శాస్త్రీయ ఆలోచన
శాస్త్రీయ ఆలోచన
___ పిళ్లా కుమారస్వామి,9490122229
ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? ప్రకృతి ఎలా ఆవిర్భవించింది?. మనిషి ఎలా భూమి పై ఎలా పుట్టాడు?మనిషి మరణం తర్వాత ఏమవుతుంది?
పుట్టుక మరణం మధ్య జీవితం లో ఎలా వ్యవహరించాలి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి మానవుని మదిని ఏదో ఒక సమయంలో తొలుస్తూ నే ఉన్నాయి. వీటికి చాలా వరకు సమాధానాలు లభించాయి.
మనిషి తన మనుగడకు ప్రకృతిలో సంఘర్షణ పడేవాడు. తొలిదశలో ప్రకృతి శక్తుల మర్మం అంతుచిక్కేది కాదు. దాంతో మనిషి ఏదో ఒకటి ఊహించుకునే నైజం ఉండేది. ఏమీ తెలియని దశలో మనిషి ప్రపంచాన్ని గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాడు. వర్షాన్ని వరుణదేవునిగా, అగ్నిని అగ్నిదేవుడుగా, గాలిని వాయుదేవునిగా భావించి, వాటి ఆగ్రహాన్ని తట్టుకునేందుకు లేదా కరుణకొరకు ప్రార్ధనలు చేయడం లేదా గానం చేయడం నేర్చుకున్నాడు. ప్రపంచాన్ని ఎవరో నియంత్రిస్తున్నారనే భావం ఏర్పడింది. అందుకనే భూమిని, మనిషిని ఒకటేమిటి సకల చరాచర జగత్తునంతా భగవంతుడు సృష్టించాడనే భావం ఏర్పడింది.
బైబిలు మనుష్యుల దేవుని సృష్టి గురించి వివరిస్తూ, ఆదికాండము 1:26 ఇలా చెబుతుంది: “అప్పుడు దేవుడు ఇలా అన్నాడు,‘ మన స్వరూపానికి అనుగుణంగా, మన స్వరూపంలో మనుషులను చేద్దాం ’”; ఆదికాండం 2: 7 లో, "అప్పుడు దేవుడు భూమి నుండి మట్టితో మనిషిని సృష్టించాడు"; మరియు ఆదికాండం 5: 1 ప్రకటిస్తుంది, "అతను వారిని దేవుని పోలికలతో చేశాడు." మరోచోట ఆ దేవుడు ఈ ప్రపంచంతోపాటు ఆదాం, ఈవ్లను సృష్టించాడని బైబిల్ చెబుతుంది. ఆదామ్, ఈవ్ దేవుని మాట వినకుండా ఆపిల్ పండు తినడం ద్వారా జ్ఞానం పొంది, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారని అప్పటి నుంచి వారిద్దరి కలయిక ద్వారా మానవాళి ఏర్పడిందని చెబుతారు. అదేవిధంగా సృష్టి స్థితిలయకారులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నారని కూడా హిందూ పురాణాలలో కథలున్నాయి. 'ఓం'కారం నుంచి ఈ జగత్తు ఏర్పడిందని చెబుతుంటారు. భగవంతుడు ఆది, మధ్యాంతరహితుడని చెప్పినారు. ఖురాన్ ప్రకారం అల్లా ఒక్కడే దేవుడని, ఆయన ఆజ్ఞానుసారమే ఈ ప్రపంచం ఏర్పడిందని చెబుతారు. ఈ భావాల పరంపరను కవితాత్మకంగా
కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఇలా వ్యక్తీకరిస్తాడు.
"దేవుళ్లని తన రూపంలో సృష్టించుకుని/
తన భయాన్ని వారికి తగిలించుకుని/అడిగినప్పుడల్లా వరాలిమ్మని ఒప్పందం చేసుకుని ఫరవాలేదని ప్రమత్తుడయ్యాడు మానవుడు"
విశ్వం స్వయంభువు. అంటే అది స్వతస్సిద్ధంగా ఉంది. విశ్వాసానికి మొదలు ఉండాలనడంలో అర్థం లేదు."సృష్టి ప్రారంభం అంటూ ఒకటుందని మనం ఊహించుకోడంలో అర్ధం లేదు.దేనికైనా మొదలు అంటూ ఉండాలనుకోవడానికి కారణం ఊహాత్మక శక్తి లోపించడమే.' అన్నాడు బెర్టండ్ రస్సెల్. దేవుడెలా పుట్టాడంటే ఆయన స్వయంభువు అంటారు ఆధ్యాత్మిక వాదులు.మరి విశ్వం స్వయంభువంటే కూడా అందరూ ఒప్పుకోవాల్సిందే కదా!
ప్రకృతిమూలమైన పదార్థం కూడా అదేవిధంగా వచ్చింది. ఆ పదార్థం ఒకదశ నుంచి మరొక దశలోకి పరిణామం చెందుతూ అనేక ఉన్నత రూపాలు పొందిందని మనకిప్పుడు తెలుసు.
సుదీర్ఘ పరిణామ క్రమంలో నిర్జీవ పదార్ధం నుంచి జీవపదార్థం క్రమంగా ఆవిర్భవించింది. దీనికి అనేక ఆధారాలున్నాయి. కోటానుకోట్ల సంవత్సరాల క్రిందట ఏకకణ జీవి ఏర్పడింది.ఈ జీవరాశి కూడా ఉన్నతోన్నత దశలను దాటుకుంటూ మానవునిగా అవతరించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే జీవం, పదార్థం నుంచి ఏర్పడిన నిర్దిష్టరూపం.
పరిణామ క్రమంలో మెల్లమెల్లగా జంతువులు, పక్షులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే వానరం నుంచి మానవుడు వచ్చాడని ఆధారాలతో సహా డార్విన్ నిరూపించాడు. జ్ఞానం పెరిగిన దశలో మనిషి సంతరించుకున్న విజ్ఞానమిది.
మానవుని మెదడు భౌతిక పదార్థం పొందిన అత్యున్నత రూపం. మెదడే మన చైతన్యానికి, ఆలోచనలకు, మానసిక ఆందోళనలకు, దౌర్బల్యాలకు కారణమైన పదార్థం. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం మెదడు. ప్రపంచంలో కనిపించే విషయాలను గురించి మన మెదడు ఆలోచిస్తుంది. అది అద్దంలా ప్రతిబింబిస్తుంది. మెదడులో ఏర్పడిన భావాలను లేదా ఆలోచనలను మనస్సు అంటాం.ఈ మనస్సుకు ఆధారమైన మెదడు, మనిషి ప్రకృతి లో తన్ను తాను రక్షించుకోవడానికి సంఘర్షణ పడుతున్న క్రమంలో, అభివృద్ధి చెందింది. అతని ఆలోచనలు అభివృద్ధి చెందుతూ జంతుప్రపంచం నుంచి వేరు పడినాడు.
ప్రకృతి లో జరిగే ప్రతి చిన్న సంఘటనకు ఏదో ఇతర శక్తి కారణమని భావించాడు. వాన పడినా, ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా, అడవి కాలి పోయినా, మనిషి ఏదో రోగాన బడి మరణించినా ఇలా ఏమి జరిగినా ఎవరో ఒకరు చేయిస్తున్నారన్న నమ్మకాలు మెల్ల మెల్లగా పెరిగాయి. అజ్ఞాన దశలో అన్ని సమాజాలలో అన్ని ప్రాంతాల్లో ఇవి పెరిగాయి.వానకు వానదేవుడు, గాలికి గాలి దేవుడు, అగ్నికి అగ్ని దేవుడు ఇలా ఒక్కో దానికి ఒక్కో దేవుడు కారణమని భావించాడు. ఆదిమ సమాజంలో వీళ్లే దేవుళ్ళు. మానవ పరిణామ క్రమంలో మనిషి మెదడు కూడా పరిణామం చెంది మనసు వికసించింది. విజ్ఞానం కూడా అభివృద్ధి చెందింది.దాంతో పాత దేవుళ్ళ పై నమ్మకాలు తగ్గిపోయి కొత్త దేవుళ్ళ ను రూపొందించుకుంటూ వచ్చారు.ఈ దేవుళ్లతో మతాలు రూపొందాయి. అంతకుముందు మతాలు లేవు. మతానికి, దేవునికి పాలకులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒక దశలో రాజే దేవుడినని చెప్పుకున్నాడు. జనాలకు తెలివి పెరిగిన తర్వాత మతాన్ని ఉపయోగించుకొని యజ్ఞాలు యాగాలు కర్మకాండలు మొదలైన క్రతువులను తానే చేయిస్తూ మతవిశ్వాసాలను ప్రజల్లో పెంపొందించి జనాలు తనను ప్రశ్నించకుండా చేసుకున్నాడు. మన దేశంలో ఇటీవల కాలంలో రామున్ని రాజకీయాల్లోకి దించి
అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశారు. అలా ప్రజల్లో ఉన్న విశ్వాసాలను మరింతగా పెంచి పోషిస్తున్న పరిస్థితి కూడా నేడు ఉంది.అందుకే వేమన మతాల మాయలో పడి ప్రజలు పడే బాధల ను ఏనాడో ఇలా వర్ణించాడు.
విజ్ఞాన శాస్త్రం ( సైన్సు) అభివృద్ధి చెందని పరిస్థితి లో, ఏ విషయాన్నైతే పూర్తిగా సైన్సు పరంగా అర్థం చేసుకోలేకపోయామో అక్కడ అజ్ఞానం రాజ్యమేలింది. మతం జోక్యం చేసుకుని తన వేయిపడగలను విప్పింది. మళ్లీ సైన్సు అభివృద్ధి చెంది ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ పోయింది.
ఏ దేవుడు గొప్ప అనే స్థాయిలో యుద్ధాలు చేసుకున్నారు ఒకప్పుడు. మన దేశంలో శైవమతస్తులు, వైష్ణవమతస్థులుపోట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ దేశంలో క్రైస్తవులకు యూదులకు మధ్య ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏదో ఒక అతీతశక్తి నడిపిస్తోందనే భావించేవారు చాలా మంది అన్ని చోట్లా ఉన్నారు. ఆ శక్తిని భగవంతుడన్నారు. దీంతోపాటు అనేక ఇతర భావాలు కూడా మన దేశంలో ప్రచారంలో ఉన్నాయి.
ప్రపంచం మిథ్య. ఈ ప్రపంచాన్ని మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేం. అంతా భ్రమ. కైవల్యమే సత్యం. నిత్యం. దాన్ని పొందాలంటే మోక్షమే శరణ్యం. మోక్షమంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం. బ్రహ్మ జ్ఞానమంటే ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవడమే.ఇదీ భారతదేశంలో ప్రబలిన జ్ఞానం. ఇది అంతకు ముందు మీమాంసకారులకు,సాంఖ్యులకు ఉన్న కనీస ప్రాపంచిక దృక్పథానికన్నా భిన్నమైనది. ప్రతి విషయాన్ని పూర్వపక్షం చేసి అది వాస్తవమో కాదో తేల్చుకునే వారు మీమాంసకులు. వాస్తవికంగా కనిపించే ఈ ప్రపంచాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని చర్చించే వారు సాంఖ్యులు. కానీ ఈ ప్రపంచం భ్రమ అని చెప్పే మిథ్యా వాదం మన సమాజ పురోగతి కి అడ్డుకట్టవేసింది.
అంతేగాక కర్మసిద్ధాతం, స్వర్గం-నరకం, పాపం-పుణ్యం, తలరాత, అదృష్టం దురదృష్టం, పునర్జన్మ సభ, చేతబడి, పూనకాలు, ముహూర్తాలు, శకునాలు, జాతకాలు, స్త్రీలు పురుషులకన్నా అధములు మొదలైన విశ్వాసాలు మనదేశ వైజ్ఞానిక ప్రగతికి ఆటంకం పరిచింది. ఇప్పుడు కూడా అదే ఆటంకమై ఉంది.
కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మలో పుణ్యకర్మలు చేస్తే వచ్చే జన్మలో సుఖం, పాపకర్మలు చేస్తే దుఃఖం ఉంటాయని చెపుతుంది. మానవుడు పూర్వజన్మలో చేసిన పాప పుణ్య కర్మలను బట్టి ఈ జన్మలో ఫలితాన్ని అనుభవిస్తాడు. దీనర్థమేమిటి? మానవుని బాధిస్తున్న రోగాలు, పేదరికం, వంటి వాటిని మనం ఏమాత్రం మార్చలేమని భావించడమే.
పదైదవ శతాబ్దంలో యూరపు దేశాల్లో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనంతో అనేక ఆవిష్కరణ లు జరిగాయి. పాత సంప్రదాయభావాలను, మూఢనమ్మకాలను ఒక్కొక్క దానిని తుంచుకుంటూ సైన్సు పురోగమించింది.అప్పటి వరకు కేవలం ప్రతిపాదన దశలో ఉన్న వాటిని ప్రశ్నించారు. ప్రశ్నంటేనే సైన్సు.తరువాత వాటి సత్యాలను నిగ్గు తేల్చారు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రంను మనం సైన్సు అంటున్నాం.సైన్సు నిరూపించిన సత్యాలు ఎవ్వరైనా నిరూపించవచ్చు.గతంలో అలా కాదు. ఫలానా వ్యక్తి చెప్తే దాన్ని యథాతథంగా స్వీకరించే వారు. దాని నిరూపణకు ఎలాంటి పరికరాలు లేవు.దాన్ని వాస్తవమని నమ్మేవారు.గ్రీసుదేశంలో అరిస్టాటిల్ అనేక శాస్త్రీయ విషయాలను ప్రతిపాదించాడు.మనదేశంలో అసిత కేశ కంబరుడు, కణాదుడు మొదలైన వారు కూడా పదార్థ సృష్టి గురించి ప్రతిపాదించారు. కానీ అవేవీ నిరూపించలేదు.అయితే సైన్సు ఈ సమస్యను పరిష్కరించింది. ఏదైనా ఒక ప్రశ్న వస్తే ఆ విషయాన్ని ప్రతిపాదనగా తీసుకుని వివిధ కోణాల్లో రకరకాలుగా పరిశీలించారు. తరువాత ప్రయోగాలు చేశారు.దాన్ని తిరిగి పలుమార్లు పలువురు అదే ప్రయోగం చేశారు. అప్పుడు వచ్చిన ఫలితాన్ని నిర్థారణగా స్వీకరించారు. వచ్చిన ఫలితం అంతకుముందే నిర్ధారించిన వాటితో సరితూలకపోయినా మళ్లీ ప్రయోగాలు చేశారు. అయితే వచ్చిన ఫలితం కొత్త విషయాన్ని తెలియజేసి పాతది తప్పని తేలితే పాత ప్రతిపాదనను ఏ ములాజా లేకుండా పక్కనపెట్టి కొత్త దానినే స్వీకరించారు. అంతే తప్ప ఏదో మత గ్రంథంలో చెప్పినారని, పాతదే గొప్పదని,ఫలానా గొప్ప వ్యక్తి చెప్పినాడు కాబట్టి అదే వాస్తవమని భావించరు. ఇలా చేయడాన్ని శాస్త్రీయ పరిశోధన,శాస్త్రీయ పరిశీలన అన్నారు. సగానికి పైగా ప్రతి పాత విషయాన్ని ఖండించడంతోనే శాస్త్రీయ ఆవిష్కరణలు మొదలవుతాయి.
శాస్త్రీయ పరిశోధన ద్వారా నిగ్గు తేల్చిన సత్యం ఆధారంగా మన జీవితం గడపడాన్ని, ఆలోచించడాన్ని శాస్త్రీయ ఆలోచనా విధానం లేదా శాస్త్రీయ దృక్పథం అన్నారు. వాస్తవానికి ''శాస్త్రీయ దృక్పథం'' (సైంటిఫిక్ టెంపర్) అన్న పదాన్ని మొట్టమొదట నెహ్రూ 1946లో ప్రచురితమైన ''డిస్కవరీ ఆఫ్ ఇండియా'' పుస్తకంలో ప్రస్తావించారు.
ఒక వస్తువును సృష్టించలేం, నాశనం చేయలేం. ఆ వస్తువును ఇంకో రూపంలోకి మార్చగలమే గాని దాన్ని పూర్తిగా నాశనం చేయలేమని శాస్త్రీయంగా నిరూపితమైంది. దీన్నే పదార్థ నిత్యత్వ సూత్రం అన్నారు. ఈ సూత్రం ఆధారంగానే ఐనిస్టీన్ e=mc^2అనే ఫార్ములా ను కనుగొన్నాడు. అలాగే రెండు పదార్థాల ద్రవ్యరాశుల మొత్తం అవి రెండూ కలిసిన తరువాత ఏర్పడే పదార్థాల ద్రవ్యరాశుల మొత్తానికి సమానమని అనేక పరిశోధనల్లో తేలింది. అందువల్లనే తమిళనాడులో రామర్ అనే వ్యక్తి మొక్కల ఆకుల రసంతో పెట్రోలు తయారుచేయడం అబద్దమని ఈ సూత్రం ఆధారంగానే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ కొంతమంది బాబాలు స్వాములు ఉంగరాలు బంగారు సృష్టించగలరని వారికి మహిమలు ఉన్నాయని నమ్మితే దాన్ని మూఢనమ్మకం అంటారు. ప్రార్థనల వల్ల రోగాలు పోతాయని క్రైస్తవ కూటములు పెట్టిన ప్రచారం చేస్తుంటారు.ఇలా రోగాలు నయమైతే, మరి కరోనాను ఎందుకు ఆపలేక పోయారని అందరూ అడుగుతున్నారు.ఇన్ని వైద్యశాలలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
శాస్త్రీయ దృక్పధం స్థానంలో మన సమాజంలో రెండు భావాలు రాజ్యమేలుతున్నాయి. శాస్త్రం శాస్త్రమే. నమ్మకాలు నమ్మకాలే అన్న వైఖరి సమాజం లో ఉంది. ఇది అశాస్త్రీయమైనది.
శాస్త్రం మానవ కృషికి, వాస్తవికతకు సంబంధించింది. నమ్మకం వాస్తవానికి అతీతమైంది. కేవలం మనసు భావించే ఆలోచనలకు సంబంధించినది. మనిషి తత్వంలోనే ఈ ద్వైదీ భావం ఉంది.దీన్ని పటాపంచలు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
చేతబడి చేశారని భావించేవారు చాలా మంది ఉన్నారు. నిజంగానే చేతబడి ఉంటే దేశం ప్రధానులను,శత్రువులను చేతబడి ద్వారా చంపేసేవారు కదా!చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయకుండా ఆపేస్తారు. మసూచి,ఆటలమ్మ లాంటి రోగాలకు అమ్మోరు కారణమనుకుని భావించిన రోజులు న్నాయి. వైద్య పరిశోధనలు అభివృద్ధి చెంది వాటికి టీకాలు కనుక్కొని ఆ రోగాలు ఆట కట్టించేశారు.
చేతబడి, బానామతి,అంజనం వేయడం, అంకాళమ్మ, పోలేరమ్మ వళ్లులో పూనడం వంటివన్నీ మూఢనమ్మకాలని,అవి అశాస్త్రీయాలనీ కోవూరు లాంటి వారెంతోమంది నిరూపించారు.
వానలు పడక పోతే రుద్రయాగాలు, యజ్ఞాలు, చేసి కోట్లాది సంపద బూడిద పాలు చేస్తుంటారు. ఒక్కోసారి పాలకులు కూడా వీటిని జరిపిస్తుంటారు. యజ్ఞాలతో వర్షం యాగాలు చేయనందువల్లనే, తాగడానికి గుక్కెడు మంచినీరు గూడా లేక కోట్లాది ప్రజలు దప్పికతో అల్లాడిపోతున్నారా? యాగాలు చేయని రష్యా - అమెరికాల్లో వానలు కురిసి పంటలు పుష్కలంగా పడుతూనేవున్నాయి.కొంతమంది గ్రహణం రోజు భోజనం చెయ్యరు. అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.ఇలాంటి మూఢ విశ్వాసాలు సమాజం ప్రగతికి ఆటంకంగా నిలుస్తున్నాయి.
వేదాలలోనే అన్నీ ఉన్నాయష అని లుబ్దావధాన్లు కన్యాశుల్కం నాటకం లో అంటాడు.అలా అనేవారు నేడు కూడా చాలా మంది ఉన్నారు. వేదాలలో అన్నీ ఉంటే కరోనా రాకుండా నిరోధించవచ్చు కదా.కొత్త ఆవిష్కరణ లు చేసి చూపించవచ్చు కదా! అలా చేయరు కానీ వేదాలగురించి డంబాలు పలుకుతుంటారు. దీనిని వేమన ఏనాడో ఖండించి వేదాల బండారం బయట పెట్టాడీపద్యంలో.
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమలు పెట్టి తేట పడగ నీవు
గుప్త విద్య యొకటె కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమ.
చిన్నాచితకా మూఢ నమ్మకాలకు తోడు సమాజ నడకపైనా, తాత్వికతపైన గాఢంగా ప్రభావం చూపే మౌలిక విశ్వాసాలు కొన్ని ఉన్నాయి. ఇవి సమాజంలోని వ్యక్తులందరి నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంటాయి. కొన్ని ఛాందసవాద నమ్మకాలు హానికరంగా కూడా మారాయి. వీటిల్లో సౌర వ్యవస్థలోని గ్రహాలు, వ్యక్తుల జీవితాల్లోని సంఘటల్నే కాక జాతీయస్థాయి సంఘటనలను కూడా నియంత్రిస్తాయన్న నమ్మకం ఉంది. జాతకం వ్యక్తుల భవిష్యత్తును తెలియజేస్తుందనేది సర్వసాధారణ నమ్మకం. సంఖ్యాశాస్త్రం జీవితాన్ని మలుపులు తిప్పుతుందని భావించడం మరో నమ్మకం. ఇలాంటి నమ్మకాలపై ఆధారపడి జీవితం సాగించేవారు ఆత్మస్థైర్యం లేకుండా జీవిస్తుంటారు. హిందూ వివాహ వ్యవస్థలో ఇలాంటి నమ్మకాలెన్నో! జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించే ఆడపిల్లల వివాహాలు బహుకష్టంగా మారిపోతాయి. కుజదోషం ఉన్న వారిపాట్లు చెప్పనలవికాదు.ఈ సందర్భంలో వేమన చెప్పిన క్రింది పద్యం గుర్తుకు రాకమానదు.
"విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి
సతిపతులను కూర్చి సమ్మతమున
మును ముహూర్తముంచ ముండెట్లు మోసెరా
|| విశ్వ!! " వాస్తవానికి సౌరవ్యవస్థ మనపై ఎలాంటి ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు తేల్చినా ఇప్పటికీ సమాజంలో వాటిని నమ్మేవారు చాలామంది ఉన్నారు.
మనిషి పేదవాడుగా ఉన్నడానికి కారణం అతను పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్లనేనని చెబుతారు. ఒక మనిషి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల సంపన్నుల ఇంట్లో పుట్టాడని చెబుతారు. పేద ధనిక వారి పాప పుణ్యాల ప్రతిఫలం అని చెప్పడం పేదలు తిరగబడకుండా చేయడానికి ఇలా ప్రచారం చేస్తున్నారు.
రుతుక్రమంలో ఉన్న స్త్రీలను అపవిత్రంగా పరిగణిస్తారు మనదేశంలో.ఇది అనేక ఇతర మూఢ విశ్వాసాలకు దారితీసింది. ఆ సమయంలో వంటగది, దేవాలయాలు, మసీదులు మరియు ఇతర మత ప్రదేశాల లోపల మహిళలను అనుమతించడం లేదు. గృహ విధులు నిర్వర్తించడానికి వారికి అనుమతి లేదు. కారణం, ఆ సమయంలో మహిళలు చాలా రక్తస్రావం కారణంగా బలహీనంగా ఉంటారు. కాబట్టి, వారికి పూర్తి విశ్రాంతి అవసరమే.కానీ అదొక ప్రకృతి సహజ పరిణామం.కానీ అపవిత్రం గా చూడటం దేవాలయాల్లో కి అనుమతించక పోవడం ఒక మూఢ విశ్వాసం.నేడు రుతుస్రావం జరుగుతున్నా స్త్రీలు ప్యాడ్స్ వాడి తమ తమ పనులను సునాయాసంగా చేయగలుగుతున్నారు.అలాగే అయ్యప్ప గుడిలోకి మహిళల ప్రవేశాన్ని సుప్రీంకోర్టు అనుమతించినా కొంతమంది చాంధసులు అడ్డుకోవడం కూడా ఇలాంటి మూఢనమ్మకాల వల్లనే.
జీవితంలో పరిస్థితులన్నీ సమస్యలతో నిండి వుండడం వల్ల, ఏ దేవుడి వల్లనో మేలు జరుగుతుందని ప్రజలు దేవుళ్ళని నమ్ముతూ వుంటారు. పైగా కథలూ, పాటలూ, కళలు, సంస్కృతీ అంతా మూఢనమ్మకాల్ని పెంచేవిగానే వున్నాయి. ఇలాంటి సమాజంలో మూఢ నమ్మకాలు పుస్తకాలతో, ఉపన్యాసాల తో పోవు.
అయితే ప్రతి వ్యక్తి స్వానుభవం లో తన నమ్మకాలు ఎంత తప్పో అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ భావాలను పెంచే రచనలు చాలా వరకు దోహదం చేస్తాయి.ప్రజలు ఏ పరిస్థితుల వల్ల మూఢ నమ్మకాల్లో పడివున్నారో ఆ దుర్భర పరిస్థితులు మారితే ఆ నమ్మకాలు కూడా పటాపంచలవుతాయి. ఆ దుర్భర పరిస్థితులను మార్చడానికి సామాజిక చైతన్యం కలిగినవారు వివిధ మార్గాల ద్వారా పూనుకోవాలి.
మానవ సమాజం శైశవప్రాయంలో ఉన్నప్పుడు మనుషుల ఆచారాలు, మతక్రతువుల్లో సైన్సు అంతర్లీనంగా దాగి ఉండేది. ఆ తర్వాత ప్రకృతి శాస్త్ర ప్రభావం వల్ల, దాని రూపంలో అది నిర్ధిష్టంగా ఏర్పడింది. మానవ నైపుణ్యం, సైన్సు, తాత్విక చింతనల మధ్య నిరం తరం అవినాభావ సంబంధం ఉంటూవచ్చింది.
ఒకరకంగా చెప్పాలంటే సైన్సు క్రమబద్దం చేయబడిన నైపుణ్యం. మరోరకంగా అది హేతుబద్దం గావించబడిన పురాణం. ఎందుకంటే సైన్సు ఆదిమానవుని చేతివృత్తులు, మతాచారుల మంత్రపఠనాలలో నిగూఢమైన అంశం నుండి ప్రారంభమయింది. మానవుని జీవనయాత్రలో స్థిరపడుతూ, మారుతూ వచ్చిన కార్యకలాపాలు, సమాజం అవిచ్ఛిన్నంగా సాగడా నికి దోహదపడిన భావాలూ, ఆచారాలు సామాజంలో ఏర్పడిన వివిధ వర్గాల హక్కులు వాటి మధ్యలో సైన్సు అభివృద్ధి చెందుతూ వచ్చింది.'' అని శాస్త్రవిజ్ఞాన పరిణామాన్ని శాస్త్రవేత్త, రచయిత జె.డి.బెర్నాల్ తన చరిత్రలో సైన్సు గ్రంథంలో వివరించాడు.
ఆదిమ సమాజంలో సమాజం వివిధ వర్గాలుగా ఏర్పడి శ్రమ విభజన చేసుకుని జీవిస్తున్న దశలో శ్రమ చేయకుండా శ్రమజీవులపై ఆధారపడి జీవించే ఒక వర్గం తయారయింది. ఆ వర్గం సమాజంలో ఉన్న విశ్వాసాలను ఆధారం చేసుకుని వానిని ప్రచారం చేస్తూ తమ పట్టును నిలుపుకుంటున్నాయి. అంతేగాక వీటికి మీడియా కూడా తోడైంది. అందువల్లనే అవి సజీవంగా ఉంటూ అదే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది.
తెలుగునాట భక్తిరసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీములేక
డేంజరుగా మారుతోంది
అని గజ్జెల మల్లారెడ్డి ఏనాడో కవిత్వం చెప్పారు.
ఆదిమానవుడు ప్రకృతి శక్తుల గురించి తెలీనప్పుడు వాటిపట్ల ఎంత ఆరాధనా భావంతో నిలబడ్డాడో నేటి సమాజంలో సంపదను నడిపించే అదృశ్యశక్తి ముందు మనిషి అంతే భావంతో నిలబడ్డాడు. తాను సృష్టించుకున్న కాగితం ముక్క (రూపాయి) నేటి సమాజాన్ని నడుపుతోంది. శాసిస్తోంది. తిండి, ఇల్లు, గుడ్డ, వినోదం అన్నిటినీ ఇస్తోంది. దాని గమనం అదృశ్య శక్తులతో నడుస్తోంది. ఇదంతా మనిషిలో ఒక రకమైన మార్మికతను పెంచి పోషిస్తోంది. అందునా ఆర్థిక సంక్షోభ కాలాల్లో అయితే తమ చేతుల్లో లేని అదృశ్య శక్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయి. మొత్తం మీద ఆధునిక జీవనంలో మనిషి అంతులేని ఏవో తెలియని శక్తుల అగాథంలో కూరుకుపోతున్నాడు.
శాస్త్రవేత్తల కృషి వల్ల ప్రకృతి శక్తులపై అదుపు సాధించిన మానవుడు సమూహం లో ఒంటరి వాడై సామాజిక శక్తులమీద అదుపు సాధించలేక పోతున్నాడు. ఆర్థిక శక్తులే సమాజాన్ని, రాజకీయాలను అన్నిటినీ నడుపుతాయి. అవి అతన్ని ఎంతగా భయ పెడతాయంటే ఆదిమానవుడు ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకోడానికి చెట్టూ పుట్టా ముందు మోకరిల్లినట్లు ఆధునిక మానవుడు ఆర్థిక పరమైన శక్తిని ప్రసన్నం చేసుకోడానికి దేవుళ్లూ, దెయ్యాలు, బాబాలు, స్వాములు అందరినీ మొక్కుతున్నాడు.
ఇవన్నీ సమాజ ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచాయి. అందువల్ల ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే సామాజిక ఆర్థిక సమస్యలకు సంబంధించిన శాస్త్రీయ భావాలను సమాజంలో పెంపొందించాలి. అభ్యుదయ భావాలు గలవారు, సామాజిక చైతన్య వంతులు ఈ పనికి పూనుకోవాలి.
(Swetchalochana, Feb,2022)
Comments
Post a Comment