ఆధునిక భౌతిక శాస్త్ర దిక్సూచి ఐన్‌స్టీన్
"ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు”గా పిలుస్తున్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ లో జన్మించారు. ఆయన ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి యూరప్ దేశాలలో విద్యా భ్యాసాన్ని కొనసాగించారు.1914లో తిరిగి జర్మనీ వచ్చి 1933 వరకు వున్నారు. యూదులపై అడాల్ఫ్ హిట్లర్ అనుసరించిన క్రూరమైన విధానాలవల్ల ఐన్‌స్టీన్ అమెరికా వలస వెళ్ళారు. ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రంలో కాంతిపై పలు ప్రయోగాలు చేశారు. ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం భౌతికశాస్త్ర స్వరూపాన్నే మార్చి వేసింది. ఆయన ఆవిష్కరించిన ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు కూడా భౌతిక శాస్త్రానికి కొత్తదారి చూపించింది. ఐన్‌స్టీన్ బాల్యంలో దైవాన్ని ఎక్కువగా నమ్మేవారు. ఆయనకు సంగీతంలో కూడా పరిచయం వుంది. మార్క్స్ టాల్‌మాడ్ అనే వ్యక్తి ప్రభావంతో ఐన్‌స్టీన్ శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవడం ప్రారంభించారు. భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోస్‌తో కలిసి ఐన్‌స్టీన్ పలు పరిశోధనలు చేశారు. 1920లో బోస్ పదార్ధం 5వ స్థితిపై కొన్ని పరిశోధనలు చేశారు. పదార్ధం సాధారణంగా ఘన, ద్రవ, వాయు రూపాలలో వుంటుంది, నాలుగో రూపమైన ప్లాస్మా పై కూడా కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
బోస్ తాను పరిశోధించిన విషయాలపై కొన్ని పత్రాలను సమర్పించారు. వీటిని ఐన్‌స్టీన్ పరిశీలించి బోస్‌తో పరిశోధన చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు.వీరిద్దరూ కలిసి కాంతి స్వభావాన్ని వివరించే బోస్ స్టాటిస్టిక్స్‌ను ప్రతిపాదించారు. ఈ శాస్త్రాన్ని అనుసరించే ప్రాథమిక కణాలకు “బోసాన్స్” అని పేరు పెట్టారు. బోస్ పరిశోధన ఆధారంగా చేసుకొని ఐన్‌స్టీన్ పదార్ధం కొత్త స్థితి అయిన “బోస్ ఐన్‌స్టీన్ స్థితి” ని ప్రతిపాదించాడు. ఐన్‌స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలెటివిటీ, జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీ, రెవల్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ వంటి సుప్రసిద్ధ గ్రంథాలు రచించారు. వీటితో పాటు 1933 లో “వై వార్?” అనే మరో గ్రంథాన్ని రచించి యుద్ధం వల్ల జరిగే నష్టాలను ప్రపంచానికి తెలియచేశారు. మనిషికి మరొక జన్మంటూ ఉండదని స్పష్టం చేశారు. సైన్స్ ప్రచారం ద్వారానే మూఢ నమ్మకాలను నియంత్రించవచ్చని వివరించాడు. మతం నైతిక విలువలను బోధించడానికి పరిమితం అవ్వాలని సూచించారు. ఐన్‌స్టీన్ చేసిన పరిశోధనలకు 1921 లో భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది. ఐన్‌స్టీన్‌కు మహాత్మాగాంధీ, రవీంద్రనాధ్‌ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూవంటి భారతీయ ప్రముఖులతో కూడా మంచి పరిచయాలు వున్నాయి. మరో శాస్త్రవేత్త వీజ్‌మెన్‌తో కలిసి జెరూసలెంలో హిబ్రూ యూనివర్శిటీని స్థాపించారు. ఆధునిక కాలంలో గొప్ప మేధావిగా ఐన్‌స్టీన్ పేరు పొందారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్‌పై అణుబాంబులు ప్రయోగించడానికి సిద్ధమవుతున్న తరుణంలో అణుబాంబులు అనేవి మానవ వినాశనాని కి దారితీస్తాయని, వాటిని వినియోగించ వద్దని అమెరికాకు సూచించారు. జాతి వివక్ష అనేది ఆంగ్లేయులు వ్యాప్తి చేసిన ఒక అంటువ్యాధి అని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వరహస్యాలను వివరించడం లో సైన్స్ ఎక్కడైతే విఫలమవుతుందో అక్కడ మతం తన ఉనికిని చాటుకుంటుంది అని ఐన్‌స్టీన్ తెలియచేశారు. ఐన్‌స్టీన్ 1955 లో ఏప్రిల్ 18న మరణించారు.
- యం.రాంప్రదీప్,తిరువూరు
జనవిజ్ఞాన వేదిక
9492712836
Comments
Post a Comment