది శాస్త్రవేత్తలు డార్విన్ కి మద్ధతుగా నిలవడంతో మతం డార్విన్ ను ఏమీ చేయలేక ఆత్మ రక్షణలో పడింది.
డార్వినిజాన్ని పాఠశాలల్లో బోధించరాదని కోర్టులకెక్కినా విఫలమయ్యారు.
ఇప్పుడు సరికొత్తగా డిజైన్ సిద్ధాంతాలను మత వాదులు ముందుకు నెట్టి, అంతా దేవుడు డిజైను ప్రకారం ఇదంతా జరిగిందని కుంటి వాదనలు మొదలు పెట్టారు.
ఆధునిక వైజ్ఞానిక ఆధారాలతో ఎంతో మంది మతవాదుల డిజైన్ థీయరీని ఖండించి జీవపరిణామ విజ్ఞానాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
దశావతారాలు జీవపరిణామమేనంటూ విఫల వాదాలు చేస్తున్నారు.
కానీ , డార్విన్ థియరీ గట్టి వైజ్ఞానిక పునాదుల మీద నిలబడి ముందుకు సాగుతోంది.
జన్యుశాస్త్రం, శిలాజ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం, కణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, భౌగోళిక జీవ విస్తరణ శాస్త్రం, సంకరణ సాంకేతిక విజయాలు, వైద్య శాస్త్రం లాంటి అనేక విజ్ఞాన శాస్త్రాల పరిశోధనలు డార్విన్ పరిణామ సిద్ధాంతానికి అండగా నిలుస్తున్నాయి.
చార్లెస్ డాకిన్స్ లాంటి ఆధునిక జీవపరిణామ శాస్త్ర పరిశోధకులు డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం ఒక వాస్తవమని ప్రకటిస్తున్నారు.
ఈనాడు అనేక జీవజాతుల పరిణామ చరిత్రలను రూపొందించే దశకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం చేరింది.
మానవ అవగాహనను పెంచడంలో, మనిషిని అర్ధం చేసుకోవడంలో డార్విన్ సిద్ధాంతం ఒక మహా విప్లవ సిద్ధాంతం.
జీవపరిణామం - 11.
జీన్ బాప్టిస్టు లామార్క్ అనే ఔత్సాహికుడు పరిసరాలకు, నూతన జాతులు రావడానికి గల సంబంధాన్ని గుర్తించాడు.
పరిసరాలప్రభావం వల్ల జీవుల్లో మార్పులు వస్తాయని అనుకున్నాడు.
ఒక జీవి తన జీవిత కాలంలో పరిసరాల ప్రభావం వల్ల పొందిన లక్షణాలను తర్వాత తరానికి అందిస్తుందనే " ఆర్జిత లక్షణాల అనువంశికత" సూత్రాన్ని జీవపరిణామ సూత్రంగా చెప్పాడు.
జిరాఫీ మెడ పొడవు పెరగడాన్ని వివరిస్తూ జిరాఫీ ఎత్తైన చెట్ల ఆకులను తినేందుకు మెడను చాచడం వల్ల మెడ పొడవు పెరుగుతుందని, ఆ పెరిగిన మెడను తన సంతానానికి అందిస్తుందని, ఈ విధంగా మరిన్ని తరాల పాటు జరగడం వలన కొన్ని తరాల్లో మెడ పొడవు బాగా పెరిగి నూతన జాతిగా ఆవిర్భవిస్తుందన్నాడు.
దీన్నే "ఉపయుక్త నిరుపయుక్త" సూత్రం గా చెప్పాడు.
కానీ, వీస్మన్ అనే శాస్త్రవేత్త ఎలుకల తోకలను కత్తిరిస్తూ ఏడు తరాల వరకు పెంచి చూస్తే ఏడవ తరంలోనూ తోకలు మామూలుగానే వచ్చాయి.
ఈ వీస్మన్ ప్రయోగంతో లామార్క్ ఉపయుక్త నిరుపయుక్త, యూజ్ అండ్ డిస్ యూజ్ సూత్రం తప్పని రుజువైంది.అయితే చిన్న సవరణతో డార్విన్ తన సిద్ధాంతం ప్రకారం ఈ వివరణ ఇచ్చాడు:
జిరాఫీల సంతానంలో మెడ పొడవులో సహజంగానే వైవిధ్య ఉంటుంది.
కొన్ని పొడవు మెడవి, మరికొన్ని పొట్టి మెడవి ఉంటాయి.
ఆహారం తక్కువ ఎత్తులో దొరకనప్పుడు పొడవు మెడవి బతికి, పెరిగి ,సంతానోత్పత్తి ని చేసి తమ పొడవు మెడ లక్షణాలను తర్వాత తరానికి ఇచ్చాయి.
ఇది సుదీర్ఘ కాలం పాటు జరగడం వలన పొడవు మెడలు ఉన్నవి మనుగడ కోసం జరిగిన పోరాటంలో బతికి తర్వాత తరంలో అవి ఎక్కువయ్యాయి.
పొట్టి మెడలున్నవి ఆహారం దొరకక, సంతాన ఉత్పత్తి దశ వరకు బతకలేక చని పోయి తమ లక్షణాలను తర్వాత తరానికి ఇవ్వలేక పోయినందు వల్ల తర్వాత తరంలో పొట్టి మెడలు ఉన్నవి క్రమేణా అంతరించి పోయాయి.
ఈ విధంగా సుదీర్ఘ కాలంలో జిరాఫీల మెడ పెరిగిందన్నాడు.
పరిసరాలు పొడవు మెడలున్న వాటిని ఎన్నుకున్నాయి అన్నాడు.
జీవపరిణామం -12.
డార్విన్ 1930 నుంచి ప్రపంచ పర్యటన చేసి, సమాచార సేకరణ చేసి, ప్రకృతివరణం ద్వారా నూతన జాతుల ఉత్పత్తి సిద్ధాంతానికి రూపకల్పన చేసి, మరింత సమాచారం కొరకు సుదీర్ఘ పరిశోధన చేసిన తరుణంలో ఆయనకు ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ అనే జీవ శాస్త్రవేత్త నుంచి తను స్వతంత్రంగా చేరిన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఒక ఉత్తరం వచ్చింది.
ఈ వివరాలను ఆయన తన మిత్రులకు చెప్పాడు.
వారు ఇరువురినీ లెన్నియన్ సొసైటీ వేదిక మీద నుంచి తమ తమ పత్రాలను ఒకే రోజు చదవమన్నారు.
అలా చదివిన తర్వాత మిత్రుని సలహా మేరకు డార్విన్ అప్పటికే విస్తారమైన నోట్సుతో సిద్ధంగా ఉన్న తన అభిప్రాయాలను ఒక పుస్తకం రూపంలో ప్రచురించడానికి సిద్ధమై 1859 లో "ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ " గ్రంథాన్ని పూర్తి చేసి, ప్రచురించగా విడులైన రోజే అన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయి.
సుదీర్ఘ కాలం క్రితమే తన సిద్ధాంతానికి చేరినందువల్ల, ఎక్కువ సాక్ష్యాలతో బలమైన తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందువల్ల "ప్రకృతి వరణం ద్వారా నూతన జాతుల ఉత్పత్తి " సిద్ధాంతాన్ని తొలిగా ఆవిష్కరించిన వాడయ్యాడు డార్విన్.
డార్విన్ 1871 లో "మానవావిర్భావం" గ్రంథాన్ని ప్రచురించి , మానవుడి ఆవిర్భావాన్ని కూడా చర్చించి, తన సిద్ధాంతానికి బలం చేకూర్చాడు.
డార్విన్ తన గ్రంథాల్లో తన జీవపరిణామ సిద్ధాంతానికి సాక్ష్యాలను సకల శాస్త్రాల నుంచి విస్తారంగా ఇచ్చాడు.
జీవపరిణామం - 13.
జీవులు పరిణామ క్రమంలో మారుతున్న పరిసరాల స్థితిగతులకు అనుకూలమైన అనుకూలనాలను పొంది, పరిసరాలకు అనుగుణంగా జీవిస్తూ విజయం సాధిస్తాయి.
ఎడారి ఓడగా పిలవబడే ఒంటే పరిసరాలు క్రమంగా ఎడారిగా మారుతూ ఉంటే అది తన నిర్మాణాన్ని, అవయవ నిర్మాణాలనూ ప్రకృతి పరిసరాల చేత ఎంపిక కాబడి వాటికి అనుకూలంగా మార్చుకుంటుంది.
ఎత్తైన కాళ్ళు నేల వేడిని తట్టుకునే విధంగా,
పొడవైన మెడ ఎత్తైన చెట్ల ఆకులను తినే విధంగా,
40 రోజులకు సరిపడా నీటిని నిల్వ ఉంచగల నిర్మాణాల అభివృద్ధి, చెమట ద్వారా నీటి నష్టం జరగకుండా స్వేద రంధ్రాలను కోల్పోవడం,
గిట్టలు వెడల్పుగా ఉండి ఇసుకలో దిగబడ కుండా ఉండేందుకు, కనుబొమల మీద వెంట్రుకలు పొడవుగా దట్టంగా ఉండి ఇసుక రేణువులు కంట్లో పడకుండా అడ్డుకోగలగడం లాంటి అనేక ఎడారి అనుకూలతలను ఎడారి ప్రకృతి ఎంపిక వల్ల పొందింది.
ఆహారాన్ని కొవ్వు రూపంలో మోపురం లో నిల్వ ఉంచుకుని ఎడారి ప్రయాణంలో, ఆహారం దొరకని రోజుల్లో దాన్ని వాడుకునే విధంగా పరిణమించింది.
క్రమంగా అడవి ఎడారిగా మారుతుంటే ఒంటె పూర్వ జీవి క్రమంగా ఎడారి ఓడగా పరిణమించింది.
తిమింగలాల పూర్వ జాతి ఒకప్పుడు నేల మీద ఉండేవి.
అవి క్రమంగా నీటిలోకి వెళ్ళి అక్కడి ఆహారాన్ని తినేందుకు అలవాటు పడడంతో, జల జీవితానికి అనుకూలంగా కాళ్ళు తెడ్లవలె ఈదడానికి, శరీర ఆకారం కుదురు ఆకారం నీటిలో దూసుకుపోవడానికి, నీటిలోనే పిల్లలను కని పాలు ఇచ్చి, పోషించే విధంగా అనుకూలతలను పరిసరాల చేత ఎంపిక కాబడి పొందాయి.
జీవపరిణామం - 14.
చార్లెస్ డార్విన్ తల్లిదండ్రుల సంతానంలో వైవిధ్యాలు సహజమని అన్నాడే కాని, వాటికి కారణాలు ఆయనకు తెలీవు.
1860 ప్రాంతాలలో సర్ గ్రెగరీ మెండల్ బఠానీ మొక్కలను పెంచి, ఆత్మ ,పరపరాగ సంపర్కాలను జరిపి తల్లిదండ్రుల లక్షణాలు ఎలా సంతానానికి వస్తాయో ప్రయోగ పూర్వకంగా పరిశీలించి అనువంశిక సూత్రాలను ప్రకటించాడు.
ఆయన శాస్త్రవేత్త కాకపోవడంతో ఆయన సూత్రాలను ఎవరూ పట్టించుకోలేదు.
అవి డార్విన్ దృష్టికి కూడా రాలేదు.
1900 సంవత్సరంలో కొంత మంది మెండల్ చేసిన ప్రయోగాలను చేసి ఆయన పొందిన ఫలితాలనే పొందారు.
మెండల్ అనువంశిక సూత్రాలు వాస్తవమని ఆమోదించారు.
జీవకణాల్లో డి ఎన్ ఏ అనే జన్యు నిర్మాణం ఉంటుందనీ, ఆ జన్యువులే జీవుల లక్షణాలకు కారణాలని గుర్తించారు.
జన్యువులు ఎలా వారసత్వంగా వస్తాయో గుర్తించారు.
స్త్రీ, పురుష బీజ కణాల ఉత్పత్తి సమయంలో వాటి మాతృ కణాల్లో క్షయకరణ విభజన జరగడం వలన, స్త్రీపురుష క్రోమోజోములు పక్కపక్కన చేరి జన్యు పదార్ధాన్ని మార్చుకోవడం జరగడం వలన నూతన లక్షణాలకు కారణమయ్యే జన్యువులు బీజ కణాల్లోకి, వాటి కలయక వల్ల సంతానంలోకి వస్తాయని గుర్తించారు.
ఈ విధంగా స్త్రీపురుష బీజకణాల లోనే జన్యు వైవిధ్యం ఉంటుందని, వాటి కలయక వల్ల వచ్చే నూతన సంతానంలోనూ ఆ వైవిధ్య ఫలితాలు చేరి, సంతానంలో జన్యు వైవిధ్యాలు, వివిధ రూపాల జీన్స్ రావడం వలన, లక్షణాల్లో వైవిధ్యాలు కల సంతానం వస్తుందని గుర్తించారు.
తల్లిదండ్రుల లక్షణాలు జీన్స్ ద్వారా పిల్లలకు వస్తాయని రుజువు కావడంతో ప్రకృతి పరిసరాల ఎంపికకు అవసరమైన ముడి వైవిధ్యాలు సంతానంలో సహజంగానే జన్యు వైవిధ్యాల ఫలితంగా వస్తాయని తేలింది.
అంటే ప్రకృతి జీన్స్ నే ఎన్నుకుంటుందనీ, జీన్స్ పరిణామం చెందుతాయని తేలింది.
జీవపరిణామం నిజానికి జన్యు పరిణామమని, జన్యువుల పరిణామం వల్లనే వివిధ లక్షణాలతో జీవులు వారసత్వంగా వస్తాయని తేలింది.
జీవపరిణామం - 15.
ఒకప్పుడు జీవించిన జీవులు మరణించిన తర్వాత భూమి పొరల అడుగునపడి, కాలగమనంలో పరిసర పదార్ధాలు వాటిల్లోకి చేరి రాళ్ళుగా మారి, ఆ జీవుల ఆకారాలు అలాగే నిలవ ఉంటే అటు వంటి వాటిని శిలాజాలు అంటారు.
శిలాజాలు లభించిన భూపొరల వయసునూ, ఆ జీవుల శిలాజాల వయసునూ రేడియో ధార్మిక పదార్ధాల అర్ధ జీవిత కాలాన్నీ గణించడం ద్వారా లెక్కిస్తారు.
తవ్వకాల్లో ముందటివి అడుగు పొరల్లోనూ, ఇటీవలివి పైపొరల్లోనూ లభ్యమవుతున్నాయి.
కాలక్రమంలో జీవుల శరీర నిర్మాణం ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ శిలాజాల అధ్యయనం చాలా ఉపయోగకారి.
వెన్నెముకలేని జీవుల శిలాజాలు భూమి అడుగు పొరల్లోనూ, వెన్నెముక కల జీవుల శిలాజాలు పై పొరల్లోనూ లభ్యమవుతున్నాయి.
ప్రపంచ వ్యాపితంగా లభించిన శిలాజాలనుంచీ లభ్యమైన సమాచారం ప్రకారం మానవ పూర్వ జాతుల శిలాజాలను, వాటి జీవన కాలాలను, వాటి లక్షణాలను గ్రహించిన దాన్ని బట్టి మానవ పూర్వ జీవుల నుంచి ఏ విధంగా ఆధునిక మానవుడు ఆవిర్భవించాడో అవగాహనకు వచ్చే అవకాశం లభించింది.
మానవ పూర్వ జీవ జాతులైన నియాండెర్తళ్, రామా పిథకస్, ఆస్ట్రలోపిథికస్, హోమో హాబర్, హోమో ఎరక్టస్ ల నుండి హోమో సేపియన్ల పరిణామం అర్ధమవుతున్నది.
ఇలా అనేక జీవజాతుల పరిణామ దశలను శిలాజాల అధ్యయనం ద్వారా గుర్తించారు.
ఏనుగు, గుర్రం, జిరాఫీ లాంటి అనేక జీవుల పరిణామ చరిత్రలను శిలాజ అధ్యయనాల ద్వారా వెలికి తీశారు.
భూపొరల్లోని శిలాజాల అధ్యయనం ద్వారా సరళ జీవుల శిలాజాలు కిందిపొరల్లో, సంక్లిష్ట జీవుల శిలాజాలు పై పొరల్లో లభించడాన్ని బట్టి జీవ పరిణామం జరిగిందనేందుకు రుజువులు లభించాయి.
అమెరికా లోని గ్రాండ్ కాన్యాన్ నది రాళ్ళను కోసు కుంటూ ప్రవహిస్తూ కిందికి చేరడం వలన అక్కడి రాళ్ళను లోతు పొరల వరకు పరిశీలించే అవకాశం లభించింది.
200 కోట్ల సంవత్సరాల నాటి జీవుల శిలాజాలు అడుగు పొరల్లోనూ, ఇటీవలి శిలాజాలు పై పొరల్లోనూ లభించి జీవుల నిర్మాణంలో క్రమపరిణామం జరిగింది అనేందుకు అనేక శిలాజ సాక్ష్యాలు లభించాయి.
శిలాజాల అధ్యయనం ప్రకారం జీవం 350 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అనేందుకు జీవరసాయన శిలాజ సాక్ష్యాలు లభించాయి.
జీవపరిణామం -16.
జీవ పరిణామం జరిగిందనేందుకు జీవుల శరీర నిర్మాణంలోనే అనేక సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి.
చేపల నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు చూసుకుంటే ఏ శరీర భాగాలు చేపల్లో ఏ తావుల్లో ఉన్నాయో అవే తావుల్లో ఉన్నత స్థాయి జీవుల శరీరంలో కొద్ది మార్పులతో ఉన్నాయి.
చేపల అస్తి పంజరానికి మిగతా జీవుల అస్తి పంజరాలకు పోలికలు చాలా ఉన్నాయి.
అలాగే చేపల అస్థిపంజరాలకూ తతిమ్మా జీవుల అస్థిపంజరాలకూ పోలికలు చాలా ఉన్నాయి.
కాళ్ళల్లో ఉన్న ఎముకలన్నీ,అవి చేతులుగా, రెక్కలుగా మారినా, కప్పల్లో, బల్లుల్లో, పక్షుల్లో, క్షీరదాల్లో, మనుషుల్లో అవే తీరులో ఉంటాయి. మనక్కూడా కొన్ని సామెతలున్నాయి. పాము తన పిల్లల్ని తనే తినేస్తుందని. గుడ్ల నుంచి వొచ్చిన పిల్లల్లో బలహీనంగా ఉన్న వాటిని గుర్తించి తినేస్తుంది.) ఇలాంటి వైజ్ఞానిక విషయాలను సిలబస్ లోంచి తొలగించి ఏం చెబుదామని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో విద్యార్ధుల భవిష్యత్తును ఏం చేద్దామనుకొంటున్నాయో మరి వాటికే తెలియాలి! మొన్నటి వరకూ ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలనలో అక్కడి స్త్రీల విద్య, ఉపాధి వైజ్ఞానిక విషయ బోధనలూ ఎలాగా అని మధన పడి జాలి పడ్డాం. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు మీదా జాలి పడాల్సొస్తోంది. ఏ విలువలకీ ప్రస్థానం??
.
https://byjus.com/question-answer/which-of-the-following-is-are-the-drawback-s-of-darwinism-the-mechanism-of-inheritance-1/
.
https://link.springer.com/article/10.1007/s12119-001-1001-8#:~:text=Abstract,most%20scientific%20and%20lay%20audiences.
పై లంకెలో డార్విన్ ప్రతిపాదించిన వాటిలో scientific community తిరస్కరించినవి ఉన్నాయి.
Comments
Post a Comment