తాత్విక దృక్పథం
తాత్విక దృక్పథం
@పిళ్లా కుమారస్వామి ,9490122229
ప్రతిమనిషికి తన అనుభవాల ద్వారా ఒక దృక్పథం అంటూ ఏర్పడుతుంది. ఏళ్లతరబడి పాతుకుపోయిన విశ్వాసాలు, శాస్త్ర విజ్ఞానం అందించిన జ్ఞానం ఆధారంగా ఒక తాత్విక దృక్పథం బాధ్యతలు తీరిపోయిన వారికి, ముసలివారికి మాత్రమే ఏర్పడేది కాదు. ఉదాహరణకు ఈ సమాజం మారదు. అదృష్టం ఎంతటిదైనా సాధించవచ్చు. తలరాతను తప్పించలేం! లాంటివన్ని ప్రతిమనిషికీ ఏదో ఒక సమయంలో ఏర్పడే భావాలే. అయితే అనుభవాల ద్వారా కొన్ని భావాలను మార్చుకుంటూ మరికొన్ని కొత్త భావాలను ఏర్పరచుకుంటూ తాత్విక దృక్పథాన్నిఅలవర్చుకుంటాడు. సమాజంలో వస్తున్న మార్పుల మీద పరిస్థితుల మీద ఇది ఆధారపడి ఉంటుంది.
నేటి సమాజంలో రెండు దృక్పథాలు గల మానవులు ఉన్నారు. వీరిని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి లాటరీ కొంటాడు. అదృష్టం బాగుంటే లాటరీ తగులుతుంది కదా అంటాడు. డబ్బు వచ్చే 'అదృష్టం' ఉంటే లాటరీ కొనకపోయినా డబ్బు ఆ
వ్యక్తికి రావాలి కదా! లాటరీ టికెట్టు ఎందుకు కొనాల్సి వచ్చింది?
అదృష్టం ఉంటే లాటరీ తగులుతుందని అనుకోవటం భావవాదం. అంటే కేవలం మానసికంగా భావించేది మాత్రమే. ఇది ఎక్కడా ఆచరణలో కనిపించని భావం. లాటరీ టికెట్టు భౌతికంగా కొనడం భౌతికవాదం. ప్రతి ఒక్కరు డబ్బులిచ్చి లాటరీ టికెట్టు కొంటారు. ఇది ఆచరణలో కనిపిస్తుంది.
విధిరాతను ఎవరూ తప్పించలేరు. మనిషి ఆయుష్షు తీరిపోవాలని రాసి ఉంటే మనిషి మరణిస్తాడు అంటారు. తనకు రోగం వస్తే మాత్రం తలరాత ప్రకారం తన రోగం నయం కావాలని రాసిఉంటే, తన రోగం నయమవుతుంది. కదా అని ఊరుకోడు. తక్షణం వైద్యుల్ని సంప్రదించి వైద్యం చేయించుకుంటాడు. ఇందులో తలరాత ప్రభావం అనే భావవాదం (ఊహ). రోగం వస్తే వైద్యుల్ని సంప్రదించడం భౌతికవాదం. (ఆచరణ).
ఈ ధోరణులు పరిశీలిస్తే ఒక విషయం బోధపడుతుంది. భావవాదులుగా ఉన్న వారందరూ కూడా ఆచరణలో భౌతికవాదులే నన్నాడు మార్క్స్. అయినప్పటికీ భావవాదులకు తమ భావనా ప్రపంచంలో మానవాతీత శక్తి ఉందన్న విశ్వాసం ఉంటుంది. అందువల్ల తమ ఊహల్ని ఈ వాస్తవ ప్రపంచంపై రుద్దుతారు. అంతేగాక వాస్తవం గా కనిపించే శ్రమను తక్కువ గా చూస్తూ కించపరుస్తారు.
సినారె తో విశ్వంభర లో చెప్పిన కవితా చరణాలు ఈ విషయాన్ని విప్పి చెపుతాయి.
అంతా నదుట రాసి ఉందంటే
యంత్రాలు నడిచేవికావు
విధిపరిధిలో చంక్రమిస్తుంటే
వివేకం పెరిగేదికాదు
సంకల్పం నడుము చుట్టకుంటే
చరిత్ర తిరిగేదికాదు
మనిషి జీవితం అనుభవాంకితం
శ్రమజీవన సౌందర్యఫలం.
భౌతిక వాదులు ఇందుకు పూర్తిగా భిన్నం. మానవ ప్రయత్నానికి
ప్రాధాన్యతనిస్తారు. కనిపించే ప్రపంచాన్ని వాస్తవంగా భావిస్తారు. బయట కన్పించే. పరిస్థితులను బట్టి నడుచుకుంటారు. వీరిద్దరి మధ్య తేడాలు మనం ఇలా గమనిస్తాం.
భావవాదం
1. ఈ ప్రపంచం మిథ్య
2. జగత్తంతా ఆదిమధ్యాంత రహితుడైన పరబ్రహ్మ సృష్టి
3. ప్రపంచాన్ని తెలుసుకోగలమనేది మన భ్రమ.
4. ప్రపంచాన్ని మార్చగలిగేది. నిరీశ్వర శక్తి మాతమే. మానవుడు అల్పుడు. మనిషి దేన్నీ మార్చలేదు.
5. మనకు లభించిన జ్ఞానమంతా అతీంద్రియశక్తుల అనుగ్రహమే. మనజీవన గమనమంతా మానవాతీత శక్తిచే నడుపబడుతున్నది.
6. మనిషి అల్పుడనే భావన పెరిగింది. పైగా మూఢ మనిషిలో విశ్వాసాలు, దెయ్యాలున్నాయన్న భావన, సాంఘికంగాదురాచారాలు పెరిగాయి.
7. మానవుల్లో ఎక్కువ తక్కువలన్నీ భగవత్ సంకల్పమని వాటిని పోగొట్టలేమని చెప్పింది కులవ్యవస్థ. విధి రాతను మనం తప్పించలేమని అదంతా పూర్వజన్మ సుకృతమని చెప్పింది. మనిషిని క్రియాశూన్యున్ని చేసింది.
భౌతిక వాదం
1. ఈ ప్రపంచ వాస్తవం
2. ప్రపంచానికి మూల పదార్థం
3.ప్రపంచాన్ని తెలుసుకోగలం
4. ప్రపంచాన్ని మార్చగలం. మానవుని క్రియాశీలక శక్తే ఇందుకు మూలం
5. ఆచరణ, అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం.
6.తన మనుగడకై ప్రకృతితో సాగించిన పోరాటంలో లభించిన జ్ఞానం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.సామాజిక రుగ్మతలపై సమరం సాగిస్తూ పురోగతి సాగిస్తున్నాడు.
7. మానవుల్లో అసమానతలు మనం కల్పించుకున్నవని,వాటిని నిర్మూలించుకోవచ్చని తేలింది.
మూఢవిశ్వాసాలు, కులతత్వం, మతతత్వం, సాంఘిక దురాచారాలు వంటివి తప్పని ఆచరణలో రుజువైనాయి. అయినా ఇంకా అత్యధిక ప్రజానీకంలో వీటిపై విశ్వాసం ఎందుకుంది?
చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో భౌతికవాదులుగాను, బయట ప్రపంచంలో భావవాదులుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారు?
మూఢవిశ్వాసాలు సోమరులకు, పరాన్న భుక్కులకు, శ్రమజీవులను పీడించేవారికి ఉపయోగపడుతూ ఉండడం వల్ల వాటిని కొనసాగిస్తున్నారు. పీడితులు తమ బాధలకు మూలం కర్మసిద్ధాంతమని తెలుసుకోనీకుండా చేస్తుంది. అందుకే వ్యవసాయ కూలీలు తిరగబడకుండా ఉండడానికి పెత్తందార్లు నేటికీ గ్రామాల్లో పరోక్షంగా కర్మసిద్ధాంతాన్ని ప్రచారం చేయిస్తుంటారు. మూఢవిశ్వాసాలను ప్రోత్సహిస్తుంటారు.. కులవివక్షతను పాటిస్తూ అది సామాజిక అవసరంగా ప్రచారం చేస్తుంటారు.. వాటిని తప్పనటం పాపమని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని చెపుతారు. అందరూ చెప్పేవాళ్లే అయితే చేసే వాళ్లెవరు? అందరూ సమానమై పనిచేసేవాడెవరు? మన చేతి ఐదు వేళ్లూ సమానంగా ఉన్నాయా? అంటూ ప్రశ్నిస్తుంటారు. మేము చెప్తూ ఉంటాం. మీరు చేస్తూ ఉండండి అనేదే వారి పద్దతి.
మతతత్వం ప్రజలను చీల్చడానికి, ప్రజల భావాలను మళ్లించడానికి ఉ పకరిస్తుంది. సాధారణంగా కష్టజీవులు ఐక్యంగా ఉంటారు. కష్టజీవులు తిరగబడకుండా హక్కుల కోసం పోరాడకుండా ఉండాలంటే వారిని చీల్చడం పాలకవర్గాలకూ వారిని బలపరిచే సంపన్న వర్గాలకు అవసరం. అందువలన పాలకవర్గాలు సమాజ తిరోగమన వాదులైన, అభివృద్ధి నిరోధక శక్తులైన ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, ముస్లింలీగ్ వంటి మత సంస్థలు ప్రజలను విభజించడానికి, కష్టజీవుల ఐక్యతను భగ్నం చేయడానికి మతతత్వాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే మతసంబంధ విశ్వాసాలను ప్రజల్లో అవి విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఉదా: వినాయకుడు పాలు త్రాగడం మొదలైనవి.
వీడితులు, మహిళలు దోపిడీని ఎదిరించకుండా భరించడానికి పిరికితనంతో బ్రతకడానికి భావవాద మూలాంశాలైన మూఢాచారాలు, దురాచారాలు తోడ్పడతాయి. అందుకే భావవాద రూపాలను దోపిడీ వర్గాలకు చెందిన వారు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అనేక రూపాల్లో తోడ్పాటునందిస్తున్నారు.
అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికలన్నీ ఇలాంటి వాటిని పెంపొందించే అంశాలెన్నో రాసి ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంగ్లేయులే. భారతీయులంతా పరలోక చింతనాపరులని
(ఆధ్యాత్మిక వాదులని) ఇహలోక ఆలోచనాపరులు కాదని ప్రచారం చేశారు. తద్వారా భారతీయులు తమకు (ఇహలోకపు జరుగుతున్న దోపిడీని పట్టించుకోకుండా చాలాకాలం వరకు నిలువరించగలిగారు.
కొన్ని ప్రభుత్వాలు వర్షాల కోసం యజ్ఞయాగాదులు చేయటం ఇందులో భాగమే. సాంస్కృతిక రంగానికి సేవ చేస్తున్నానని ప్రచారం చేసుకునే వ్యక్తి వేయి శివలింగాలను స్థాపించడం, అభిషేకాలు చేయడం కూడా తన సంపదకు మూలమైన దోపిడీని మరుగుపరచడానికే. పూర్వం రాజులు దేవాలయాలు నిర్మించడం కూడా ప్రజల్లో భావవాదాన్ని ప్రచారం చేస్తూ తమ అధికారాన్ని నిలబెట్టుకోడానికే, ప్రజలు తమను ప్రశ్నించకుండా ఉండడానికే. ఇప్పటికీ పాలకవర్గాలు, పాఠ్యపుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా భావవాదాన్ని ప్రసారం చేస్తూ నిరంతరం ప్రజలను
ఆలోచించనీయకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజు ప్రజల్లో మూఢ విశ్వాసాలను పెంచుతూ ఉండాలని చెప్పాడు. వాటి ద్వారా ప్రజల్లో రాజుపట్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని చెప్పాడు. అవసరమైతే వేగుల ద్వారా కొన్ని పుకార్లు సృష్టించి ప్రజల నుంచి సంపదను వసూలు చేసి ఖజానాను నింపుకోవాలని సూచించాడు. రాజుకు మాత్రం ఎలాంటి మూఢ విశ్వాసాలు ఉండరాదన్నారు. కేవలం వీటిని ప్రజలను అదుపులో ఉంచడానికి ఉ పయోగించాలన్నారు. నాటి గుప్తులు ఇలాంటి వాటిని అనుసరించారు. అయితే నేటి హైటెక్, బయోటెక్ పాలకులు కూడా ఇలాంటి వాటిని నేడు కూడా ఉ పయోగించడం ఆశ్చర్యం కదా!
శాస్త్రవేత్తలు సమాజానికి అతీతులు కారు. వారు కూడా ప్రజల్లో భాగమే. ప్రజల్లో ప్రచారంలో ఉన్న భావాల్ని వారు కూడా వంటబట్టించుకున్న వారే. కానీ తాను తన పరిశోధనల్లో భౌతిక వాదంతో పనిచేస్తూ దైనందిన జీవితంలో భావవాదంతో ఉండడం శాస్త్రీయ ఆలోచన కొరవడటమే. తరతరాల భావవాద ఆలోచనలను తలలో మోయటం, తనకు తాను తమ శాస్త్ర సాంకేతిక రంగాలకు ద్రోహం చేయడమే. అంతేగాక దోపిడీ వర్గాలకు పరోక్షంగా వత్తాసు పలకడమే.
మోసగాళ్లు, దొంగస్వాములు, బాబాల కోసం ప్రజలను ఆకర్షించేందుకు తన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఉపయోగించే ఆధునిక శాస్త్రవేత్తను తన రంగానికి దూరమైనట్లుగా భావించవచ్చు. శాస్త్రీయ దృక్పథం కొరవడినందునే ఈ తరహా శాస్త్రవేత్తలు సైన్సును జీవనానికి మార్గంగా ఎంచుకుంటున్నారే తప్ప జీవితంలో భాగంగా చేసుకోలేకపోతున్నారు.
ప్రతి మనిషికి ఒక దృక్పథం ఉన్నట్లే
సమాజంలోనూ అధిపత్యస్థానంలో ఒక తాత్విక దృక్పథం వుంటుంది. అది ఆ సామాజిక వ్యవస్థను నిలబెట్టే భావజాలం ఆ సామాజిక వ్యవస్థలోని అసమానతలను వీడికులు ఆమోదించడానికి అది దోహదం చేస్తుంది. పాలక వర్గాలలో లేక మధ్యతరగతి లో పుట్టి పెరిగిన వాళ్ళకు తెలిసి అయినా తెలియక అయినా ఈ దృక్పధమే అలవడుతుంది.పీడిత వర్గాల దృక్పధంలో సహితం ఈ పాలక వర్గ ప్రాపంచిక దృక్పథం చాలా బలంగా వుంటుంది.
మన ఆలోచనల మూలం ఏమిటో, అవి ఎవరికి ఉపయోగపడతాయో, ఎవరిని అణచివేయడానికి అవి కల్పించబడ్డాయో వివేవించకుండా నా స్వంత
ఆలోచనలు, స్వతంత్రమైన భావాలు, నేను ఎవ్వరికీ విధేయుడనుకాను, ఏ వర్గానికి
బానిసను కాదు అనుకోవడం చాలా పొరబాటు. స్వంతం' అనుకునేది. 'స్వతంత్రంఅనుకునేవి కూడా సమాజం నుండే వస్తాయి. వాటిపట్ల బాధ్యతాయుతమైన నిబద్ధత ఉండటం 'స్వంతం' అంటే అర్ధం. వాటిని చైతన్య పూరితంగా ఆమోదించడం స్వతంత్రం అంటే అర్థం. ఈ రెండిటికి ముందు అవి సమాజంలో ఏ కోణం నుండి వచ్చాయో. ఏ మూలలో పుట్టాయో, ఏ ప్రయోజనాన్ని సాధిస్తాయో, ఏ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తాయో, ఎవరికి ఉపయోగపడతాయో చూడడం అవసరమని బాలగోపాల్ చెపుతారు.
ఈ ప్రపంచం మారుతుందా? ఈ విశ్వాసాలు ఇలాగే ఉంటాయేమో కదా! అని భావిస్తుంటారు చాలామంది. ఇంతవరకు ప్రపంచాన్ని తత్వవేత్తలు వేర్వేరు విధాలుగా వర్ణించి చెప్పారు. మన కర్తవ్యం దాన్ని మార్చడమని మార్క్స్ చెప్పినట్లు మనం ప్రత్యేకంగా పూనుకుని మార్పుకోసం పాటు పడాల్సిన అవసరముంది.
Comments
Post a Comment