అంధవిశ్వాసాలను రూపుమాపాలి.


"మతం అనేది దోపిడీ వల్లనే పుట్టింది. దోపిడీ కోసమే పుట్టింది. అది పుట్టిన దగ్గర్నించీ దోపిడీకే సేవ చేస్తూవుంది. దోపిడీ ఎంతకాలం వుంటే, అంతకాలమూ మతం వుంటుంది. అందుకే, మతం పోవాలి అంటే దానికన్నా ముందు దోపిడి పోవాలి అనడం” అని రంగనాయకమ్మ రాసింది. బాగానే వుంది. దోపిడీ దారులు తమ దోపిడీని నిరంతరం కొనసాగించేందుకు, జనాన్ని మూఢనమ్మకాల్లో వుంచే మతాన్ని తమకు అండగా పెట్టుకొని, దాన్ని స్థిరంగా వుంచడానికే ప్రయత్నిస్తోన్నారనేది వాస్తవమే.
       "మత మిషయాల్ని మార్చుకోవాలనుకుంటే మతానికి పునాది ఏమిటీ? ఆర్థికరంగం : ఆ ఆర్ధికరంగాన్ని మార్చుకోవాలి. అంటే, ఆ రంగానికి సంబంధించిన పాతభావాల్ని మార్చుకోవాలి"  అంటూ ఆమే చెప్పింది. మరి రష్యాలో ఆర్థికరంగంలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టబడిన తర్వాత గూడా  మతం అదృశ్యం గాలేదెందుకు? రష్యన్ లీడర్లు యీ మత విషయాల్ని సెకండరీ విషయంగా భావించారా? పేదప్రజల దారిద్య్రం నిర్మూలించబడిన తర్వాత గూడా, సోషలిస్ట్ దేశాల్లో మత మౌఢ్యం యింకా ఎందుకు బతికివుంది? "మతం మత్తుమందు" అని నిర్ద్వంద్వంగా బోధించిన మార్క్స్ సిద్ధాంతాల్ని అమలు జేస్తోన్న నేటి సోషలిస్ట్ దేశాల్లో, ఈ రోజుకీ మతం సజీవంగానే ఉంది - అనే సత్యాన్ని మనం కాదనలేం. సోషలిస్ట్ సంస్కృతి నిర్మించబడిన శతాబ్దాల తర్వాత కూడా, ఫ్యూడల్ సంస్కృతికి చెందిన యీ దేవుడూ - మత భావాలు ఈ దేశాల్లో ఎంచేత అదృశ్యం గాలేదు? అక్కడ స్కూళ్ళూ కాలేజీల్లో గతితార్కిక భౌతికవాదమూ, చారిత్రక భౌతికవాదమూ, డార్విన్ పరిణామ వాదమూ, మార్చ్ - ఎంగిల్స్ - లెనిన్లు మతమూ దేవుడు పై రాసిన సిద్ధాంత గ్రంధాలూ బోధించడంలేదా? అలా బోధించినా సరియైన ఫలితాలు కలగడంలేదా?

నేటి కమ్యూనిస్టుల్లో కొందరు, ఆర్థిక పోరాటానికి ప్రాధాన్యమిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించాలని అంటున్నారు. "మతం అవతరించడానికి కారణమైన సాంఘిక వైరుధ్యాల్ని విప్లవాత్మకంగా నిర్మూలించినట్లయితే, మతం నిర్మూలించబడుతుంది" అని మార్క్స్ చెప్పిన అంశాన్ని వీరు ఉటంకిస్తూంటారు. (The conditions for eliminating religion is the revolvutionary elimination of social contradictions which give rise to it) ఈ విషయం చెప్పిన మార్క్సే "ప్రజల పాలిట మతం- నల్లమందు". అనీ, "అన్ని విమర్శలకి నాంది - మత విమర్శ" అని గూడా హెచ్చరించాడు. (The criticism of Religon is the pre-condition of all other criticisms.) ప్రజల దైనందిన సమస్యలపై ఆర్థిక పోరాటాలు చేసి తీరవలసిందే. అయితే మార్క్స్ హెచ్చరించినట్లు, ప్రజల్లోంచి మతం మత్తుమందును నిర్మూలించి, వారిని చైతన్యవంతుల్ని జేయాల్సిన అవసరం లేదా? మతం గూర్చి మార్క్స్ చెప్పిన సూక్తిని పూర్తిగా గంగపాల్జేయడం -ఏ రకమైన మార్క్సిస్ట్ అవగాహన? కేవలం ఆర్థిక పోరాటాలకి మాత్రమే పరిమితం కావడం ఏ రకమైన మార్క్సిస్ట్ ఆచరణ? ఆర్థిక అసమానతలు పోయినంతమాత్రానే, సామాన్య ప్రజల్లో సాంస్కృతిక విప్లవ చైతన్యం వొస్తుందనేది భ్రమ మాత్రమే.

మనదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభకులు, ఫ్యూడల్ భావాల బూజును దులిపే సాంస్కృతిక పునర్వికాసం ప్రాధాన్యాన్ని ప్రధమ దశలో గుర్తించి, అందుకోసం కృషిచేసిన విషయం వాస్తవమే. కాని అనంతర దశలో ఈ ప్రాధాన్యం గూర్చి వారు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. క్రమేణా ఈ నాయకులు ప్రదర్శించిన ఈ నెగిటివ్ వైఖరి వల్ల, దేశంలోని సాంస్కృతిక పునర్వికాస ఉద్యమానికి తీరని నష్టం జరిగింది.

సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడితే, ఫ్యూడల్ సంస్కృతికి చెందిన పాత భావాలు ఆటోమేటిక్ గా, చిటికెలో అదృశ్యమవుతాయని చెప్పే కబుర్లు అబద్ధమని, అరవై ఏళ్ళ చరిత్ర నిరూపించింది. 

దేవుడూ మతానికి చెందిన అంధవిశ్వాసాలు, కొన్ని వేల ఏళ్ళు నించి గాడిద బరువు వారసత్వంగా నేటి మానవునికి సంక్రమించాయి. అంచేత ఈ అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేయాల్సిన అవసరమెంతో వుంది. 

____చిత్తజల్లు వరహాలరావు
(హేతువాద నాస్తికోద్యమం నుండి)

Comments

Post a Comment

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం