నిత్యజీవితంలో ప్రతి మనిషి భౌతికవాది __కారల్ మార్క్స్
అనంతాకాశంలోని ఆచంద్రతారార్కం ఎంత సత్యమో ఈ మాట అంతే సత్యం!
అంటే నిత్యజీవితంలో, ఆ జీవితంలో కలిగే సంఘర్షణలో, పోరాటంలో తను కొన్ని భౌతిక సూత్రాల (Physical principles) మీదనే ఆధారపడి మనిషి తన పయనం సాగిస్తూ ఉంటాడు. తనకు సైన్సు విజ్ఞానం తెలిసినా తెలియకపోయినా తన ప్రమేయం లేకుండానే, తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండానే సైన్స్ విజ్ఙానం పరచిన వెలుగులో సాగిపోతూనే ఉంటాడు. ఎందుకంటే సైన్స్ ప్రపంచ మానవాళికోసం, వారి శ్రేయస్సుకోసం, సుఖసంతోషాల కోసం నిరంతరం అభివృధ్ది చెందింది...చెందుతూనే ఉంది. ఇది ఏ ఒక్కరికోసమో కాదు...చదువుకున్నవారికోసమో కాదు.డబ్నున్న వారి కోసమో కాదు.పెట్టుబడి దారులకోసమో కాదు.
సైన్స్ సర్వ ప్రపంచ మానవాళికోసం....వారి అభ్యదయం కోసం..వారి కనులలో ఆనందాల వెలుగులకోసం!
అయితే....తన పుట్టిన కుటుంబ సాంప్రదాయాలను అనుసరించో, కాదనలేకనో,
భయంతోనో, తెలియనితనం చేతనో, ఎవరూ విశ్లేషించి చెప్పకపోవడం చేతనో, తను ఆలోచించలేకపోవడం చేతనో, భయంతోనో, స్వార్ధంతోనో, మనకు కనపడని, ఓ ఊహాజనితలోకమైన స్వర్గ ప్రవేశం కోసమో, స్వర్గంలోని విలాసవంతమైన జీవితంకోసమో, నరకానికి పోకూడదనో, తీసుకుపోబడకూడదనో అస్తిత్వమేలేని ఓ అతీతశక్తిని ఊహించుకుని, దానికి తనకుతానే అద్భుతశక్తులు ఆపాదించి, దానికి మంచిచెడులను నిర్ణయించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, దానికి ఆగ్రహం,శాంతి,ప్రేమ భావనలను జోడించి, సంతోష పరచుటకై ప్రార్ధనలను కల్పించి,ధూపదీపనైవేద్యాలనూ,కానుకలనూ సమర్పించుకుని ,జంతుబలులను సంతర్పణ గావించి తనకు తానుగా దాసోహమై ఏదో అలౌకిక ఆనందంలో, మిధ్యాలోకాల్లో విహరిస్తూ తన జీవితం పరిసమాప్తం చేసుకుంటాడు.
జీవితమంతా తనకుతాను లేదా తనలాంటి మరో మానవుడు తన మేధస్సు తో ప్రకృతి నుండి రూపొందించిన విజ్ఙానాన్ని భువిపై కనులు తెరచినప్పటినుండి ,అవి మూతపడేంతవరకూ ఆస్వాదిస్తూనే, అందుకుంటూనే, వినియోగించుకుంటూనే,మరోవైపు తను సృష్టించుకున్న మిధ్యా భక్తిలోకాల్లో,బానిస ప్రపంచాల్లో విహరిస్తూ ద్వంద్వప్రమాణాలతో జీవనం సాగిస్తాడు.
అవసరం వచ్చినప్పుడు, తన ప్రాణాలు నిలుపుకునేందుకు, తన పరివారాన్ని కాపాడుకునేందుకు ముందుగా తను కనుగొన్న సైన్సు విజ్ఞనాన్నే ఆశ్రయిస్తాడు...నమ్ముకుంటాడు..ఉపయోగించుకుంటాడు.ప్రాణం నిలుపుకుంటాడు. అప్పుడతనికి భక్తి మార్హాలు గుర్తుకురావు...వచ్చినా అవి ఉపయోగపడవనీ తెలుసు.
చివరికి ప్రయోగానికీ, పరిశోధనకూ, పరిశీలనకూ నిలిచి నిజానికీ, సత్యానికీ ప్రతీకగా నిలిచిన సైన్స్ విజ్ఙానాన్నే అనుసరిస్తాడు. ఉపయోగించు కుంటాడు.
అందుకే మానవుడు నిత్య జీవితంలో భౌతికవాది మాత్రమే!!!
......డా. కాలేషా బాషా
Comments
Post a Comment