చప్పట్లు కొట్టి వైరస్ ను చంపెయ్యమని పిలుపు నిచ్చే నేతలు ఉన్న దేశంలో క్షుద్ర హత్యలు కాకవైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? నరబలులు కాక నోబెల్ ప్రైజ్ లు దక్కుతాయా?
కరోనా వైరస్ ను చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి,పళ్ళాలు మోగించి చంపెయ్యమని ప్రజలకు పిలుపునిచ్చిన నేతలు ఉన్న దేశంలో, అంతరిక్షంలోకి పంపే రాకెట్ నమూనాను తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి పూజ చేసి కానీ ప్రయోగించలేని ఇస్రో సైంటిస్టున్న దేశంలో,రోడ్డు మీద పసుపు అంటిన నిమ్మకాయనో, మిరపకాయనో చూసి జడుసుకొని చెమటలు పట్టే ప్రొఫెసర్స్ ఉన్న దేశంలో,భూమ్మీద
పుట్టిన పిల్లలకి ఆకాశంలో నక్షత్రాలు చూసి పేర్లు పెట్టే
డాక్టర్లున్న దేశంలో, పేరులో స్పెల్లింగ్ మారిస్తే సినిమా హిట్ అయిపోద్ది అని నమ్మే యాక్టర్లున్న దేశంలో... 'క్షుద్ర హత్యలు' కాక వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? 'నరబలులు' కాక నోబెల్ ప్రైజులు దక్కుతాయా?
“ప్రస్తుత సమాజంలో దిగ్ర్భాంతి కల్గించే వైరుధ్యాలు కనిపిస్తాయి. అత్యాధునిక జీవన శైలితో బ్రతుకుతున్న ఈ తరం మానసికంగా ఆటవిక దశలో ఉందనే సత్యాన్ని మనం గుర్తించాలి” అని కొడవటిగంటి రోహిణి ప్రసాద్ అనే శాస్త్రవేత్త అన్నట్లు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమిస్తూనే రాతియుగ
భావాలతో మన ప్రగతి పయనిస్తుందన్న కఠోర సత్యాన్ని ఒప్పుకొని తీరాలి. సైన్సును కేవలం పరీక్షల్లో రాసే జవాబులుగా భట్టి పట్టి మార్కులు, ర్యాంకులు సాధించి,ఆపై ఉద్యోగాలు పొందే సబ్జెక్టుగానే భావించడం వలన,శాస్త్రీయ చింతన, విచక్షణ, వివేకాలు లేకుండానే మన జీవితాలు సాగిపోతున్నాయనే నిష్ఠూరాన్ని మనం అంగీకరించాల్సిందే! వీటికి ఉదాహరణే మదనపల్లిలోని ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు 'పునర్జన్మ'ల మీద నమ్మకంతో కన్నకూతుళ్లనే కడతేర్చిన ఘటన.
ఉన్నత చదువులు చదివిన ఆ తల్లిదండ్రులు స్వయంగా హత్య చేసి, తమ పిల్లలు తిరిగి వస్తారనే భ్రమలోనే ఇంకా ఉన్నారు. తల్లి పద్మజ గణితంలో గోల్డ్ మెడలిస్ట్, ఒక విద్యా సంస్థకి కరస్పాండెంట్. తండ్రి పురుషోత్తంనాయుడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్. పెద్దమ్మాయి అలేఖ్య(27) మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గా పనిచేసి రాజీనామా చేసి, ఇంటి దగ్గరే సివిల్స్ కు
సన్నద్ధమౌతోంది. చిన్నమ్మాయి సాయిదివ్య (22) ఎంబిఏ పూర్తి చేసి చెన్నైలో ఏఆర్ ఇనిస్టిట్యూట్ లో సంగీత శిక్షణ పొందుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మరణించిన ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల పునర్జన్మల విశ్వాసంతో ఏకీభవించి హత్యకు గురయ్యారు. గొప్ప విద్యావంతులుగా సమాజ హోదా కల్గిన ఆ కుటుంబం
మితిమీరిన మూఢవిశ్వాసాలు, మంత్రతంత్రాల మీద
నమ్మకాలకు బలైపోయిన ఉదంతం ఇది. ఇవేగాక శివుడు కలలో కనిపించి నేత్రదానం చెయ్యమన్నాడని కళ్ళు పెరుక్కునేవారు, మరణించిన కుటుంబ సభ్యుల్ని ఏసు తిరిగి బతికిస్తాడని మృతదేహం పక్కన కూర్చొని ప్రార్థనలు చేసేవారు, దేవుడు పిలుస్తున్నాడంటూ కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకునేవారు, స్వాములు, బాబాల మాటలు నమ్మి కన్న
బిడ్డలని నరబలి యిచ్చేవారు.... దేశవ్యాప్తంగా జరిగే ఈ తరహా ఘటనలలో అనేకమంది బలైపోతున్నారు.
అశాస్త్రీయత నిండిన మన చదువులతో
డిగ్రీ పట్టాలు,అరకొర ఉద్యోగాలు వస్తాయే తప్ప జ్ఞానం, వివేకం, విచక్షణ వస్తాయనుకుంటే, దీనికి మించిన మూఢనమ్మకం మరోటి లేదు.ఈ ప్రపంచం మొత్తం రసాయనిక సమ్మేళనాల మిశ్రమం అనే
ప్రాథమిక సూత్రాన్ని కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన పురుషోత్తంనాయుడు మరిచిపోయాడంటే మన విద్యావిధానం ఎంత యాంత్రికతతో కూడుకున్నదో అర్థమౌతుంది. గణితంలో గోల్డ్ మెడల్ సాధించడానికవసరమైన తెలివితేటలున్న పద్మజ విచక్షణ లేకుండా కన్నబిడ్డని డంబెల్ తో కొట్టి చంపేయడం అనేది మన మధ్య ఇంటిలిజెంట్స్ గా చలామణీ అయ్యే వారంతా వివేకవంతులు కారనే సత్యాన్ని బయటపెట్టింది.అయితే వీరి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, విచక్షణలేని హంతకులుగా మారడానికి కారణం ఎవరు? వీటి మూలాలెక్కడున్నాయి? అజ్ఞానం,మూఢత్వం నలుచెరగులా వ్యాపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పాలకులు కాదా?!
రామాయణంలో పుష్పక విమానం ఎంతమంది
ఎక్కినా మరొకరికి ఖాళీ ఉండేదని, రావణాసురుడు 24 రకాల విమానాలు వాడే వాడని, వాటికి లంకలో విమానాశ్రయాలు కూడా ఉండేవని, భారతంలో వందమంది కౌరవుల జననం వెనుక ఆ కాలానికే మూలకణాల వైద్య సాంకేతికత అమలులో
ఉందనీ, టెస్ట్యూబ్ బేబీ సాంకేతికత మన పురణాలకు
కొత్తకాదని, సీత కూడా టెస్ట్యూబ్ బేబీయేనని, వినాయకుని తల అతికించటం అంటే ప్లాస్టిక్ సర్జరీయేనని, అన్నీ వేదాలలోనే ఉన్నాయనీ..... ఇలా మన ప్రధానమంత్రి నుండి ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల దాకా సూడో సైన్సునే సైన్సుగా ప్రచారం చేస్తున్నారు. ఒక సెక్యులర్ దేశంగా
మత విశ్వాసాలకు, మత సంబంధిత కార్యక్రమాలకు ప్రభుత్వాలు,పాలకవర్గాలు దూరంగా వుండాలని; 51ఎ (హెచ్) అధికరణం ప్రకారం ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశీలనా దృష్టినీ,సంస్కరణా వాదాన్ని పెంపొందించాలని రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించినప్పటికీ, ప్రజలలో మూఢవిశ్వాసాలను పెంచి పోషించేందుకు ప్రభుత్వాలే స్వయంగా పుష్కరాలు, చండీయాగాలు, జాతరలు, కుంభమేళాలు, ఛార్‌ధామ్ యాత్రలూ నిర్వహించి ప్రజల అజ్ఞానానికి కారణమవుతున్నాయి. అజ్ఞానం చీకటి కంటే గాఢమైనది.అందుకే పాలకవర్గాలెప్పుడూ ప్రజలను అజ్ఞానమనే చీకటిలో ఉంచేందుకే ఇష్టపడతారు. మూఢ విశ్వాసాలను పెంచే బాబాలు, స్వామీజీలను ప్రోత్సహిస్తారు. అశాస్త్రీయమైన భావజాలాన్ని ప్రజల మెదళ్ళలో గుప్పిస్తారు.
స్వాతంత్ర్యానంతర కాలం నుండి పాలకవర్గాలు
సామ్రాజ్యవాద, కార్పొరేట్ అనుకూల విధానాలు
అవలంబించటం వలన పేదరికం, ఆకలిచావులు, నిరుద్యోగం,నిత్యావసర ధరలు, రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.దేశంలోని సంపద పిడికిడు మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవ్వడం వలన ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగి అత్యధిక ప్రజలు దారిద్ర్యరేఖ దిగువన మగ్గిపోతున్నారు.పెరుగుతున్న రాజకీయార్థిక సంక్షోభం ప్రభావంతో ప్రతినిత్యం అభద్రత,అశాంతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజలలో సహజంగా పెల్లుబికే అసంతృప్తి,ఆగ్రహావేశాలు రాజకీయ నిరసనలుగా,
తిరుగుబాట్లుగా మారకుండా ఉండేందుకు
ఇహలోక ఈతిబాధలకు పరలోక పరిష్కారాలు చూపే మతాన్ని పాలకులు ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రజల జీవన సమస్యలకు వాస్తు మారిస్తేనో, రుద్రాక్షలు ధరిస్తేనో, ప్రార్థనలు జరిపిస్తేనో, హజ్ యాత్రలు చేస్తేనో, పాస్టర్ల, లామాల మలమూత్రాలు సేవిస్తేనో స్వస్థత చేకూరుతుందనీ, భద్రత,శాంతిని పొందవచ్చని చెప్పే బాబాలు, పాస్టర్లు, ముల్లాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల సామాజిక సమస్యలే ముడిసరుకుగా,వారి మత విశ్వాసాలు,వెనుకబాటు- తననాన్ని పెట్టుబడిగా, వారి ఆశలు, ఆకాంక్షలే వ్యాపార మార్కెట్టుగా మారుస్తూ భక్తిని ఒక పరిశ్రమగా పాలకవర్గాలు తీర్చిదిద్దుతున్నాయి.
ప్రజలలో అజ్ఞానాన్నీ, మూఢ విశ్వాసాలను,
మత మౌఢ్యాన్ని పెంచే పాలకుల విధానాలను, అభివృద్ధి నిరోధక ఫాసిస్టు శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రజల జీవితాలలో మెరుగుదలకు తోడ్పడే సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచే విధానాల అమలు కోసం, విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ, హేతువాద దృక్పథంతో అందించే శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాల్సిన అవసరం వుంది.నమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచారాలు పేరిట అశాస్త్రీయ
భావాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటూ,
బాణామతి, చేతబడి, చిల్లంగి(బ్లాక్ మేజిక్) పేరుతో దాడులు చేసే వారిని, నరబలులు యివ్వమని ప్రోత్సహించే వారిని,బాబాల ముసుగులో లైంగిక అకృత్యాలకు పాల్పడే వారిని శిక్షించే విధంగా మూఢ నమ్మకాల నిరోధకచట్టం తీసుకువచ్చేందుకు డిమాండ్ చెయ్యాలని విద్యార్థి,యువకులకు, హేతువాదులకు,లౌకికవాదులకు,ప్రజాతంత్రవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
మన ప్రస్తుత విద్యావిధానానికీ, లౌకిక నిజాయితీకి సంబంధం లేదు.దానికి శాస్త్రీయత లేదు,
చారిత్రక దృక్పథం లేదు. గతం నుండి వారసత్వంగా వచ్చిన బూర్జువా తత్త్వము, ప్రగతి నిరోధక భావాలు, చాదస్తాలు, మూఢనమ్మకాలు విద్యావిధానంలో ప్రబలి యున్నవి. మానవజాతి స్పేస్ యుగంలో ప్రవేశించినా,. భారత జాతి వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోలేదు. వైజ్ఞానిక దృక్పథానికి బదులు పునరుద్ధరణవాదం ప్రబలమౌతున్నది. మూఢాచారాలలో లేని లోతులు వెదకి, గూఢార్థాలు కల్పించుకుంటున్నారు.బూజుపట్టిన భావాలకు, జీర్ణించిన వ్యవస్థలకు భారతీయ సంస్కృతి పేరిట పునర్జీవం పోస్తున్నారు. ఈ రివైవలిజమ్ నుండి
ఉద్భవించినవే జాతి, మత, కుల, భాష, ప్రాంతీయ దురభిమానాలు. ఈ కపటతత్వాల నుండి ఛాందసత్వం నుండి మన ప్రజాబాహుళ్యాన్ని విముక్తి చేసి హేతుసమ్మతమైన, శాస్త్రగతమైన దృక్పథం అలవరిచే విద్యావిధానం అనుసరించడం మన దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. విద్యావిధానం జాతి జీవితంలో, ప్రజల అవసరాలతో, ఆశయాలతో, ఐక్యతనొంది, శాస్త్రీయంగా, ప్రజాస్వామికంగా సాంఘిక, ఆర్థిక మార్పులు తేగల పరికరంగా ఉండాలి.
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పూర్తిని పెంచే శాస్త్రీయ విద్యావిధానం కోసం పోరాడుదాం!
జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి
Comments
Post a Comment