ఆర్యుల రాక నిజమే



ఆర్యుల రాక నిజమే?
———————————

హరప్పా ప్రజలు దక్షిణాదివారే.. వారిలో ఉన్నవి ఆ జన్యువులే
‘రాఖీగఢీ’ అస్థిపంజరం నుంచి డీఎన్‌ఏ సేకరించి పరీక్షించిన శాస్త్రజ్ఞులు
భారతదేశంలోకి ఆర్యుల రాక నిజమేనా? నిజమంటారు కొందరు. వారు వచ్చి.. అప్పటికే ఉత్తరాదిన ఉన్నవారిని దక్షిణాదికి వెళ్లగొట్టారని చెబుతారు. ఇదంతా ఆంగ్లేయుల కుట్రని కొట్టిపారేస్తారు మరికొందరు. మరి ఎవరి వాదన నిజం? అత్యంత అధునాతనమైన డీఎన్‌ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు కొంతమేరకు సమాధానం కనుగొనగలిగారు. హరప్పా నాగరికత ప్రజలకు.. దక్షిణ భారతదేశంలోని పూర్వీకులకు మధ్య జన్యు సంబంధం ఉందని తేల్చారు. ఈ నాగరికత క్షీణించిపోతున్న సమయంలో మధ్య ఆసియా నుంచి వ్యవసాయం చేసే రైతు సమూహాలు తరలి వచ్చి.. స్థానికులతో కలవటం వల్ల వారి జన్యువులు కూడా వీరిలో ఉన్నాయని తేల్చి చెప్పారు. మన భారత ఉపఖండ చరిత్రను తిరగరాసే ఈ జన్యుచరిత్రను త్వరలో అంతర్జాతీయ పత్రిక ‘సైన్స్‌’లో ప్రచురించనున్నారు.
 
రాఖీగఢీ.. ఢిల్లీకి మూడున్నర గంటల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లె. దాదాపు 9 వేల ఏళ్ల క్రితం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పటి హరప్పా-మోహంజదారో నాగరికతకు చెందిన అనేక వస్తువులు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. వాస్తవానికి మోహంజదారో కన్నా ఈ నగరం పెద్దదని పురాతత్వ శాస్త్రవేత్తల భావన. అలాంటి రాఖీగఢీకి పశ్చిమ భాగంలో బయటపడిన 37 సమాధులపై పుణేలోని ఓరియంటల్‌ కాలేజ్‌ ప్రొపెసర్‌ వసంత్‌ శివరాం సాఽథే చేసిన అధ్యయనం ఒక కొత్త చరిత్రకు తెర తీసింది. లక్నోలోని బీర్బల్‌ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలియోసైన్సె్‌సకు చెందిన డాక్టర్‌ నీరజ్‌ రాయ్‌, హార్వర్డ్‌కు చెందిన డాక్టర్‌ విఘ్నేశ్‌ నరసింహన్‌ ఆ సమాధుల్లో దొరికిన అస్థిపంజరం నుంచి పురాతన డీఎన్‌ఏను సేకరించి.. విశ్లేషించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
 

ఎంతో కష్టం..

కొన్ని వేల ఏళ్ల నాటి అస్థిపంజరం నుంచి డీఎన్‌ఏను సేకరించటం అంత సులభమైన పని కాదు. ‘‘పురాతన అవశేషాల్లో స్వల్పంగా డీఎన్‌ఏ మిగిలిఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా జన్యు సంక్రమణం జరిగిపోతుంది. ఉదాహరణకు ఒక పుర్రెను గ్లవ్స్‌ లేకుండా ముట్టుకుంటే.. చేతికి ఉండే చిరుచెమట వల్ల కూడా జన్యుసంక్రమణం జరగవచ్చు. అందువల్ల మేము రకరకాల జాగ్రత్తలు తీసుకున్నాం. పరిశోధకుల డీఎన్‌ఏను కూడా సేకరించి జన్యుసంక్రమణం ఎక్కడైనా జరిగిందా? అని పరీక్షించాం. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఫలితాలు చాలా కచ్చితంగా వెలువడ్డాయి’’ అంటారు రాయ్‌. ఇలా సేకరించిన డీఎన్‌ఏను విశ్లేషించడం కత్తిమీద సాము. ‘‘పురాతన డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం అక్కడ ఎంతో ఉపకరిస్తుంది. డీఎన్‌ఏను శుద్ధి చేసి.. దాని ద్వారా జన్యుక్రమాలను రూపొందించగలిగాం. ఇలా రూపొందించిన జన్యుక్రమాలను- మన దేశంలో ఉన్న ప్రజల జన్యువులతో పోల్చి చూశాం..’’ అని రాయ్‌ తన పరిశోధనాక్రమాన్ని వివరించారు. ఈ పరిశోధనల్లో వారు కొన్ని ఆసక్తికరమైన అంశాలను గమనించారు. అవేంటంటే..

ఉత్తర భారతదేశ ప్రజల్లో ఆర్‌1ఏ1 అనే ఒక జన్యువు ఉంటుంది. హరప్పా ప్రజల్లో ఇది లేదు.

హరప్పా ప్రజల జన్యువులు దక్షిణభారత దేశంలోని పూర్వీకుల(ఎన్‌సెస్ట్రల్‌ సౌత్‌ ఇండియన్‌) జన్యువులకు సరిపోలి ఉన్నాయి.

ఇరాన్‌ ప్రాంతంలో పశువులను మచ్చిక చేసుకొనే రైతు సమూహాలకు చెందిన ప్రజల (ఇరానియన్‌ అగ్రికల్చరిస్ట్‌ పాపులేషన్‌లకు) జన్యువులు కూడా కొన్ని ఉన్నాయి.

కొత్త చర్చలు..

ఈ పరిశోధన ఫలితాలు కొన్ని వాదనలను కొట్టి పారేస్తూ.. మరికొన్ని కొత్త చర్చలను లేవనెత్తుతున్నాయి. ఆర్యులు మధ్యఆసియా ప్రాంతం మీదుగా భారత ఉపఖండంలో ప్రవేశించారనేది చాలా కాలంగా ఉన్న వాదన. ఇది సామాజికంగా, రాజకీయంగా ప్రభావం కూడా చూపించింది. అది ఆ తర్వాతి కాలంలో ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజలనే సన్నటి విభజనకు కూడా కారణమయింది. ఆ తర్వాత హరప్పా, వేద నాగరితలు ఒకటేననే వాదన కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ పరిశోధన వల్ల ఇది తప్పని తేలింది. ‘‘రాఖీగఢీ ప్రాంతంలో సుమారు తొమ్మిది వేల ఏళ్ల క్రితం ప్రారంభమయిన జనావాసాలలోకి కొద్దికాలం పోయిన తర్వాత మరి కొందరు వచ్చి చేరారు. ఆ తర్వాత మరి కొన్ని మార్పులు జరిగాయి. వీటన్నింటినీ శాస్త్రీయంగా డీఎన్‌ఏ ద్వారా నిరూపించటానికి మేము ప్రయత్నించాం. మా అధ్యయనంలో క్రీస్తుపూర్వం ఆరువేల ఏళ్ల క్రితం ఇరాన్‌కు చెందిన రైతు సమూహాల జన్యువులు వచ్చి చేరాయని తేలింది. అంటే ఆ సమయానికి వారు ఆ ప్రాంతాలకు వచ్చి స్థిరపడి ఉండవచ్చు’’ అని రాయ్‌ వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే- హరప్పా నాగరికత క్షీణించిపోయే సమయానికి ఇరాన్‌ ప్రజలు వచ్చి చేరారు. వారు క్రమేపీ ఉత్తరభారతదేశంలోకి ప్రవేశించారు. ఇక.. సంస్కృతం మన దేశానికి వచ్చిన సమయంలోనే మరికొంత మంది ద్వారా యూర్‌పలోకీప్రవేశించి ఉండవచ్చని.. అందుకే యూర్‌పలోని కొన్ని భాషలకు సంస్కృతానికి సంబంధం ఉండి ఉండచ్చని భాషాశాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
 
ఈ ప్రశ్నలకు బదులేదీ?

రాఖీగఢీ అస్థిపంజరం డీఎన్‌ఏ ఫలితాల ఆధారంగా.. దక్షిణాది వారికి.. అక్కడి ప్రజలకు సంబంధం ఉందని తేలింది. అయితే, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని నమ్మని వారు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అవేంటంటే..
సింధులోయ నాగరికతలో ఒకే జాతి, ఒకే తెగకు చెందిన ఒకే భాష మాట్లాడే ప్రజలు మాత్రమే లేరు. అది విభిన్న సంస్కృతులు, తెగలు, జాతుల సమాహారం. దానికి సంబంధించి దొరికిన కొన్ని అస్థిపంజరాలను పట్టుకుని, వాటిని పరీక్షించి.. లోయ నాగరికత మొత్తాన్నీ నిర్ణయించడం ఎంతవరకూ సమంజసం?
హరప్పా నాగరికతకు చెందిన ప్రజలు చాలామంది చనిపోయినవారికి దహనకియ్రలు చేసేవారు. ఖననం చేసే తెగల సంఖ్య చాలా తక్కువ. దహనక్రియలు చేసే అలవాటున్న తెగలకు చెందిన మృతదేహాలు ఎప్పటికీ దొరికే అవకాశం లేదు. మరి వారి సంగతేంటి? వారు దక్షిణాదికి చెందినవారో.. తొమ్మిది వేల ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నవారో ఎలా తేలుతుంది?

- ఆంధ్రజ్యోతి స్పెషల్‌ డెస్క్

Uyyala Surendar

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata