ప్రాణం అంటే ఏమిటి ?శరీరంలో అది ఎక్కడ ఉంటుంది ??






ప్రాణం అంటే ఒక group of biological processes. (జీవరసాయన క్రియల  సముదాయం). ప్రాణం అంటే ఒక వస్తువు కాదు, ఒక చోట ఉండటానికి. శరీరంలో నిరంతరం జరగవలసిన జీవరసాయన క్రియల ప్రాసెస్ ఆగిపోతే.. ప్రాణం పోయింది అంటాం అంతే... 

శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అవన్ని సమన్వయంతో వివిధ విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి. శరీర అంతర్భాగంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా, 'ప్రాణం'తో ఉంటాం. వాటిల్లో ఏది పనిచేయక పోయినా అనారోగ్యం పాలౌతాం. సమస్య తౌవ్రతను బట్టి మరణం సైతం సంభవించవచ్చు. అంటే ఆ శరీరానికి 'ప్రాణం' ఉండదన్న మాట..

కొన్ని ఉదాహరణలు చూద్దాం..

ఒక వ్యక్తికి లివర్ ఫెయిల్ అయిందని అనుకుందాం. అపుడు 24 నించి 48 గంటల్లో ఆ వ్యక్తి చనిపోతాడు (చనిపోతుంది). అంటే ఏంటి ? ప్రాణం మెల్ల మెల్లగా నడుచుకుంటూనో అంబాడుకుంటునో లేదా పాక్కుంటూనో.. పోతూ, పోతూ ఉన్నట్టా... :-) లివర్ పనిచేయక పోవడం వలన ప్రాణం పోయిదంటే.. మరి అంత వరకు ఆ ప్రాణం లివర్ లోనే ఉందని అర్థమా ? కాదు కదా...

ఓ మనిషికి అన్ని అవయవాలు సక్రమంగానే (తిన్నగానే) పని చేస్తూ ఉంటాయి. అతని శరీరం ఆరోగ్యంగా, ప్రాణంతోనే ఉంటుంది. ఐతే ఇపుడు ఒక మూడు లీటర్ల రక్తాన్ని శరీరం నుండి లాగేస్తే ఆ మనిషి ఉంటాడా ? ఊహు, ఉండడు. మరణిస్తాడు... మరి దీనర్థం ఏంటి ? ప్రాణం రక్తంలోనే ఉంటుందనా ? కాదు కదా...

గుండె పూర్తిగా పాడైపోయిన సందర్భాల్లో, సర్జరీ చేసి పాడైపోయిన గుండెను తీసేసి, కృత్రిమ గుండెను (లేదా ఒక దాత గుండెను) అమర్చేంత వరకు, కొంతసేపటి కోసమైనా మన పేషెంట్ కు గుండె లేని స్థితి ఉంటుంది... మరి ఈ పేషెంట్ శరీరంలో ఆ కొంత సేపటి కోసమైనా, గుండె లేని స్థితిలో కూడా ప్రాణం కొనసాగుతుంది కాని పోదుకదా ? అంటే ప్రాణం గుండెలోనే ఉంటుందని చెప్ప లేం కదా...

Brain "Dead" అయ్యాక కూడా కొన్ని గంటల పాటు, (ఇతరులకు ఉపయోగపడే అవయవాలను సేకరించి భద్రపరిచే వరకు), ఓ మనిషి శరీరాన్ని (బాడీని) "బతికించి ఉంచుతారు" డాక్టర్ లు. మరి అపుడు మెదడు "డెడ్" అయినా, మిగిలిన కొన్ని అవయవాలలో ప్రాణం ఉన్నట్టే కదా ?

ఈ లెక్కన బ్రెయిన్ "డెడ్" ఐన తర్వాత కొన్ని గంటల పాటైనా.. శరీరంలోని ఇతర అవయవాలు, మెదడు ఆదేశాలతో పని లేకుండా, తమ పని తాము చేస్తూనే ఉంటాయి కదా... మరి ప్రాణం Brain లోనే ఉంటుందని అనుకో గలమా ?

అందుకే "ప్రాణం" అనేది ఒక ప్రత్యేకమైన భౌతిక వస్తువు కాదు. శరీరంలోని ప్రతీ జీవకణంలోనూ జీవ, రసాయనిక చర్యలు నిరంతరం జరుగు తుంటాయి. శరీరంలో అలాంటి చర్యలు సక్రమంగా జరుగుతున్నంత కాలం, ఆ శరీరానికి 'ప్రాణం ఉంది' అని అనుకోవాలి. శరీరంలో ఆ చర్యలన్ని ఆగిపోతే.. ఆ శరీరంలో 'ప్రాణం లేదు' అని అనుకోవాలి. అంటే అపుడు ఆ శరీరం శవమైనట్టు లెక్క.. ఇంకా చెప్పాలంటే, ఆ శరీరం ఇకపై "ప్రాణంలేని ఇతర భౌతిక వాస్తువుల"తో సమానం అన్నమాట..

అందుకే.. "శరీరం ప్రాణం కోల్పోతే, ఆ 'ప్రాణం' ఎక్కడికి పోతుంది ?" అనేది అర్థం, పర్థం లేని ఒక వ్యర్ధమైన ప్రశ్న. ఎందుకంటే.. శరీరాన్ని విడిచి పెట్టి ఎటో వెళ్ళి పోవడానికి.. 'ప్రాణం' అనేది ఒక ప్రత్యేకమైన భౌతిక "వస్తువైతే" కాదు కాదా...

మనం వెలిగిస్తే ఒక దీపం వెలుగుతుంది... మనకి ఆ దీపం తాలూకూ మంట, దాని వెలుగూ కనిపిస్తాయి... 

ఊదేస్తే దీపపు మంట ఆరిపోయింది... సో ఆ వెలుగు ఎక్కడికి పోయింది అంటే ఏం చెప్తాం ?

దీపపు 'మంట', దాని 'వెలుగు' అనేవి రసాయనిక చర్య యొక్క ఫలితం.. దీపాన్ని వెలిగించి నపుడు, వత్తి ద్వారా సరఫరా అయ్యే నూనె, గాలిలోని ఆక్సిజన్ ను ఉపయోగించు కుంటూ మండుతుంది. అలా మండటం అనేది ఒక రసాయనిక చర్య (ప్రాసెస్). కాబట్టి దీపపు వెలుగు ఒక కంటిన్యువస్ ప్రాసెస్...

అలాగే మనం 'ప్రాణం' అని పిలిచేది కూడా మన శరీరంలో కొనసాగుతున్న జీవ, రాసాయన ప్రక్రియల సముదాయం. అనుకూల పరిస్థితులలో ఈ ప్రక్రియలు జరగటం.. అననుకూల పరిస్థితులలో అవి ఆగిపోవటం సంభవిస్తుంది... ఐతే అవి స్విచ్ ఆన్ వేసినట్టు రావటం లేదా స్విచ్ ఆఫ్ చేసినట్టు పోవటం అంటూ జరగదు... 

పైగా ఆ జీవ రసాయన క్రియలు, మనిషి శరీరంలో ఏదో ఒక చోటనే జరగడం అంటూ ఉండదు. ఆ క్రియలు శరీరంలోని అన్ని జీవకణాల్లోనూ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అవి పూర్తిగా ఆగిపోతేనే శరీరం నిర్జీవ వస్తువౌతుంది. అంటే ప్రాణం లేనిదౌతుంది. చివరకు ఈ మృత శరీరం ప్రకృతిలో (అంటే నిర్జీవ పదార్థాల్లో) కలిసి పోతుంది. అంతే...

అంతకు మించి మృత శరీరం నుండి "ఆత్మ" రూపంలో, "ప్రాణం" వంటిది ఏదీ ఎగిరి పోయేది, లేచి ఎటో వెళ్ళి పోయేది ఉండదు గాక ఉండదు...

"ప్రాణం", "జీవం", "ఆత్మ" "పరమాత్మ"., మొదలైన పదాలను వాడి అన్ని మతాల వారూ జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు.. అలాంటి వారి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి...

🙏🏻తుమ్మలూరు మునెయ్య వార్త ఆట్లూరు కడప జిల్లా 8498899212

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం