శాస్త్రీయ దృక్పథం కలిగిన సంస్కృతి రావాలి
*శాస్త్రీయ దృక్పథం కలిగిన సంస్కృతి రావాలి*
మనం సహేతుకత, శాస్త్రీయ దృక్పథం, శోధన, ప్రశ్నించేతత్వంపై ఆధారపడిన సంస్కృతిని కోరుకుంటాం. ఈ సుగుణాలు మన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నాయి. ప్రభుత్వ విద్య ఎన్ని లోపాలతోనైనా నిండి ఉండనీ గాక, అభివృద్ధినిరోధకులూ, వారి మిత్రులూ సృష్టిస్తున్న అడ్డంకులబండరాళ వల్ల అందరికీ విద్య అందడంలేదన్న వాస్తవం ఉండనీ గాక... అయినప్పటికీ మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన చెప్పిన సుగుణాలతో నిండి ఉంది. బ్రిటిష్ వారి కాలం నుండీ అనేక మంది మేధావులూ, విద్యావేత్తలు భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అభివృద్ధికర భావాలతో కూడిన సంప్రదాయాలను నిర్మించడానికి దోహదం చేశారు. ఇది కేవలం విశ్వ విద్యాలయ క్యాంపస్లకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రజా సైన్సు ఉద్యమాల్లో కూడా ప్రతిఫలించింది. ఒకవైపు పెట్టుబడిదారీ సిద్ధాంతం విజృంభించి అన్ని చోట్లా నిర్నిబంధమైన లాభాపేక్షను పెంచిపోషిస్తూ, ప్రభుత్వ విద్యా విధానాన్ని నాశనం చేస్తుండగా మరోవైపు అంతటా వ్యాపిస్తున్న అహేతుక, అశాస్త్రీయ భావజాలం, మూఢనమ్మకాలు ప్రజా సైన్సు ఉద్యమాలకు హాని చేస్తున్నాయి. కానీ మనం ఈ ఉద్యమాలను బ్రతికించి పెంపొందించాలి. ఎందుకంటే అవి మన పోరాటంలో అమూల్యమైన వనరులు. ఇటీవలి కాలంలో పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వ్యక్తులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కృషిలో తమ ప్రాణాలు త్యాగం చేశారన్న విషయాన్ని మనం మరిచిపోరాదు.
Comments
Post a Comment