Skip to main content

ఆదిమానవుడు నాగరిక మానవునిగా ఎదిగిన క్రమం

ఆదిమానవుడు నాగరిక మానవునిగా ఎదిగిన క్రమం

    ఆధునిక మానవ జాతి ఆవిర్భవించక మునుపు లక్షల సంవత్సరాల క్రితమే చాలా మానవ జాతులు విరాజిల్లాయి. 

      మానవ జీవిత పరిణామాలలో మొదటి మానవులను ఆస్ట్రోఫిథికస్ అన్నారు.ఆతరువాతి వారిని రామాఫిథికస్ అన్నారు.ఆ తరువాత వచ్చిన  హోమో ఎరక్టస్ మానవులు మరింత మార్పు చెంది నియాం‌డర్తల్ మానవులుగా రూపాంతరం చెందారు.ఈ జాతులన్ని మనిషి లాంటి ప్రాణులే.వీరి తరువాత వచ్చిన వారు హోమోసేపియన్లు. వీరే నేటి ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.హోమో సేపియన్లు అనేది మానవ జాతికి పెట్టిన పేరు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ విలసిల్లిన మానవ జాతుల్లో జీవించి ఉన్న జాతి హోమో సేపియన్స్ ఒక్కటే. లాటినులో ఈ పేరుకు "వివేకవంతుడు" అని అర్ధం. లాటినులో దీనిని 1758 లో కార్ల్ లిన్నేయస్ పరిచయం చేశాడు.

      హోమో సేపియన్ల మొదటి  శిలాజం ఆఫ్రికాలో లభించింది. ఇది 3,00,000 సంవత్సరాల క్రితం నాటిది. సుమారు 1,00,000 - 30,000 సంవత్సరాల క్రితాల మధ్య ఆఫ్రికా, యురేషియా రెండింటిలోనూ హోమోసెపియన్, నియాండర్తల్ జాతుల మధ్య సంకరం జరిగిందని తెలిసింది.
సమకాలీన మానవులలో కనిపించే లక్షణాలకు అనుగుణంగా శరీర నిర్మాణ శాస్త్రాన్ని కలిగి ఉన్న హోమో సేపియన్లను ఆధునిక మానవులు గా భావిస్తున్నారు. 

      స్పెయిన్ లో అల్తామీర(Altamira)గుహల్లో  ఒక చిత్రం దొరికింది.ఇది హోమోసెపియన్లు గీసిన చిత్రం.


1868లో దక్షిణ ఫ్రాన్స్ లో ఒక చోట రైలు పట్టాలు వేస్తున్నారు . ఆ సమయంలో క్రోమాగ్నన్ అనే గుహ లోంచి ఓ సొరంగం తవ్వాల్సి వచ్చింది. అలా తవ్విన గుహలో ఐదుగురు మానవుల అస్తిపంజరాలు(ఎముకలు) బయటపడ్డాయి.ఆ  ఎముకల వయసు 35,000 ఏళ్లు ఉండవచ్చని తేలింది. అలాంటివే ఇతర అస్తిపంజరాల వయసు 50,000 ఏళ్ల దాకా కూడా ఉండవచ్చని తేలింది.దాంతో క్రోమాగ్నన్ మానవులు  పూర్వం గుహలలో బొమ్మలు వేసుకుంటూ బతికిన రాతియుగపు మానవులై ఉంటారని భావిస్తున్నారు నిపుణులు.అయితే అస్తిపంజరాల బట్టి చూస్తే క్రోమాగ్నన్ మానవులు చాలావరకు మనలాగానే ఉన్నారు. నిజం చెప్పాలంటే నేటి మానవుల సగటు ఎత్తు కన్నా అతడు మరి కాస్త ఎత్తుగా ఉన్నాడు. మెదడు పరిమాణం కూడా మన కన్నా కాస్త ఎక్కువే.(1600cc).

నియండర్తల్ మానవుడి ఆనవాళ్లు యూరప్ లోనే కాక, ఉత్తర ఆఫ్రికాలోను, ఆసియా లోను కూడా దొరికాయి. నలభైచోట్ల వేరువేరు  స్థలాలలో ఇప్పటికి నూరు అస్తిపంజరాల దాకా దొరికాయి.

ఇప్పటి మానవునికి అత్యంత సన్నిహితంగా ఉండి లభించినవి 30,000 ఏళ్ళ నాటివి. కనుక క్రోమాగ్నన్(హోమోసెపియన్) మానవుడు, నియండర్తల్ మానవుడు ఈ భూమి మీద 20,000 ఏళ్ళ పాటు సహజీవనం చేసి ఉండాలి.   ఈ రెండు జాతులు కలిసిన సంకర జాతులు కూడా ఉండేవనడానికి ఆధారం కొత్త అస్థిపంజరాలు లభించడమే.అందువల్ల నియాండర్తల్   మానవుడు కూడా హోమో సేపియనే  అని శాస్త్రవేత్తలు ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు.

ఒక పక్క హోమో సేపియను, మరో పక్క మానవ సదృశమైన ఆకారం కలిగిన హోమో సేపియన్ కాని ఇతర జీవజాతులు - వీటన్నిని కలిపి ఇప్పుడు హోమినిడ్స్ అంటున్నారు. హోమో సేపియన్ కాని హోమినిడ్లో  మనకు దొరికిన మొదటి వాడు జావా మనిషే. 

      1859 లో  చార్లెస్ డార్విన్ తన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ లో ముందున్న జాతుల నుండి కొత్త జాతులు పరిణామం చెందడం గురించి  వివరించారు.డార్విన్ పుస్తకం మానవ పరిణామానికి సంబంధించిన సవాళ్ళను పరిష్కరించలేదు. "మనిషి మూలాలపై, అతని చరిత్రపై వెలుగు ప్రసరిస్తుంది" అని మాత్రమే డార్విన్ చెప్పాడు.     

        డి.ఎన్.ఏ. ఆధారాల ప్రకారం మానవుల ఆవిర్భావం  ఆఫ్రికాలో సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం జరిగింది.అయితే  హోమోసెపియన్ అనే   ఆధునికమానవుడు (ప్రస్తుతమున్న మన జాతి మానవుడు) దాదాపుగా 40 వేల ఏళ్ల క్రితం వరకు ఆఫ్రికాలోనే ఉన్నట్లు ఆధారాలున్నాయి.వీరు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా  వేల సంవత్సరాలపాటు  ఆఫ్రికా ఖండాన్ని విడిచి రాలేదనే వాదన ఉంది.

        ( pic courtesy: nytimes)

అయితే 2019లో  గ్రీస్‌లో  అపిడిమా(apidima) గుహలో కనుగొన్న పుర్రె ఇప్పటిదాకా ఉన్న వాదనను తుడిచిపెట్టేలా ఉంది.ఈ పుర్రె నియాం‌డర్తల్‌ పుర్రె మాదిరి చదునుగా, పొడవుగా లేదు. ఇది మన తల మాదిరి వృత్తాకారంలో ఉంది.నియాండర్తల్ మానవుడు ఆఫ్రికా ను 40వేల ఏళ్ల కన్నా ముందే విడిచి పెట్టాడని భావిస్తున్నారు. ఒకవిశ్లేషణ ప్రకారం లక్ష సంవత్సరాలపాటు ఈ రెండు జాతుల మధ్య సంబంధాలు ఉండి ఉండొచ్చు. తాజా అన్వేషణ ఈ వాదనలపై శాస్త్రవేత్తలను పునరాలోచనలో పడేస్తోంది.(బిబిసి,14.7.2019). మొత్తం మీద ఆఫ్రికా మానవుడే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాడు. మనమూలాలను డి.ఎన్.ఏ ద్వారా పరిశీలిస్తే అవి ఆఫ్రికా లో తేలతాయి.

        చరిత్రపూర్వ యుగంలో ఆదిమానవుడు అడవుల్లో , కొండగుహల్లో , చరియలక్రింద , జీవించాడు .  అందుబాటులో    ఉన్న వనరులతో జీవించాడు .   మనిషి  తన అవసరాల కోసం  ఉపయోగించిన పనిముట్ల స్వభావాలను బట్టి కాలాన్ని రాతి , రాగి , కంచు , ఇనుప యుగాలుగా విభజించారు. 

        మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని  పాత, మధ్య, కొత్త రాతి యుగాలనే మూడు భాగాలుగా  విభజించారు.

1.పాతరాతియుగం(క్రీ.పూ.2,50,000 - 1.25 లక్షల సం!!లు వరకు)

             

            పాతరాతియుగమానవులు నదీ ప్రవాహాల వెంట తిరుగుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహల్లోనూ , చరియల కింద నివసిస్తూండేవారు . ఆహారం కోసం జంతువులను వేటాడి , సంచార జీవనం గడపే , ఆ కాలాన్ని ఆహార సేకరణ దశ అని అన్నారు . 
         ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు. ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.
  
             రాయలసీమలో మధ్య , కొత్త రాతి , ఇనుప యుగాలకు చెందిన శిలాయుగపు చిత్రలేఖనాలున్న స్థావరాలను చింతకుంట , జమ్మలమడుగు , పాలకొండ , ( కడప ) , గాలిబండ ( చిత్తూరు ) , ఆదోని , బొల్లారం , కేతవరం , పులిచెర్ల ( కర్నూలు ) , నాయుడుపల్లి ( ప్రకాశం ) , తెనగల్ , వేల్పు మడుగు ( అనంతపురం ) లలో గుర్తించారు.                  
          ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల్లో ప్రాచీన శిలాయుగపు చరిత్రకు సంబంధించి , పురావస్తు పరిశోధనల్లో కర్నూలు , కడప , చిత్తూరు,అనంతపురం జిల్లాల్లో  రాతియుగపు ఆధారాలు చాలా లభించాయి . కడప జిల్లాలో సగిలేరు నదిలోయ ప్రాంతాల లోను , చిత్తూరు జిల్లాలో రాళ్ళకాలువ నదీలోయ ప్రాంతాలలోను ,  అనంతపురం జిల్లా గుంతకల్లు , కర్నూలు జిల్లా వీరాపురం , సంగమేశ్వరం , బేతంచర్ల , బిల్లసర్గం ప్రకాశం జిల్లా గిద్దలూరు , ఎర్రగొండపాలెం , కృష్ణాజిల్లా ఉస్తపల్లి వద్ద రాతియుగపు స్థావరాలను గుర్తించారు . గుంటూరు జిల్లా , నాగార్జున కొండ ప్రాంతాల్లో చేతి గొడ్డల్లతో పాటు , క్లీవర్లు గోకుడు రాళ్లు , గులకరాతి పనిముట్లు లభించాయి . రేణిగుంట , ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో బ్లేడ్ , బ్యూరిన్ పరిశ్రమకు చెందిన గోకుడురాళ్ళు , పదును పెట్టని అంచులున్న బ్లేడ్లు , బ్యూరిన్లు , బాణపు మొనలు లభించాయి . ఈ రాతి పనిముట్లతో పాటు , ఎముకలను చీల్చి ముక్కలతో చేసిన గోకుడు పనిముట్లు , బరమాలు , ఉలి అంచుమొనలు , సన్నని బరిశెల వంటి పనిముట్లు కూడా దొరికాయి.

2.మధ్య రాతి యుగం(క్రీ . పూ .1.25 లక్షల నుంచి   8000 సం.లు) 
         పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య రాతి యుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.
       పనిముట్ల తయారీలో కొద్దిపాటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన మధ్యరాతి యుగంలో  ప్రాచీన శిలాయుగం కంటే పనిముట్లు నునుపుగా, పదునుగా ఉండేటట్లు తయారు  చేసుకునేవారు.  ఆనాటి మానవులు జంతువుల బారినుండి కాపాడుకోవడానికి ఎత్తయిన కొండ ప్రాంతాల్లో నివసించే జంతువులను,నదీ తీరాల్లో చేపలను వేటాడుతూ గడిపారు. ఈ యుగానికి చెందిన వర్ణచిత్రాలను కడప జిల్లా చింతకుంట, కర్నూలు జిల్లా కేతవరంలలోగుర్తించారు.

3.కొత్తరాతియుగం(క్రీ.పూ. 8000 నుండి క్రీ.పూ. 3000 వరకు)      

       ఈ కాలంలో వ్యవసాయ విప్లవం మొదలయింది. 

     వాతావరణంలో , జీవన గమనంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  కొత్త రాతియుగంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొన్నారు. 

     ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు. మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
    ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.
        ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు. 'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

      ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.

      ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
      ఈ యుగంలో నే క్రీ.పూ.8000లలోరాగి లోహాన్ని కనుగొన్నారు. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.

4.రాగి,తగరపు యుగం

      పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయం ప్రకారం క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.10 వేల సంవత్సరాల కిందట మనిషి వాడిన మొదటి లోహం రాగి పర్షియా (ఇరాన్), ఆఫ్ఘనిస్తాన్ లో 7000 సంవత్సరాల క్రితం ఖనిజాలను వెలికితీయడం ప్రారంభమైంది.

       ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.

5.కంచు  యుగం(క్రీ.పూ. 3000 నుండి క్రీ.పూ. 1000 వరకు)

  క్రీ.పూ. 3000 నుండి క్రీ.పూ. 1000 వరకు గల కాలాన్ని కంచు యుగమన్నారు.  పనిముట్లు, ఆయుధాల తయారీలో కంచు లేక రాగి ప్రధానపాత్ర వహించాయి. అందువల్ల ఆ కాలాన్ని కంచు లేక రాగియుగం అన్నారు. క్రీస్తు పూర్వం 3800 ప్రాంతంలో మధ్య ఆసియా లో కనుగొనబడిన కంచును ఎక్కువగా చైనాలో ఉపయోగించారు.

       భాష, రాత సాధనాలు కనుగొన్నారు. ఇవి నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.

     రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.

          కొత్తరాతి యుగపు చివరి రోజల్లో మానవులు లోహాన్ని కనిపెట్టి , రకరకాల పనిముట్లు తయారు చేసుకొన్నారు . ముందుగా రాగిని , అటు తరువాత కంచును కనిపెట్టి కత్తులు , గొడ్డళ్లు , చేపలను పట్టే గాలాలతోపాటు , కాలికి తొడుక్కునే కడియాలు , చేతిగాజుల్లాంటి ఆభరణాలు కూడా తయారు చేసుకొన్నట్లు  కర్నూలు జిల్లా రామాపురం , బెలుంగుహలు రుజువు చేశాయి . ఈ కాలంలో మానవులు ఒకే చోట అనేక గుడిసెల్లో కుదుళ్లుగా ఒక చిన్న గ్రామంగా నివసించేవారు . మట్టి పాత్రలపై రంగులద్దుకొన్నారు . కుండ మధ్యభాగంలో తాడులాంటి డిజైన్లు కూడా వేసుకొన్నారు . మధ్య ఈనె , రెండంచులూ సన్నగా ఉండే పొడవాటి రాగి కత్తులను కూడా పోతపోసుకొన్నారు . పట్టుకోవడానికి వీలుగా పిడిభాగంలో అటూ ఇటూ రెండు కొనలుండటం వలన వీటిని మీసాల కత్తులనీ , యాంటెన్నా స్వోర్డులనీ పిలిచారు . క్రీ . పూ . 2000 _1000 సం.లమధ్యకాలానికి చెందిన ఇలాంటి కత్తులు గుంటూరు జిల్లా గుత్తికొండ బిలంలోనూ , కర్నూలు జిల్లా బెలుం గుహలోనూ గుర్తించ బడినాయి . చనిపోయిన వారి అస్తికలను కుండల్లో పెట్టి  భూమిలో పాతి పెట్టేవాళ్లు .

6.ఇనుప యుగం(క్రీ.పూ.1000_600)
       గ్రహశకలాలు నుండి  రాలిపడిన ఇనుము నేల మీద సహజంగా లభించింది. ఉత్తర అమెరికాలోని ఇండియన్లు దీనిని ఉపయోగించారు. సుమేరియన్లు దీనిని "ఆకాశం ప్రసాదించిన లోహం" అని అన్నారు.ఈజిప్ట్ లోని పిరమిడ్ లలో   క్రీస్తుపూర్వం 2500 లోనే ఇనుమును వాడినారు. 1000 ఏళ్ళ తర్వాత దీని వాడకం పెరిగింది. క్రీస్తు పూర్వం 1000 ప్రాంతంలో ఇండియాలో ఉక్కును వాడారు. ఉక్కు ఇనుముకు సంబంధించిన మిశ్రమ ధాతువు. ఉక్కును తయారుచేయటం ప్రపంచానికి నేర్పింది భారతీయులే. కానీ అది అందుబాటులోకి  మాత్రం రెండు వందల సంవత్సరాల క్రితమే వచ్చింది. క్రీస్తు శకం 800  లో జపాన్ వాళ్ళు స్టీల్ ఖడ్గం సమురాయ్ ని తయారు చేశారు.
       కంచు  యుగం తరువాత ఇనుపయుగంలో ఇనుప పనిముట్లు , స్థానికంగా ఉన్న రాతివనరులు సమాధుల నిర్మాణానికి దోహదం చేసింది.
         అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో బంగారాన్ని అపురూపం గా చూస్తున్నారు స్పానిష్ వాళ్లు బంగారం కోసమే పెరూను కొల్లగొట్టారు. అనేక దేశాల మీద జరిగిన దండయాత్రలన్నీ బంగారాన్ని దోచుకోవడమే జరిగాయి. పరుసవేది(రసవాదం) కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. మన ప్రజాకవి వేమన ఈ పరుసవేది విద్య కోసమే చాలా సార్లు ప్రయత్నం చేశాడు.

       క్రీ . పూ . 1000 నుండి 600 సంవత్సరాల మధ్య నివసించిన ప్రజలు రాక్షసగుళ్లు (పాండవగుళ్ళు)గా పిలువబడే చుట్టూ రాళ్లను రాసిగా పేర్చి అమర్చిన సమాధులలో , అస్థికలతో పాటు చనిపోయిన వ్యక్తులు , వారి జీవితకాలంలో వాడిన ఇనుప పనిముట్లు , బంగారు ఆభరణాలు , మట్టి పాత్రలు , రాగి పరికరాలను నిక్షిప్తం చేశారు . 
           ఈ సమాధులను కట్టిన విధానాన్ని బట్టి  వాటిని కెయిర్న్ లు , డాల్మెన్లు, సిస్టులు మెన్హిర్లుగా పేర్కొన్నారు.    కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం,గుంటూరు  జిల్లాలలో  ఇటు వంటి   సమాధులు కనుగొన్నారు.

          రాతి యుగం దశ దాటి   క్రీ.పూ.10,000 ఏళ్ళు వచ్చేనాటికి  సేద్యం, పశు సంరక్షణ, నగర నిర్మాణం వంటివి  నేర్చుకున్న హోమోసెపియన్ (ఆధునిక మానవుడు) జీవి   ఆధునిక నాగరికతకు దారులు వేశాడు. పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు ఆదిమ మానవుడిగా కేవలం 15 లేదా 10 సంవత్సరాల సగటు ఆయుర్ధాయంతో  జీవించాడు. క్రీ.శ. 1900 సంవత్సరాలలో ప్రపంచ సగటు మానవ ఆయుర్దాయం కేవలం 25 సంవత్సరాలు. భారతదేశంలో   ధర్మ సంరక్షణ కోసం పుట్టారని చెప్పిన మహాభారతకాలంలో  సగటు ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలే.

       ప్రపంచంలో  ప్రాచీన మానవుని నుండి నేటి ఆధునిక మానవుని ప్రస్థానం వరకు జరిగిన  అభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమే.ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒక వంతవుతుంది.

    

పిళ్లా కుమారస్వామి




      


 


    

 




Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata