మన ప్రాచీనుల విజ్ఞానానికి గర్విద్దాం – వారి అజ్ఞానాన్ని అంగీకరిద్దాం
“రండి! జోగయ్య గారూ! రండి!” లోనికి వస్తున్న మిత్రులు జోగయ్య గారిని సాదరంగా ఆహ్వానించాను.
మిత్రులిద్దరం పిచ్చాపాటీలో పడ్డాము. పిచ్చాపాటీ మధ్యలో జోగయ్య గారు “మన ఆధునిక విజ్ఞానానికి మూలాలు వేదాల్లోనే ఉన్నాయండీ. కానీ మన వాళ్ళు అది గుర్తించక, “అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష” అంటూ ఎగతాళి చేస్తున్నారండీ” అన్నారు.
“వేదాల్లో ఉన్న జ్ఞానం చాలా పరిమితమైనదండీ. వారికి బంగారము, వెండి, రాగి లోహాలను తయారు చేయడాన్ని గూర్చి (ఋగ్వేదం 1-183-1), మేడలు(ఋగ్వేదం 1-121-1), ఓడలు(ఋగ్వేదం 1-46-7) నిర్మించడాన్ని గూర్చి, ఇలాంటి ప్రాథమిక వైజ్ఞానిక అంశాలు తెలుసు. అంతే! వారికి భూమి గుండ్రంగా ఉంటుందని కానీ, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని కానీ తెలియదు. ఉదాహరణకు ఋగ్వేదం 1-160-4 లో ఇలా చెప్పబడింది. “సకల భూతములకు సుఖములు కలిగించు భూమిని,ద్యావాను భగవానుడు సృష్టించినాడు. ఆ రెంటినీ కదలకుండా బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్టుడు”. అలాగే కృష్ణ యజుర్వేదము 1-5-11-18 లో “భూమి దేవతలు నిర్మించిన నౌక. అది మహా జలములపై తేలియాడుచున్నది” అని చెప్పబడింది. ఇదీ మన వైదిక ఋషుల విజ్ఞానం” అన్నాను నేను.
“భలే వారే మీరు అణుబాంబు విస్ఫోటనం యొక్క అంతరార్థాన్ని గూర్చి భగవద్గీతలో 11 వ అధ్యాయంలో 12,32 శ్లోకాలలో చెప్పబడిందండీ. వాటిని గురించి రాబర్ట్ జూలియన్ ఓపెన్ హైమెర్ అనే విదేశీయుడు చెప్పే వరకు మనకు తెలియక పోయింది కదా” అన్నారు జోగయ్య గారు.
“భగవద్గీత 11 వ అధ్యాయం, 12 వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే – భగవానుని విశ్వరూపం ఎలా ఉందంటే, “ఏక కాలంలో ఆకాశంలో వేయి మంది సూర్యులు వెలువడితే కలిగే కాంతి, ఆ మహాత్ముడి విశ్వరూప తేజస్సుకు సాటి కావచ్చు ” అని. అలాగే 32 వ శ్లోకంలో ఏమని చెప్పబడిందంటే “లోక సంహరానికి విజృంభించిన కాల స్వరూపుణ్ణి నేను. ప్రస్తుతం ఈ ప్రపంచం లో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్ధం చేయక పోయినా శత్రుసైన్యం లో వీరులంతా వినాశనం పొందడం ఖాయం”. ఈ శ్లోకాలు అణు విస్ఫోటనం అనే శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వివరిస్తాయా? అణు విస్ఫోటనం సమయంలో వచ్చిన కాంతి లాంటి కాంతి భగవానుడికి ఉందని వివరిస్తే వ్యాస మహామునికి అణు విస్ఫోటన విజ్ఞానం ఉన్నట్లేనా ? మొన్న దీపావళి నాడు మా మనవడు చిచ్చుబుడ్డి కాంతిని చూసి “అబ్బా ! బోలెడంత మంది సూర్యుళ్ళ కాంతి” అన్నాడు; వాడికి కూడా అణు విస్ఫోటన విజ్ఞానం ఉన్నట్లేనా? ” అని అడిగాను.
“ఇంకొక్కటి అడుగుతాను. సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ చెప్పక ముందే మనం నవగ్రహాల మధ్యలో సూర్యుణ్ణి పెట్టి ఆరాధించడం మొదలుపెట్టాం. మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారా? “ అడిగారు జోగయ్య గారు.
“నవగ్రహ ఆరాధన మన దేవాలయ సంస్కృతి అంటే నేను చర్చకు రాను. కాని కోపర్నికస్ కంటే ముందే మన వాళ్ళకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు కేంద్రంగా సూర్యుడున్నాడని ఆ అంశం తెలియజేస్తుందంటే చర్చిస్తాను. ఎందుకంటే నవగ్రహారాధన చేస్తున్న సమయంలోనే ఆనాటి నుండి నేటి వరకు భూమి అన్ని గ్రహాలకు మూలమని చెప్పే జ్యోతిష్యాన్ని అంగీకరిస్తూ, దానికి జ్యోతిష శాస్త్రము అని పిలుస్తున్నారు. అది మన వారిలోని ద్వంద్వ ప్రవృత్తిని తెలియజేస్తోంది“ అని సమాధానమిచ్చాను.
“అది సరేనండి. ‘పైకి వేసిన వస్తువు క్రిందికి పడుతుంది అని క్రీ.శ. 505 లోనే వరాహమిహిరుడు చెప్పాడు గదా? ఆయనను గౌరవించక మీబోటివారు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం చెప్పాడు అని ఆయనను గౌరవిస్తారేమిటి?”
“జోగయ్య గారూ ! ఒక విషయాన్ని సిద్ధాంతం అని ఎప్పుడంటామంటే, ఒక అంశాన్ని పరికల్పన జేసి, దానిని ప్రయోగం ద్వారా నిరూపించినప్పుడే. పరికల్పన మాత్రం చేస్తే అది సిద్ధాంతం అనిపించుకోదు. వరాహమిహిరుడు, బ్రహ్మ గుప్తుడు, భాస్కరాచార్యుడు పరికల్పన చేసారు. కానీ న్యూటన్ దానిని గణితశాస్త్ర సూత్రాలతో నిరూపించాడు. అందువలన న్యూటన్ చెప్పిన దానిని ‘గురుత్వాకర్షణ సిద్ధాంతం’ అంటున్నాము’’ అన్నాను.
“మన ప్రాచీనుల విజ్ఞానాన్ని గూర్చి తెలియక మీరిట్లా మాట్లాడుతున్నారు. గణిత శాస్త్రం లో శూన్యాంశం, వర్గమూలం, ఘనమూలాలను మనవారే కనుగొన్నారు. రస విద్యలో రాగి, సీసం, బంగారం, తుత్తునాగం వంటి వాటిని శుద్ధి చేసే విధానాన్ని కనుగొన్నారు. కాంతి వేగాన్ని గణించగల్గారు. వైద్యవిద్యలో మన పూర్వీకులు 1,50,000 ఔషధ మొక్కల వివరాలు తెలుసుకొన్నారు. గర్భ స్రావమైన గాంధారి పిండాన్ని 101 కుండల్లో ప్రవేశ పెట్టి వ్యాస మహర్షి కౌరవ సంతానోత్పత్తికి ఆద్యుడయ్యాడు. ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం , కృష్ణ బిల సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ ఇలా భారతీయులకు తెలియని అంశం లేదు దీనికేమంటారు? ” అడిగారు జోగయ్య గారు.
“జోగయ్యగారూ! మన ప్రాచీనుల విజ్ఞానానికి గర్విస్తున్నాను. గణిత శాస్త్రంలో, రసవిద్యలో, వైద్యవిద్య లో మన పూర్వీకుల పరిశోధనా ఫలితాలు భారతీయులందరికీ ఎంతో ఆనందాన్నిస్తున్నాయి”. కానీ అత్యద్భుత కల్పనా కథలైన మన పురాణాలలో, ఆ రచయితలు చేసిన గొప్ప కల్పనలను, కల్పనలు గానే అంగీకరిద్దాము. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు, మహాభారత కాలం నాటికి మన వాళ్ళకు గాజుతో టెస్ట్ ట్యూబులు కూడా తయారు చేసే విజ్ఞానం లేదు. అందువలనే వ్యాసుడు మట్టి కుండలలో పిండ భాగాలను పెట్టాడని ఆయన తెలియజేశారు. గాజు ట్యూబులనే తయారు చేయలేని వారు టెస్ట్ ట్యూబ్ బేబీలను చేశారంటే, నమ్ముతారా? మరో విచిత్రం ఏమిటంటే, ఆధునిక విజ్ఞానం ప్రకారం, ఫలదీకరణం చెందిన పిండాన్ని గర్భంలో ప్రవేశపెడతారు. మహాభారతంలో గర్భ విచ్చిత్తి అయిన పిండాన్ని కుండలలో పెట్టినట్లుగా చెప్పబడింది. అదీ, ఇదీ ఒకే విజ్ఞానమా?
ఇక పుష్పక విమానం సంగతి. భూమి తిరుగుతోందనే వైజ్ఞానిక విషయం కూడా తెలియనివారు గ్రహాంతర యానం ఎలా చేయగలరు? ఇంకా ఇతర విషయాలు కృష్ణబిల సిద్ధాంతం , బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా రూపొందించగలరు? ఇలాంటి మనస్తత్వం అంటే శాస్త్రాన్ని కల్పనలనూ కలగలిపే మనస్తత్వం మనకు కొన్ని వందల ఏళ్ల నుండీ ఉన్నది. ఉదాహరణకు క్రీ.శ. 1017-1030 మధ్య భారతదేశంలో పర్యటించిన అల్-బెరూని ఆనాటి మన శాస్త్రవేత్తల గురించి ఇలా అన్నారు. “భారతీయ శాస్త్రవేత్తలు పూర్తిగా గందరగోళంలో ఉన్నారు. వారి ఆలోచనలో తర్కం ఎంత మాత్రం లేదు. వారి గణితశాస్త్ర, ఖగోళశాస్త్ర విజ్ఞానాన్ని నేను రత్నాలు, గులక రాళ్ళు కలిసిన మిశ్రమంగా మాత్రమే పరిగణించగలను”. మన ప్రస్తుత శాస్త్రవేత్తల మానసిక స్థితి కూడా ఇలానే ఉన్నది” అన్నాను.
“అసలు వేల ఏళ్లనాడే ఆర్జించిన మన విజ్ఞానం ఇలా ఎందుకు మధ్యలో లుప్తమై పోయిందో చెప్పండి” ప్రశ్నించాడు జోగయ్య గారు.
“చెబుతాను. ఉదాహరణకు వైద్యశాస్త్రాన్ని తీసుకుందాం. సుశ్రుతుడు, చరకుడు వైద్య శాస్త్రాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారు. కాని ఆ శాస్త్రాన్ని నిరసించే ప్రక్రియ ఉపనిషత్కాలం లోనే మొదలయింది. తైత్తరీయ సంహితలో “దేవవైద్యులైన అశ్వినులు, వైద్యులుగా, మానవుల మధ్య తిరుగాడుతున్నందున వారు అపవిత్రులు ” అని చెప్పబడింది. మనుస్మృతి కాలం నాటికి భౌతిక శాస్త్రాలపై నిరాదరణ అత్యంత తీవ్రస్థాయికి చేరింది. మనువు చేతివృత్తుల వారు, వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులను నేరస్థులు,దొంగల జాబితాలో చేర్చి, వారిని ఏ మత కర్మలకూ, చివరకు అంత్యక్రియలకు కూడా పిలువరాదని శాసించాడు. ఇక వైద్య శాస్త్రం పతనం కాక ఏమవుతుంది? కాబట్టి జోగయ్య గారు ! మన ప్రాచీనుల విజ్ఞానానికి గర్విద్దాం. వారి అజ్ఞానాన్ని అంగీకరిద్దాం. వారి విజ్ఞాన పతనానికి గల కారణాన్ని అన్వేషిద్దాం. మరల ఉన్నత స్థాయికి రావడానికి సరైన ప్రయత్నాలు చేద్దాం. ఏమంటారు ?” అన్నాను.
జోగయ్య గారు ఆలోచనలో పడ్డారు.
Comments
Post a Comment