డా. అబ్రహాం కోవూరు విసరిన సవాలు
మహిమలను, మంత్రాలను సవాలు చేస్తూ ప్రముఖ హేతువాది డా. అబ్రహాం కోవూరు విసరిన సవాలు తెలుగులో
******************************************
డా|| అబ్రహం టి. కోవూర్ 1963లో విడుదల చేసిన ప్రకటన (ఛాలెంజ్) ఈ విధంగా వుంది.
నేను అబ్రహం టి కోవూర్, తిరువల్ల, పమన్‌కడ వీధి, కొలంబో-6 చిరునామాలో నివసించే వ్యక్తిని ఈ ప్రకటన చేస్తున్నాను. మానవ దేవుళ్లు, సన్యాసులు, యోగులు, సిద్ధులు, అమ్మలు, దేవతలు ఎవరైనా సరే మా వైజ్ఞానిక పరిశీలకులకు సహకరిస్తూ వారి వారి మహిమలు, దైవ శక్తులు, మాయలు, మంత్రాలు, అతీంద్రీయ శక్తులు, మానవాతీత అద్భుతాలు నిరూపించుకుంటే శ్రీలంక కరెన్సీలో వంద వేలు బహుమతిగా ఇస్తాను. ఇందులో మోసాలు, గిమ్మిక్కులు, మభ్యపెట్టడాలు ఉండకూడదు. వాస్తవంగా, నిజాయితీగా చేసి చూపాలి. అది వారి తపస్సు వల్ల లభించిందో, ఆధ్యాత్మిక చైతన్యం వల్ల అబ్బిందో, పుట్టుక తోనే ఉందో ఏమైనా కావొచ్చు. వైజ్ఞానిక పరీక్షలకు లోబడి పరీక్షలో పాల్గొనాల్సి వుంటుం ది. ఈ ఛాలెంజ్ నేను చని పోయే దాకా వుంటుంది. లేదా అతీంద్రియ శక్తులు నిరూపించు కున్న మొదటి వ్యక్తిని ప్రకటించేదాకా వుంటుంది. వారు అభ్యసించిన 'కళలు' కాకుండా, నేను సూచిస్తున్న ఈ కింది 'మహిమలు' చేసి చూపాలి.
1. కవరులో సీలు చేసిన కరెన్సీ నోట్ల నెంబర్లు చెప్పాలి.
2. ఒక కరెన్సీ నోటును సృష్టించాలి.
3. కాళ్లు కదపకుండా మండుతున్న మంట మీద అర నిమిషం నిలబడాలి.
4. శూన్యం లోంచి నేనడిగిన వస్తువును తీసివ్వాలి.
5. సైకో కైనటిక్ శక్తి (మానసిక తీవ్రత)ని ఉపయోగించి ఇచ్చిన ఘన పదార్థాన్ని వంచడం గానీ, రెండుగా విరవడం గానీ చెయ్యాలి.
6. మీ టెలిపతి (మానసిక ఊహాశక్తి)తో ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారో చెప్పాలి.
7. తెగిన చెయ్యినో, కాలునో కనీసం ఒక అంగుళమైనా పెంచగలగాలి. మీరు ప్రార్థన చేస్తారా, భస్మం చల్లుతారా, మంత్ర తంత్ర విద్యలు ఉపయోగిస్తారా లేక విశ్వాసంతో నయం చేయడం వంటి 'ఫెయిత్ హీలింగ్'ను ఉపయోగిస్తారా-ప్రయోగిస్తారా మీ ఇష్టం! ఏ వ్యక్తిదైనా తెగిన అవయవం కనీసం ఒక్క అంగుళం పెరిగేట్లు చెయ్యాలి.
8. మీ యోగ శక్తితో గాలిలో వేలాడి చూపాలి.
9. మీ యోగ బలంతో ఎదుటివాడి హృదయ స్పందనని ఒక అయిదు నిమిషాలు ఆపాలి.
10. మీ యోగ శక్తితో మీరు అరగంట ఊపిరి పీల్చకుండా ఉండాలి.
11. నీటి మీద నడవాలి.
12. శరీరాన్ని ఒక చోట వదిలేసి, మరో చోట ప్రత్యక్షమవ్వాలి.
13. భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనను యథాతథంగా వివరించాలి.
14. మెడిటేషన్ వల్లగానీ, మీ సర్వోత్కృష్టమైన మహిమ వల్లగానీ సృజనాత్మకతను మేల్కొల్పాలి.
15. గత జన్మలోని అనుభవం వల్లగానీ, తిరుగాడే మీ ఆత్మని ఉత్తేజపరిచి గాని మీకు తెలియని ఒక భాష మాట్లాడాలి.
16 ఆత్మను గానీ, దయ్యాన్ని గానీ ఫొటో తీసి చూపాలి.
17 మిమ్మల్ని ఫొటో తీసినప్పుడు ఫొటో నెగటివ్ లోంచి మీరు కనబడకుండా పోవాలి.
18 మీ ఆత్మ శక్తితో, ఆధ్యాత్మిక బలంతో, సాధించిన సిద్ధితో ఎలాగైనా సరే-గదిలో వేసి తాళం పెడితే బయటికి రావాలి.
19. మీలోని దైవత్వ శక్తి ప్రదర్శించి మీరున్న ప్రస్తుత బరువు కన్నా ఎక్కువ బరువు తూగి చూపాలి.
20. దాచేసిన వస్తువుల్ని కనుగొనాలి.
21. నీటిని పెట్రోలు గానో, సారాయి (లిక్కరు)గానో మార్చాలి.
22. సారాయిని రక్తంగా మార్చాలి.
23. పది మంది అర చేతి ముద్రలు ఇస్తాం. వారు పుట్టిన సమయం-వారి దేశ కాలమాన ప్రకారం చెప్పాలి. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా పుట్టిన చోటు సరిగ్గా చెప్పాలి. వారి వారి ప్రధాన జీవన సంఘటనలు చెప్పాలి. దీని కోసం హస్త సాముద్రిక నిపుణుల్ని, జ్యోతిష్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. వారు చెప్పేదంతా 'శాస్త్రం' అని చెప్పుకుంటూ ఉంటారు కదా? అది నిరూపించు కోవాలని కోరుతున్నాను.
నేను ఈ కింది వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు, వారి వారి మహిమలు నిరూపించుకొని, తాము సామాన్యులం కాదని, భగవత్ స్వరూపులమని రుజువు చేసుకోవాలి. దీనివల్ల ప్రపంచ పౌరుల దృష్టిలో వారి విలువ పెరుగుతుంది. వివాదాస్పద అంశాలకు తెర పడుతుంది. సత్యసాయి బాబా, ఆచార్య రజనీశ్, మహర్షి మహేష్ యోగి, హజ్రత్ అలీ, డా|| వడ్లమూడి, యూరి గిల్లర్, జాన్ డిక్సన్, సైబిల్ లీక్ వగైరా వగైరా( ఈ విధంగా డా|| అబ్రహం టి కోవూర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధులైన వారివి ముప్పయి పేర్లు రాశారు. వారెవరూ ఆయన సవాల్‌కు స్పందించలేదు).
డాక్టర్ కోవూర్ శ్రీలంకలో మరణించే వరకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఆ ఛాలెంజ్ ముగిసిపోలేదు. కోవూర్ అనుచరుడు ప్రముఖ హేతువాది బసవ ప్రేమానంద్ (17 ఫిబ్రవరి 1930-4 అక్టోబరు 2009) దాన్ని 1978లోనే కొనసాగించారు. ఆయన కూడా కేరళ కాలికట్ లో కన్ను మూశారు. అయితే ఛాలెంజ్ ఛాలెంజ్ గానే ఇప్పటికీ వుంది. భారతీయ హేతువాద సంఘం దాన్ని కొనసాగిస్తూనే వుంది. శ్రీలంక హేతువాద సంఘానికి చెందిన కార్లో ఫోన్సెక్ ఆ ఛాలెంజ్‌ను పునరుద్ధరించాడు. బహుమతిని ఒక మిలియన్ డాలర్లకు పెంచాడు. ఇది ఇలా వుండగా కెనడా టొరెంటోకు చెందిన మెజీషియన్ జేమ్స్ రాండి, అబ్రహం కోవూర్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ఒక మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించాడు.
అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా హేతువాద, నాస్తిక వాద సంఘాలకు, శాస్త్ర వైజ్ఞానిక రంగాలకూ చెందిన సుమారు ముప్పయి అయిదు సంస్థలు అర మిలియన్ నుండి మిలియన్ డాలర్ల వరకు బహుమతులు ప్రకటించి ఎదురు చూస్తున్నాయి. మానవాతీత మహిమలు, అతీంద్రియ శక్తులూ ఉండి, తాము మానవ రూపంలో వున్న భగవానులమని భావించుకునే, ప్రకటించుకునే 'మహానుభావులు' ఎవరైనా వుంటే, వారికి దమ్మూ, ధైర్యం వుంటే-ఇప్పుడైనా సరే, సవాల్‌ను స్వీకరించి, వైజ్ఞానిక పరిశీలకుల ముందు ఆ విషయాన్ని నిరూపించుకోవాలి! బహుమతి కంటే ముఖ్యం మానవాతీత శక్తి ఏదో ఒకటి వుందని విశ్వ ప్రజలకు తేటతెల్లం చేయడానికైనా ముందుకు రావాలి! అయితే దీనికంతటికీ మొదట 1963 లో డా|| అబ్రహం టి కోవూర్ వేసిన బీజమే కాలక్రమంలో హేతువాద మహావృక్షమైందని మనం అర్థం చేసుకోవాలి!!
అబ్రహం కోవూర్ ఒక హేతువాది, ఒక అధ్యాపకుడు, మూఢ నమ్మకాల కలుపు మొక్కల్ని కూకటి వేళ్లతో పెళ్లగించిన వృక్ష శాస్త్రవేత్త. మానవ దేవుళ్లకు సింహస్వప్నం. దొంగ బాబాల గుండెల్లో పరుగెత్తిన రైలు. దొంగ స్వాముల్ని మట్టి కరిపించిన వస్తాదు. వైజ్ఞానిక స్పృహకు విజయ కేతనం. మత మౌఢ్యం ఖండించే ఖడ్గం. మానవ వాదులకు పెద్ద దిక్కు. 10 ఏప్రిల్ ఆయన పుట్టిన రోజు.
- డా || దేవరాజు మహారాజు (రచయిత సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్,
సెల్ : 9573706806)
Comments
Post a Comment