జనచైతన్యమే జన విజ్ఞానవేదిక లక్ష్యం



జనచైతన్యమే జన విజ్ఞానవేదిక లక్ష్యం 

భారత రాజ్యాంగంలోని 51ఎ (హెచ్) ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనలు కల్గి వుండాలి. మానవత్వాన్ని పెంపొందించాలి. అందుకు పాలకులు కృషిచేయాలి. మన రాజ్యాంగం మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నించి ఇప్పటి వరకు పరిశీలిస్తే వ్యక్తిగత అంశంగా ఉన్న మతం రాజకీయ అంశంగా మారింది. ఫలితంగా ప్రజలలో వైజ్ఞానిక ఆలోచనలు పెరగడానికి బదులు మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు ఈ విషయాన్ని బలపరుస్తున్నారు. మదనపల్లె లో విద్యావంతులైన తల్లిదండ్రులు మూఢ నమ్మకాలతో తమ పిల్లలని దారుణంగా చంపారు. రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారు. న్యూమరాలజీ,జ్యోతిష్యం వంటివి శాస్త్రాలుగా చలామణి అవుతున్నాయి. గ్రామాలలో చేతబడి పేరుతో అమాయకుల్ని భయభ్రాంతులకి గురిచేస్తూనే ఉన్నారు.క్షుద్రపూజల పేరుతో అక్కడక్కడా చిన్న పిల్లలని బలి ఇస్తున్నారు.

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' లో శాస్త్రీయ ఆలోచనలని గురించి ఇలా చెప్పారు. రుజువులు, ఆధారాలతో నిరూపించబడేదే 'విజ్ఞానం' అన్నారు. శాస్త్రీయ ఆలోచనలతో మనిషి స్వేచ్ఛాజీవిగా వుండగలడని ఆయన వివరించాడు. ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలని పాలకులు పెంచకపోవడం వల్ల జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు ఆ బాధ్యతని తీసుకుంటున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారం చూపించకుండా వారిలో శాస్త్రీయ ఆలోచనలు
పెంచినా ఉపయోగం ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకి కొన్ని విశ్వాసాలున్నాయి. విశ్వాసాల మూలంగానే ఆయా రకాల ఆచారాలని ప్రజలు పాటిస్తుంటారు. వీటిని రాజ్యాంగం కూడా గౌరవిస్తుంది. ఎప్పుడైతే సమాజంలో ఒక సమూహం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ విశ్వాసాలలో కొన్ని మూఢ విశ్వాసాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మతాధికారులు తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తారు. సమాజంలో పాతుకు పోయిన మూఢవిశ్వాసాలని నియంత్రించడంతో పాటు నిరక్షరాస్యత నిర్మూలన, మద్యపాన నిషేధం,విద్య,వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, సైన్స్ ద్వారా సామాజిక న్యాయం వంటి లక్ష్యాలతో జనవిజ్ఞాన వేదిక 1988 ఫిబ్రవరి 28న ఏర్పడింది. ఇదే రోజు మనం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. జనవిజ్ఞాన వేదిక ఎవరి వ్యక్తిగత విశ్వాసాలని అగౌరవపర్చదు. విశ్వాసాలని మూఢ విశ్వాసాలుగా మార్చేవారినే జన విజ్ఞాన వేదిక ప్రశ్నిస్తుంది.నైతిక విలువలని బోధించే మత గురువులను జేవివి ప్రశ్నించదు. భక్తి పేరుతో తమ శరీరాన్నో, ఇతరులనో గాయపరిస్తే ప్రశ్నిస్తుంది.కరోనా నేపథ్యంలో కొన్ని ఆశాస్త్రీయ వైద్య విధానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భరించలేక కొన్ని ప్రాంతాల్లో పేద ప్రజలు ఈ తరహా వైద్యాలని ఆదరించారు.జేవివి
ఇటువంటి వైద్య విధానాలని ప్రశ్నించింది.

జనవిజ్ఞాన వేదిక ఏ పండుగలకి వ్యతిరేకం కాదు. పండుగలని ఆయా మతస్తులు పర్యావరణ హితంగా, శాంతియుతంగా జరుపుకోమని సూచిస్తుంది. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై సర్వే చేసి ఆ తీవ్రతని పాలకవర్గాల వారికి తెలియజేస్తుంది.ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. అవసరమైతే వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది. సమస్యలపై కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తుంది.దేవుడి గురించి నేరుగా ఎక్కడా జేవివి ప్రస్తావించదు.విశాలమైన ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జేవివి వివిధ నేపధ్యాలున్న వ్యక్తులు, సంస్థలతో కల్సి పనిచేస్తుంది. ఈ క్రమంలో  జేవివి ఎప్పుడూ కూడా తన మౌలిక నిబంధనల పరిధిని అతిక్రమించదు.

1990వ దశకంలో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం, సారా వ్యతిరేక ప్రచారంలో జన విజ్ఞానవేదిక కీలక పాత్ర పోషించింది. పాఠశాలల్లో టాయిలెట్స్ ఆవశ్యకతపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రతి సంవత్సరం విద్యార్ధులకు చెకుముకి పోటీలు నిర్వహిస్తుంది. గేయాలు, ప్రదర్శనల ద్వారా ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు పెంచేందుకు కృషిచేస్తుంది. అయితే ప్రపంచీకరణ నేపధ్యంలో మానవ సంబంధాలు వేగంగా మారిపోతున్నాయి. పెరిగిన వేగంతో ఎక్కువమంది పౌరులు తమ వ్యక్తిగత సమయాన్ని సమాజానికి కేటాయించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావం జె.వి.వి. వంటి సంస్థలపై కూడా పడుతుంది. సమాజంలో నూటికి తొంభై శాతం మంది ప్రజల జీవితాలు ఏదో ఒక మత విశ్వాసంతో ముడిపడినందువల్ల సైన్స్ ప్రచార సంస్థలలో చేరడానికి వారుసాహసించలేకపోతున్నారు. 

మత ప్రచార సంస్థలకున్న ఆర్ధిక మూలాలు సైన్స్ ప్రచార సంస్థలకుండటం లేదు. శాస్త్రవేత్తలు, విద్యావంతులలో చాలామంది దైవాన్ని ఏదో ఒక రూపంలో నమ్మడం, పాలకుల నుండి సైన్స్ ప్రచార సంస్థలకు పెద్దగా ప్రోత్సాహం లేకపోవడం, శాస్త్రీయ ఆలోచనలని ప్రచారం చేసే వారిపై తరచుగా దాడులు జరగడం వంటి కారణాలవల్ల జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు బలోపేతం అవలేకపోతున్నాయి. జె.వి.వి. సమాజంలో ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషి చేస్తుంది. ఇందులోనే వ్యక్తిగత ప్రయోజనాలు ఇమిడి ఉంటాయని విశ్వసిస్తుంది. గత మూడు దశాబ్దాలుగా సైన్స్ ప్రచారంలో జె.వి.వి. ముందున్నా, ఈ సంస్థకీ కొన్ని పరిమితులున్నాయి. సమాజంలో స్వార్ధ రాజకీయ శక్తుల ప్రభావం పెరిగినప్పటికీ, సమాజానికి మంచి చేసేవారు ఇంకా చాలా మందే ఉన్నారు. వీరు తమకు తోచిన సహాయాన్ని ఇతరులకి ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని జె.వి.వి. కలుపుకు పోవాలి. కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టిన కడప,తిరువూరు వంటి ప్రాంతాలలో జె.వి.వి. బలోపేతం అయింది. మతోన్మాదులు విజృంభిస్తున్న ఈ తరంలో జన చైతన్యమే లక్ష్యంగా పనిచేసే జె.వి.వి. వంటి సైన్స్ ప్రచార సంస్థలు మరింత బలోపేతం కావాల్సి ఉంది . ఇందుకు మరిన్ని వినూత్న మార్గాలని అన్వేషించాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పరిష్టమైన చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడానికి జనవిజ్ఞాన వేదిక ఇతర లౌకిక అభ్యుదయవాదులతో కలిసి పనిచేయాల్సిన అవసరం వుంది. 

(పిబ్రవరి 28, జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) 

యం.రాంప్రదీప్, 
సెల్ నెం . 9492712836

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata