నాగరికతలు వికసిస్తున్న దశలోనే ఏర్పడిన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు.
ఆదిమ సమాజంలో సహజ మరణాలు దాదాపు లేవు.శత్రువుల చేతిలో నో జంతువుల బారినో పడి మనిషి మరణించేవాడు. పోరాటంలో గాయపడి సృహతప్పిన వాడికి మరణించిన వాడికి పెద్దగా తేడా తెలిసేది కాదు. స్పృహతప్పిన మనిషి మళ్లీ మేలుకొనే వాడు.దాన్ని చూసి మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడని నమ్మకం ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఉందనే ఒక నమ్మకం ఏర్పడడానికి కారణమయింది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటుంటాడు .అప్పుడు కూడా మనిషి మరణించిన వాని లాగా ఉంటాడు .మనిషి నిద్రిస్తున్నప్పుడు శరీరంలోని ఒక అదృశ్య శక్తి బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిద్ర లేవగానే శరీరం లోకి వస్తోందని భావించే వాళ్ళు. ఈ భావనే ఆత్మభావన కు దారి తీసిందన్నాడు గ్రాంట్ అల్లెన్ తన 'ఎవవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్' లో .
జంతువులను వేటాడి ఆహారసేకరణ మానేసి కుదురుగా ఒకచోట నివసించే పద్దతి మొదలైంది. విత్తనాలు చల్లడం ద్వారా ధాన్యాన్ని పండించు కోవచ్చని తెలుసు కున్నాక వ్యవసాయం ప్రారంభమైంది. వ్యవసాయానికి మానవ సమాజం మారిన దశలో శవాలను పాతిపెట్టడానికి భూమిని తవ్వి తిరిగి మట్టిని కప్పేవాళ్ళు. పాతిపెట్ట బడిన శవాలు తిరిగి లేచి వస్తాయని నమ్మేవారు. అలా జరక్కుండా వాళ్లు రాళ్లు పాతేవారు. క్రమంగా మరణించిన వారి ఆత్మలు రాళ్ల లోకి ప్రవేశిస్తాయని అందువల్ల ఆ రాళ్లు చాలా పవిత్రమైనవన్న భావన మొదలైంది. అనుకోకుండా ఆ సమాధుల భూమిలో విత్తనాలు పడి మొలకెత్తడం తో మరణించిన వారి ఆత్మలకు ఉన్న శక్తి వల్లనే చెట్లు పెరుగుతున్నాయని భావించేవారు.
తీరని కోరికలతో ఉన్న ఆత్మలు మరణించిన తర్వాత కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయనుకునేవారు. అవి ఒక్కోసారి అప్పుడప్పుడు శరీరాకృతిని ధరిస్తాయని నమ్మకం ఏర్పడింది క్రమంగా.దీనినే దయ్యం అన్నారు.
ఎవరైనా మనిషి మరణిస్తే వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించడం కూడా ఇలాంటి నమ్మకాల్లో భాగమే.
సమాజంలో మాత్రం ఆత్మ భావన గురించి ఇప్పటికీ పలురకాలుగా ఉంది. తీవ్రమైన కోరికలు నెరవేరకుండా మరణించిన మనిషి ఆత్మ దయ్యంగా మారుతుందని ఇప్పటికీ భావిస్తున్నారు. ఈ భావన ఆధారంగా ఇటీవల అరుంధతి సినిమా లో ఒక పాత్ర అరుంధతి పై వున్న మోహం తో చనిపోయి అతని ఆత్మ ఆమెకోసం ఆరాటపడు తున్నట్లు కథ సృష్టించారు. ఇలా ప్రజానీకంలో ఉన్న భావనను ఉపయోగించు కున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దయ్యాలైన ఆత్మలు తిరుగు తుంటాయని భ్రమపడుతుంటారు. గతంలో కొరివి దయ్యాలుడేవి. ఇప్పుడు కరెంటు(వెలుగు) రావడంతో అవి వెళ్లి పోయాయని చెపు తుంటారు.ఇవన్నీ ప్రజల్లో ఆత్మల చుట్టూ అల్లుకున్న అనేక మూఢత్వభావనలు. అప్పుడప్పుడూ కొంతమంది ఆత్మలను వీడియో తీశామని ఆత్మలున్నాయని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.ఇవన్నీ గ్రాఫిక్స్. ఇటీవల మదనపల్లె లో ఇద్దరు అమ్మాయిలు చనిపోయిన తరువాత ఆత్మ తిరిగి వస్తుందని, మళ్లీ జీవిస్తారనే మూఢనమ్మకం తో అక్క చెల్లి ని చంపేసింది. ఆ అక్కను తల్లి తండ్రులు చంపేశారు. వీరంతా ఎంతో ఉన్నత చదువులు చదివిన వారే.అయినప్నటికీ మూఢ విశ్వాసాల ఊబిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తల్లి తండ్రులు హత్యలకు పాల్పడ్డారు.
పెద్దల దినమని(వర్ధంతి) జరుపుతారు. ఇదికూడా ఆత్మ లకు సంబంధించినదే.వారొచ్చి ఇక్కడ పెట్టిన భోజనాదులను స్వీకరిస్తారని నమ్ముతుంటారు. కేరళలో నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో చెప్తారని చాలా మంది ఇప్పటికీ నమ్ము తున్నారు.క్రైస్తవులు దయ్యాలను సాతాను అన్నారు. ఇస్లాంలో ముస్లిం లు సైతాన్ అన్నారు.
ప్రకృతినే దేవతగా భావించి తనకు తెలియని అతీంద్రియ శక్తులు ఏవో తనను నడిపిస్తున్నాయనీ భావించి తెలియని శక్తికి దాసుడు అవడం మొదలు పెట్టాడు. అనాదిగా వాళ్ళ ఆరాధ్య దైవం గ్రామ దేవతలు.
క్రీ. పూ. 4000-3000 ఏళ్ల నాటి యూరప్ లో ఇరాక్యూల, ఆజ్జెక్కుల్లాంటి తెగలుండేవి. సామూహిక “పొడుగాటి ఇళ్లు" కట్టుకునేవారు. అక్కడ ఆడవాళ్లే అన్నీ నిర్వహించేవారు. ఆడవాళ్లకి యిక్కడ గౌరవం వుంది. వాళ్లే యింటినీ తెగనీ నిలబెట్టేవాళ్ళు. శీతాకాలపు ఆహారపు నిలవలను వాళ్లే జాగ్రత్త చేస్తారు. వాళ్లే భూమిని దున్నుతారు.విత్తనాలు నాటతారు, పంటని కోస్తారు.ఆడవాళ్ళు మగవాళ్ల కంటే చాలా యెక్కువ పనిచేస్తారు. వాళ్లకి గౌరవమూ అలాగే లభిస్తుంది. అందుకనేప్రతి యింటిలోనూ, ప్రతి గ్రామంలోనూ యెముకమీదగాని, రాతిమీదగాని చెక్కిన స్త్రీ ప్రతిమ వుంది. అది తెగకి ప్రతిబింబమైన మాతృమూర్తి అన్నమాట. ఆమె శక్తి యింటిని కాపాడుతుందని నమ్మేవారు. పుష్కలంగా పంటని యిమ్మనీ, శత్రువుల బారినుండి కాపాడమనీ ప్రజలావిడని ప్రార్థించేవాళ్లు.
గృహాన్ని కాపాడే ఈ మాతృమూర్తి శతాబ్దాల తర్వాత గ్రీకు నగరం ఏథెన్స్ లో ప్రత్యక్షమైంది. ఆమె అక్కడ చేతిలో బల్లెం ఆయుధం గల, గ్రీకు దేవత ఆథీనాగా అంటే నగరాన్ని రక్షించే దేవతగా మారింది. తన పేరున్న ఏథెన్స్ నగరాన్ని కాపాడే యీవిడ విగ్రహం చాలా పెద్దద
ప్రాచీన నాగరికత (3150 BC) కలిగిన ఈజిప్టు దేశంలో మమ్మీలను పూజించేవారు. మమ్మీలను పూజించడం అంటే మరణించిన తమ ప్రాచీనులను పూజించే ఆచారం. ప్రాచీన తెగ సంప్రదాయంలో నాయకుడు మరణించినప్పుడు వారి స్మారక చిహ్నాలు నిర్మించేవారు. వారే కాలక్రమంలో దేవుళ్లు గా పరిణామం చెందారు. వీళ్లే తర్వాత దశలో స్థానిక దేవునిగా ఆరాధింప బడుతున్నాడు. ఉదాహరణకు ఇజ్రాయేలీయులు ప్రాచీన కాలంలో బహుదేవతారాధన చేసేవారు. అందులో యెహోవా దేవుడు కూడా ప్రాచీన తెగలలో ఒక తెగకు సంబంధించిన దేవుడు.
భూమిపై జీవించడానికి అవసరమైన వెలుతురు నీరు నిప్పు గాలి మొదలైన వాటిని ప్రసాదిస్తూ అప్పుడప్పుడు భయకంపితులను చేస్తున్న ప్రకృతి శక్తులపై ఏదో ఒక అతీత శక్తి ఉందన్న భావన దేవుడి భావాన్ని కలిగించాయి. అన్ని భావాలు మాదిరిగానే దేవుడి భావం కూడా పరిణామం చెందుతూ వచ్చింది.
భారతదేశంలో సింధు నాగరికత కాలానికి నైనా ముందు (3000BCE) సింధు ప్రాంత ప్రజలు అమ్మతల్లిని పూజించేవారు.ఆ తరువాత అగ్నిని అగ్ని దేవుని గా గాలిని వాయుదేవుని గా ఆరోగ్యాన్నిచ్చేవారిని అశ్వినీ దేవతలుగా వర్షాలను వరుణదేవునిగా పూజించారు.ఇలా సమస్త జీవజాలం లో దైవాన్ని చూసుకున్నారు.
ఆ కాలంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది కనుక స్త్రీ ఆరాధ్య దైవం అయ్యింది. వీళ్ళ జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు భాగమయ్యాయి. ఈ దేవత గ్రామాన్ని చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుందని నమ్మేవారు. ఆ దేవతే - గ్రామదేవత.బైండ్ల లేదా బవనీ లాంటి కులాల వాళ్ళు ఈ దేవతల పూజారులుగా ఉన్నారు. కల్లూ, సార, జంతుబలి, నైవేద్యం ఈ దేేేేేేేవతలకు సమర్పిస్తుంటారు.
కుంకుల్లు బాగా పండే ఊర్లలో పృధ్వి దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.గోగులు బాగా పూచే ఊర్లలో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసుకున్నారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచు కున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ దేవతకు నివేేదిస్తారు. పూజారికి అందరూ ఆ పంటను తలా ఇంత ఇస్తారు. దాన్ని సొమ్ముగా మార్చుకొని అతడు జీవిస్తాడు. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఆ దేవతకు పొలి పెట్టి దాన్ని చేలో చల్లేవారు . అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూ ఉంది.వ్యవసాయానికి నీళ్లు ముఖ్యం కాబట్టి వ్యవసాయ దారుల దేవత గంగమ్మ అయింది. ప్రతి ఊర్లో ను గంగమ్మ గుడి ఉంటుంది.పగటిపూట వెలుగునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట వెలుగునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నూ దేవతలుగా చేసినారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజిిస్తారు. కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఉండేే దేవత పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు. చాలా ఎత్తులో ఆకాశాన్ని కొండమ్మ గా భావించి ఆకాశ దేవతకు ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన లాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ దేవతను యేర్పాటు చేసుకున్నారు.
తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ దేవతను ప్రార్దించి వెళుతుంటారు.
వూరి పొలిమేరలో వుండే ఒక పెద్దామె పొలిమేరమ్మ. ఈమే క్రమంగా పోలేరమ్మ అయింది. జాతర రోజులలో పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను ఈ అమ్మవారికి ఆపాదిస్తారు.పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. షికారీలు తమ కులదైవమైన వెంకటేశ్వరునికి మాంసాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. పురాణాలలో బలి అనే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఇచ్చి ఆనాటి రచయితలు రాశారు.దాన్ని అలా కొనసాగిస్తూ రావటం మూలాన మన సమాజంలో బలి అనేది సర్వసాధారణమే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది'
ఎల్లమ్మ అంటే ఎల్లలు లేని దేవత అని అర్ధం. ఆమె సోదరీమణులు అయిన గ్రామ దేవతలు ఈదమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, పోలేరమ్మ(పొలి అంటే పోలిమెర-సరిహద్దు), పోచమ్మ, అంకాలమ్మ, సవారు లచ్చమ్మ, పైడితల్లి, గంగానమ్మ, కోట మైసమ్మ, కట్ట మైసమ్మ బందం మైసమ్మ గా గ్రామ గ్రామాన అనేక పేర్లతో విస్తరించి ఉంది. ప్రతి ఇంట్లో తమ ఆడ బిడ్డలను ఆ రూపం లో గౌరవించుకుంటూ ఆ పేర్లు పెట్టుకుంటున్నారు. ఏది ఏమయినా గ్రామ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన స్త్రీలే గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారని భావించి వాళ్లను దేవతలుగా పూజిస్తున్నారని గ్రామాల్లో ఉన్న దేవతల పూర్వ గాథలన్నీ తెలియజేస్తున్నాయి.
దేవతలను పూజించేందుకు 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాల్లో భాగంగానే మత విశ్వాసాలు ఏర్పడ్డాయి.
తాము సృష్టించిన 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడైనాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడని నమ్మేవారు.
( Sledge in ancient Egypt, pc : Wikipedia)
వ్యవసాయం ప్రారంభించినప్పుడు భూమిని దున్నడానికి స్లెడ్జిని విస్తృతంగా ఉపయోగించటం జరిగింది. కొన్నాళ్ల తరువాత రెండు కొయ్య దిమ్మలపై అడ్డంగా రెండు మూడు దిమ్మలను అమర్చి, చర్మం తాళ్లతో బిగించి కట్టిన సాధనం వాడుకలోకి వచ్చింది. శీతాకాలంలో మంచు పడే ప్రాంతాల్లో దీనిని రవాణా సాధనంగా వాడుతూ వచ్చారు. మంచు ప్రదేశం, అందులోనూ నీళ్ళు గడ్డ కట్టిన నది లేదా చెరువు చాలా నునుపు తలాన్ని కలిగి ఉండటమే దీనికి కారణం.
ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల అనేక సార్లు కనుగొన్నారు. అదే కాలంలోనో లేదా కొన్ని వందల సంవత్సరాల తరువాతో మానవుడు మరో గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. ఆహారం వండుకోవటానికి ఇంధనం కావాలనే ఉద్దేశంతో వృక్షాలను పడగొట్టే సందర్భంలో రెండు పెద్ద మొద్దులపైన బరువైన రాతి బండ అకస్మాత్తుగా పడటం సంభవించి ఉండవచ్చు. బండను దూరంగా నెట్టి వేయాలని ప్రయత్నించినపుడు, మొద్దులపై బండ సులభంగా దొర్లి పోవటాన్ని మానవుడు గమనించాడు. ఈ పద్ధతిలో బరువులను అవలీలగా తరలించవచ్చుననే ఆలోచన అప్పట్లో అతనికి తట్టింది.ఈ పద్ధతిని ఆది మానవుడు విరివిగా వాడాడనడంలో సందేహం లేదు. దొర్లుతున్న కొయ్యలపై బరువులను తరలించేటప్పుడు కొయ్యలకీ, భూమికీ మధ్య రాపిడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ ఎప్పుడూ తక్కువే. దొర్లుడు పద్ధతిలో బరువులను తరలించటం చాలా కాలంగా జరుగుతోంది. ఈ పద్ధతి ఇప్పటికీ కొన్ని దేశాల్లో వాడుకలో ఉంది. కొందరు బరువును తోయటమో, లాగటమో చేస్తున్నప్పుడు మరికొందరు బరువు వెనక ఉండే కొయ్య దిమ్మలను తీసి ముందు వైపు పడవేస్తుంటారు. ఇలాంటి "సామాజిక" పనులు చేసేటప్పుడు ఆదిమ మానవుల్లో ఒక రకమైన సమిష్టితత్వం పెంపొందింది.
సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తు న్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావ మని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్విక చింతనలు అని భావిస్తున్నారు.అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని భావిస్తున్నారు పరిశోధకులు.
క్రీ.పూ. 10,12 వేల సంవత్సరాల క్రితం నుంచే మానవుడికి లిపి గురించిన అవగాహన వచ్చింది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది.
వివిధ ప్రాంతాల సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.
ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై ఇలాంటి విశ్వాసాలు ఉన్నట్లు తెలుస్తోంది.పిరమిడ్ల లోని రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడ తాయని వారి నమ్మకం.
కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
నాగరికతలు పెరగడంతో పాటు ఎన్నో రాజ్యాలు అధికారంలోకి రావడం పతనం కావడం కూడా జరిగింది. మధ్య యుగాల చరిత్రలో మనకు క్రైస్తవం, ఇస్లాం, మతాల పుట్టుక వ్యాప్తి కనిపిస్తాయి.
క్రీ.శ. 14వ శతాబ్దిలో ఇటలీలో మొదలైన పునరుజ్జీవన విప్లవం యూరపంతా విస్తరించింది . ముద్రణా యంత్రాలు మొదలుకొని, ఆధునిక యంత్రాలకు నాంది వేసిన మరెన్నో తొలినాటి యంత్రాల రూపకల్పన తో తరువాతి శతాబ్దాలలో ఆధునిక విజ్ఞానం, సాంకేతికశాస్త్రం మరింత అభివృద్ధిచెంది ప్రపంచ నాగరికతలు మరింత ముందుకు దౌడుతీశాయి.
(పిళ్లా కుమారస్వామి)(సైన్సుహేతువాదం,మేజూన్,2021)

Comments
Post a Comment