మార్పు.
మార్పు.
___ పిళ్లా కుమారస్వామి,9490122229
ప్రపంచం క్షణం క్షణం మారుతూ ఉంటుందన్నాడు బుద్దుడు. ప్రపంచంలో మారనిదంటూ ఉంటే అది మార్పు ఒక్కటే నన్నాడు మార్క్స్.అయితే ఆ మార్పు ఘర్షణ ద్వారా జరుగుతుందన్నాడు. మార్పు ప్రకృతిలో నిరంతంరంగా ఉంది. అది ప్రకృతి సహజ లక్షణం. ప్రకృతిలో భాగంగా ఉన్న మనిషి ప్రవర్తన కూడా పరిస్థితులను బట్టి చెందుతూ ఉంది.మన చుట్టూ సమాజంలో జరిగే మార్పులు మనల్ని ప్రభావితం చేస్తాయి. మనలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మన చర్యల ద్వారా పరిసరాల్లో కూడా మార్పులు వస్తుంటాయి.
మనం ఒక పని చేస్తే ప్రపంచం, దాంతోపాటు మనమూ కొంచమైనా మార్పు చెందుతాం. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవనప్రక్రియ. మార్పు జీవనచైతన్య కేతనం. మార్పుల పరంపరే చరిత్ర.
"ప్రపంచం మారదు. మనం దేన్నీ మార్చలేము. మనుషుల స్వభావం మారదు. ఈ సమాజం మారదు” అని చాలామంది అంటూ ఉంటారు. ఇది నిజమా? సమాజ సంస్కృతి, నీతినియమాలు, సంప్రదాయాలు స్థిరంగా ఉంటాయంటారు. దురాశ, అధికార వ్యామోహం, మానవ సహజ స్వభావాలని వాదిస్తారు. ఇవి ఏమాత్రం మార్పు చెందని అంశాలేనా? గతానికి నేటికి మార్పు లేదా? ఆదిమానవుని కాలానికి, ఆధునిక కాలానికీ పోలిస్తే పైన పేర్కొన్న ఎన్నో విషయాలు చాలా మారినట్లు గుర్తించగలం.
‘ఏదీ మారదు’ అని చెప్పేవాళ్లు యథాస్థితివాదులు. వీరు అభివృద్ధికరమైన మార్పును వ్యతిరేకిస్తూ ఉంటారు. వీరి ప్రకారం మారేవన్నీ అబద్ధాలు. మారనివి వాస్తవాలు. కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు తాత్కాలికంగా తిరోగమనంగా ఉండవచ్చు. అయినా ఎవరెన్ని చెప్పినా ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అది ప్రగతిశీలదాయకం. అది అభివృద్ధికరమైన మార్పుకే పయనిస్తుంది.
మార్పు- మన ఆలోచనలు
పరస్పర విరుద్ధ శక్తుల మధ్య జరిగే సంఘర్షణే మార్పుకు కారణం. మానవాభ్యుదయం కొరకు ప్రపంచాన్ని మార్చవచ్చు. అలా మార్చడమే
మానవుని పరమావధి అని అన్నాడు కార్ల్ మార్క్స్.
వ్యక్తికీ, శాస్త్రానికీ, శాస్త్రీయ దృక్పథానికి మధ్య ఉన్న సంబంధాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంప్రదాయ బంధనాలు బలంగా ఉంటే అశాస్త్రీయ శక్తులు రాజ్యమేలుతుంటాయి. శాస్త్రీయ విజ్ఞానం పెరిగేకొద్దీ ఇవి బ్రద్దలవుతాయి. అంతేగాక వ్యక్తి కూడా వికాసం చెందుతారు. వ్యక్తులు వికసించే కొద్దీ సమాజం కూడా వికాసం చెందుతుంది. వ్యక్తి సామాజిక జీవనంలో క్రియాశీలకంగా పాల్గొనే కొద్దీ మరింత వికాసం చెందుతాడు. అందువల్లనే సామాజిక వికాసానికి, వ్యక్తి వికాసానికి పరస్పర సంబంధం ఉంది. అందుకే వ్యక్తి వికాసం సమాజ వికాసంలో అంతర్భాగమని అమర్త్యసేన్ వక్కాణించారు.
మానవునిలో భావాలు ఎలా ఏర్పడుతున్నాయి? "మెదడులో ఏర్పడుతున్నాయి" అన్నారు ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్తలు, అలాంటి భావాలే ఎందుకు ఏర్పడుతున్నాయి? సమాధానం చెప్పలేకపోయారు వారు. ఎందుకని? సమాజంలోని భౌతిక పరిస్థితులే మానవునిలో భావాలు ఏర్పడేందుకు. కారణభూతమవుతున్నాయి. విశ్వామిత్రుడు ఎంత నిష్టాగరిష్టుడైనా మేనక ఆయన చుట్టూ తిరుగుతూ నృత్యం చేయడంతో ఆమెను వలచాడు. పది ఇళ్లకొకటి చొప్పున మద్యం షాపులు పెట్టడంతో మద్యపానప్రియులు పెరిగిపోతున్నారు. పాలకులు రైతుల వెతలు తీర్చకపోవడంతో ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు. ఆంగ్లేయుల దురాగతాలను సహించలేక స్వాతంత్ర్యం కోసం ప్రజలను ఐక్యంగా నడిపాడు గాంధీ.ఇవన్నీ భౌతిక పరిస్థితులను బట్టే మనిషిలో ఏర్పడ్డ భావాలే కాని ఎవరో ఆదేశించగా ఏర్పడినవి కావు. అనాటి ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్తలు, మనదేశ తాత్వికవేత్తలు చాలామంది భౌతిక పరిస్థితుల ప్రభావాన్ని విస్మరించారు. ప్రపంచంలోని భౌతిక మార్పుకు కారణం మొదట భౌతిక పరిస్థితుల ప్రభావం మన ఆలోచనల మీద పడుతుంది. అప్పుడు మనకున్న సాధన సంపత్తితో ప్రపంచాన్ని మానికి పూనుకుంటామని మార్క్స్, ఎంగెల్స్ లు చాలా కాలం క్రితమే చెప్పారు.
మార్పు- ఒక నిరంతర ప్రక్రియ:
ప్రతి జీవికి ప్రాథమిక విభాగం 'కణమని' మన పూర్వులు కనుగొన్నారు.కణ విభజన జరగడం వల్ల వృక్షాలు, జంతువులు ఏర్పడుతున్నాయనితెలుసుకున్నాం. కణం మార్పు చెందడం ద్వారా జీవి తన జాతిని ఎలా మార్చుకోగలుగుతుందో తెలిసింది. అదేవిధంగా శక్తి నిత్యత్వ సూత్రం(లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ) ప్రకారం వేడి, యాంత్రిక శక్తి, విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తి రసాయనిక శక్తి మొదలైనవన్నీ ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి మారిపోతాయని మనకు తెలుసు. ఒక రూపంలోని శక్తి మాయమైతే మరొక రూపంలో ఆ శక్తి ప్రత్యక్షమవుతుంది. అంటే ప్రకృతిలో ఉన్న చలనం యావత్తూ ఒక శక్తి మరో శక్తిగా మారే నిరంతర క్రమం. డార్విన్ పరిణామవాదం మానవునితో సహా జీవులన్నీ ఏకకణజీవుల నుంచి సుదీర్ఘ పరిణామ క్రమంలో ఉద్భవించాయని వివరించింది. ఈ ఏకకణ జీవులు కూడా రసాయనిక చర్యలలో పుట్టిన ప్రోటోప్లాజమ్ లేదా అల్బూమెన్ నుంచి వచ్చాయని రుజువు చేసింది.
ఉపనిషత్కారులు ఆత్మ మారదు. అది అఖండం అన్నారు.దాన్ని నిప్పు కాల్చదు అన్నారు. శస్త్రం ఖండించ లేదన్నారు.ఇదీ ప్రకృతి సహజమైన మార్పు సూత్రానికే విరుద్దం. అందువల్ల ప్రకృతి లోని మార్పు ను గుర్తించిన బుద్దుడు ఆత్మ లేదని అనాత్మ వాదాన్ని ప్రతిపాదించాడు. దీన్నిప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు.
మార్పు- పరిశీలన
మార్పు ఎల్లప్పుడూ నిరంతరంగా జరిగే ప్రక్రియ. మనం పరిశీలించినా పరిశీలించకపోయినా మార్పు జరుగుతూనే ఉంటుంది. కొన్ని బాహ్యంగా కనిపించకపోవచ్చు. అంతమాత్రాన మార్పు జరగలేదని చెప్పలేం. దీన్ని బాగా పరిశీలించడం ద్వారానే గుర్తించగలం. ఉదాహరణకు జామకాయను తీసుకుందాం. జామచెట్టు ఒక మొగ్గ వేస్తుంది. ఆ మొగ్గ పువ్వుగా మారుతుంది. ఆ పువ్వు పిందెవుతుంది. పిందె పెరిగి జామకాయగా రూపుదిద్దుకుంటుంది. ఆ కాయ కొన్నాళ్లకు పండిపోయి చెట్టు - నుంచి రాలిపోతుంది. ఆ తర్వాత అది కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. కొన్నాళ్లకు దాని విత్తనాలు అనేక జామచెట్లుగా మారుతాయి. అంటే జామకాయ ఎల్లప్పుడూ కాయగానే ఉండక, అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందన్న మాట.
జామకాయలో మార్పులు స్థూలంగా ఇలా ఉన్నాయి: చెట్టు మొగ్గ - పువ్వు - పిందె - జామకాయ_జామపండు - కుళ్లిన పండు- జామవిత్తనాలు_ విత్తనంలోంచి మొక్కలు-జామచెట్లు.
పై మార్పులన్నీ జామచెట్టులోగల కొన్ని అంతర్గత శక్తుల వల్ల కలుగుతున్నాయని గమనించగలం. అంటే పై మార్పుల్లో స్వయం గమనశక్తి (ఆటోజమ్) ఉందన్నమాట.అలాగే కోడిగుడ్డు ను పొదిగి నప్పుడు దానిలో అంతర్గతంగా జరిగే మార్పులు కూడా ఇలాగే ఉంటాయి.
మార్పును గురించి చర్చించడాన్ని గతితర్కం అంటారు. ఈ గతితర్కం ప్రపంచ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరించే ఏకైక సాధనమని హెగెల్ అనే శాస్త్రవేత్త చెప్పాడు.
ఒక ఈగను పట్టుకుని చంపివేస్తే కలిగే మార్పు ఏది? కేవలం యాంత్రిక మార్పు. మన జోక్యం వల్ల జరిగిన మార్పు. కానీ మన జోక్యం వల్ల జరిగే మార్పులన్నీ యాంత్రిక మార్పులు కావు. అందుకే మార్పులు జరుగుతున్న క్రమాన్ని పరిశీలిస్తే అవి కొన్ని చలన సూత్రాలను బట్టి జరుగుతుంటాయని గమనించగలం.
మార్పుకు సంబంధించిన చలన సూత్రాలనే గతితార్కిక చలన సూత్రాలు అంటారు. ఈ చలన సూత్రాల ఆధారంగా మార్పులను అధ్యయం చేస్తే ప్రకృతిని, అందులోని సమాజాన్ని మనం అర్ధం చేసుకోగలం. అభివృద్ధికర మార్పుల్ని వేగవంతం చేయడానికి మనం మార్పు చెంది మరికొంత వేగవంతం చేసే శక్తులుగా మారగలం. గతితార్కిక చలన సూత్రాల అధ్యయనం మన శాస్త్రీయ అవగాహనను పెంచుతుంది. తద్వారా కార్యాచరణ సులభతరమవుతుంది.
మార్పు- చలన సూత్రాలు:
మార్పును శాస్త్రీయంగా పరిశీలించడానికి మనకు తోడ్పడేవి గతితార్కిక చలన సూత్రాలు. ఇవి ప్రధానంగా
1. వస్తువులపై పరిసరాల ప్రభావం ఉంటుంది. పరిసరాలపై వస్తువు ప్రభావం ఉంటుంది.
పరిసరాలకు వస్తువుకు పరస్పర సంబంధం ఉంటుంది. వస్తువు గురించి తెలుసుకోవాలంటే బాహ్య ప్రపంచంలో దానితో సంబంధం ఉన్న అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. దీనిని సంపూర్ణంగా మనం ఎప్పటికీ చేయలేం. కానీ అన్ని కోణాల్లో పరిశీలించాలన్న సూత్రం మనం తప్పులు చేయనీకుండా, పిడివాదులం కాకుండా రక్షిస్తుంది.
2. వస్తువును దాని అభివృద్ధి క్రమంలో, దాని మార్పులలో గ్రహించాలి.
వస్తువులో అంతర్గతంగా జరిగే మార్పులను గమనించాలి. ఈ మార్పులు సూక్ష్మంగా ఉంటాయి. వస్తువు అభివృద్ధి చెంది పెరిగి అదృశ్యమయ్యే దశలోకి వెళ్లి కొత్త రూపు సంతరించుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు గొంగళి పురుగు మార్పు చెందడం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనా విధానం మారాలి.
3. పరిమాణం గుణంగా మారుతుంది. గుణం పరిమాణంగా మారుతుంది. గుణపరిమాణ పరిణామ నియమం ఇది.
ఒక్కోసారి మార్పు ప్రేలుడులాగా వెంటనే జరిగిపోతుంది. సామాజిక విప్లవం
సంభవించి పెట్టుబడిదారీ విధానం బ్రద్దలై దాని స్థానంలో సోషలిజం వచ్చింది. భూమిపై ఉన్నట్టుండి జరిగిన మార్పుల వల్ల ప్రాణుల పరిణామం ఆకస్మాత్తుగా మారిపోయింది.డైనోసార్లు పతనమై పోయాయి.ఇవన్నీ పరిణాత్మక మార్పులు గుణాత్మకంగా మారిపోవడం గా మనం గమనించవచ్చు. సమాజం మెల్లగా మెల్లగా మారుతూ ఒక్కసారిగా గుణాత్మకంగా మారి పోతే దాన్ని సామాజిక విప్లవం అన్నారు.
4. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత - ఘర్షణ ఉంటుంది :
మొదట వాదం ఉంటుంది. దాంతోపాటే దానికి వ్యతిరేకంగా ప్రతివాదం ఉంటుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ ఫలితంగా వాదప్రతివాదాలలోని ప్రగతిశీల లక్షణాలతో సమన్వయవాదం ఏర్పడుతుంది. ఆ సమన్వయవాదం మళ్లీ ఒక వాదం అవుతుంది. దాంతో దానికి ప్రతిగా ప్రతివాదం పుడుతుంది. మళ్లీ ఆ రెండింటి మధ్య సంఘర్షణ జరిగి సమన్వయవాదం వస్తుంది. అది తిరిగి మరొక నూతనవాదం అవుతుంది.
మనిషి మస్తిష్కంలోనూ, సమాజంలోనూ, సకల ప్రకృతి పరిణామాంలోనూ, ప్రక్రియలోనూ పరస్పర విరుద్ధమైన అంశాలు ఉంటాయి. విరుద్ధ అంశాల మధ్య ఐక్యత ఉంటుంది. ఘర్షణ ఉంటుంది. ఘర్షణ సమాజ అభివృద్ధికి మూలం.
విరుద్ధ శక్తులు వివిధ శాస్త్రాలలో ఎలా ఉన్నాయో చూద్దాం.
గణితశాస్త్రంలో ప్లస్_మైనస్, అవకలనం_ సమాకలనం
యాంత్రిక శాస్త్రంలో చర్యప్రతిచర్యలు.
భౌతిక శాస్త్రంలో ధన విద్యుత్తు రుణవిద్యుత్తు
రసాయన శాస్త్రంలో అణువులు సంయోగ వియోగాలు కృషి
ఎన్నికల్లో పార్టీల మధ్య వైరుధ్యాలు
పరిశ్రమలు- గుత్త సంస్థల మధ్య పోటీ
సామాజంలో పీడితులు, పీడించేవారు.
బహులజాతి సంస్థల మధ్య పోటీ
దేశాల మధ్య పోటీ
ఇలా పరస్పరం రెండూ విరుద్ధంగా ఉంటాయి.అయితే అవి కలిసి కూడా పనిచేస్తుంటాయని మనం గమనించాలి.
5. పాతది నశించి మెరుగైన కొత్తది వస్తుంది.
చిన్నతరహా పరిశ్రమ మెల్లమెల్లగా అభివృద్ధి చెంది తనను తాను అంతం. చేసుకుంటుంది. అంటే లాభాలనార్జించి ఆ పెట్టుబడితో పెద్ద పరిశ్రమగా మారిపోతుంది. అదే విధంగా పెద్ద పరిశ్రమ కూడా అంతమై పెట్టుబడిదారుడి నుంచి కార్మికుల పరిశ్రమయ్యే దశకు చేరుకుంటుంది. మన దేహంలో కణం విచ్చిన్నమై రెండు కణాలు ఏర్పడుతాయి. ఇలా సాధారణ క్రమంలో పాతది నశించి కొత్తది మెరుగ్గా ఉంటుంది. మనిషి కూడా పాత భావాలను విసర్జించి సరికొత్త ప్రగతిశీల మానవ వాదాన్ని అలవరుచుకుంటాడు.పాత తరం పోయి కొత్తతరం మానవ వాదం దిశగా సాగుతుంది.
6. ఆచరణాత్మక దృష్టితో పరిశీలన
పరిశీలన, అధ్యయనం ద్వారా నిర్ణయాలు చేస్తాం. కానీ ఆ నిర్ణయాలు సరైనవా? కాదా? ఎలా తెలుస్తుంది?ఆచరణలో వాటిని తేల్చుకోవాల్సిందే. కేవలం ఊహలద్వారా తేల్చలేం.ఊహించడమంటే మన భావాల్ని అందులో చొప్పించడం.
ఇద్దరిమధ్య భిన్నాభిప్రాయాలు వస్తే ఆచరణ ద్వారా మాత్రమే ఏది వాస్తవమో గ్రహించగలం.
7. సమాజాభివృద్ధికి అనుగుణంగా జరిగే మార్పులో మానవుని క్రియాశీలక పాత్ర ఉంటుంది.
ప్రతిదీ మార్పు చెందటం అనివార్యం. మనిషి కూడా అందుకు అతీతం కాదు. మార్పు కేవలం అంతర్గత శక్తుల వల్లే జరగదు. బాహ్య ప్రేరణవల్ల మార్పు వేగవంతంగా జరుగుతుంది.
శిశిరంలో ఆకు రాల్చిన చెట్టు వసంతంలో చిగురిస్తుంది. అలా చిగురించడానికి బాహ్య ప్రేరకాలుగా సూర్యరశ్మి, గాలిలో తేమ, చుట్టూ వాతావరణం పని చేస్తాయి. అప్పుడే చెట్టు తన అంతర్గత శక్తులను ఉపయోగించుకుని చిగురిస్తుంది.
కోడిగ్రుడ్డు పిల్లగా మారడానికి కావలసినంత
ఉష్ణోగ్రత ఇవ్వగలిగితే ఇది జరుగుతుంది. నీరు ఆవిరిగా మారటానికి 100 డిగ్రీ ల వరకు వేడిచేయాలి. ఇవన్నీ బాహ్య ప్రేరకాలు, అలాగే మనిషి మార్పు చెందాలంటే బయటి నుంచి చైతన్యాన్ని అందించాలి. మనిషి ఒక్కసారి చైతన్యం పొందాక తాను మార్పును వేగవంతం చేసే శక్తిగా మారతాడు. ఈ చైతన్యాన్ని అందించేది శాస్త్రీయ దృక్పథం మాత్రమే. అందువలన ప్రతివ్యక్తికీ శాస్త్రీయ దృక్పథాన్ని బయట నుండి ఎవరో ఒకరు అందించటం అవసరమవుతుంది.
ఆదిమానవుని దశలో మనిషి మనుగడకోసం పోరాడుతున్న దశలో నిప్పును, చక్రాన్ని కనుగొనడం యంత్రపరికాల అభివృద్ధికి దోహదం చేసింది. పశుసంపదను విచ్చలవిడిగా యజ్ఞయాగాదుల్లో వినియోగం వల్ల ఆ జాతి అంతమయ్యే పరిస్థితిలో బుద్ధుడు హింసను మానాలని ప్రబోధించడంతో ప్రజలు బౌద్ధమతం వైపు వెళ్లడంతో ప్రజాజీవన మార్గం కుదుట పడింది. రష్యాలో జార్ చక్రవర్తి నిరంకుశ పాలనలో దుర్భర పరిస్థితి ననుభవించే ప్రజలు, బోల్షివిక్ పార్టీ వెనుక నడిచేందుకు ఆ దేశంలో విప్లవాన్ని తీసుకువచ్చేందుకు లెనిన్ అపూర్వ కృషి చేశారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు యోధుడు సుందరయ్య "బాంచన్ దొర ! కాల్మొక్తా" అని పలికే పీడితులను తమ హక్కుల కొరకు పోరాడే విధంగా కృషి చేశాడు. విశాలాంధ్రలో ప్రజారాజ్యంకై బాటలు వేశాడు.
అందుకే డబ్ల్యు, బి.ఈట్స్ అంటాడిలా.''మానవ మేధకు పరీక్షా సమయం వస్తుంది. పరిపూర్ణ స్వీయవికాసమా-పరిపూర్ణ కర్తవ్యమా అని ఎంచి చూసుకునే అవసరం వస్తుంది"
-
Comments
Post a Comment