ఈరోజు ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవ వాది, రచయిత నార్ల వెంకటేశ్వరరావు జయంతి
*******************************************************

నార్ల వెంకటేశ్వరరావు ( V. R. Narla ) (1 డిసెంబరు 1908 - 16 ఫిబ్రవరి 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాదిగా, మానవవాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. నార్ల స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నారు.

జీవిత విశేషాలు
------------------------
మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం కృష్ణాజిల్లాలో జరిగింది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించారు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 25,000 పుస్తకాలు ఉండేవట. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రజ్యోతి' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు. ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజం పట్ల నిబద్ధత, జనశ్రేయం పట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు. నార్ల సమాజంలో, రాజకీయాల్లో అన్యాయాలపై అలుపెరుగని పోరాటం చేశారు.

సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా రచనలు చేసిన యోధుడాయన.

సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. ఆయన భగవద్గీత, ఉపనిషత్తులు, హిందూ ఆధ్యాత్మిక రచనలు అధ్యయనం చేశారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ 'శంబూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.

ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు. 'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.

ఎం.ఎన్.రాయ్ రచనలు ఆలోచనలు నార్లను ప్రభావితం చేశాయి. మనుషులు వయస్సు పెరిగేకొద్దీ విరక్తి, నిరాశావాదం ఏర్పడి కర్మ, విధి, అతీంద్రియమైనవాటిని విశ్వసించడం మొదలెట్టి అన్ని రకాల మూఢనమ్మకాలకు బలైపోతారనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని నార్ల కొట్టిపారేశారు. ఆయన రచనలు ఆశావాదం, మానవ వాదంతో నిండి ఉంటాయి. 

రాయ్ ప్రచారం చేసిన మానవీయ విలువలు, నైతిక ప్రమాణాల ఆవశ్యకత, సహకార ఆర్థిక వ్యవస్థ, అందరికీ అధికారం, రాజకీయ నిర్మాణ వికేంద్రీకరణ, పునర్వికాసం, జీవితం పట్ల విమర్శనాత్మక దృక్పథం, ప్రకృతిలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడంలో శాస్త్రీయ దృక్పథం, పురాణాలను ప్రక్షాళన చేయడం, రాజ్యాన్ని మరియు మతాన్ని వేరుగా ఉంచే లౌకిక వాదం, తద్వారా మతం వ్యక్తిగత విశ్వాసానికి పరిమితం చేయడం, స్వేచ్ఛాలోచన నార్లను ఆకట్టుకున్నాయి. మూఢ నమ్మకాల, అంధ విశ్వాసాల నిర్మూలనకు ఈ సానుకూల అంశాలను ఆధునిక భారతదేశం స్వీకరించాలని నార్ల కోరుకున్నారు. అందరూ మానవీయ విలువలను అవలంబించాలని నార్ల సూచించారు. నార్ల భారతీయ సంస్కృతిలోని లోపాలను విభిన్న దృక్కోణాల నుండి ఎత్తి చూపారు. మానవ స్వీయ శక్తిని బలహీనపరిచే కర్మ మరియు పునర్జన్మపై నమ్మకాన్ని విస్మరించాలని యువ తరానికి విజ్ఞప్తి చేశారు. 

రచనలు
-----------
సీతజోశ్యం
జాబాలి
నరకంలో హరిశ్చంద్రుడు
ద్రౌపది
హిరణ్యకశ్యపవధ
నవయుగాలబాట నార్ల మాట
నార్ల రచనలు 1 - దేశ చరిత్రలు
నార్ల రచనలు 2 - సాంఘిక నాటికలు, వ్యాసాలు
నార్ల రచనలు 3 - పౌరాణిక నాటికలు
నార్ల రచనలు 4 - సాహిత్య రచనలు
నార్ల రచనలు 5 - సంస్కృతి, సాహిత్యం, మతం
నార్ల రచనలు 6 - వర్తమాన సంఘటనలు
నార్ల రచనలు 7 - జీవిత చిత్రణలు

ఆంగ్ల రచనలు
------------------
The Truth about the Geetha 1988
An Essay on the Upanishads 1989
Gods and Goblins
East and West
Intellectual Poverty in India

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata