మానవ పరిణామక్రమం
మానవ పరిణామక్రమం
_పిళ్ళా కుమార స్వామి, 9490122229.
భూమి మీద ఆదిమానవుడు నేటి మానవుని దశకు చేరుకోవడానికి చేసిన ప్రయాణం చాల సుదీర్ఘమైనది.భూమి మీద జరిగిన ప్రతి మార్పు మనిషి మనుగడలో కీలకమైన మలుపులు తీసుకొచ్చింది. అదే మనిషి జ్ఞానాన్ని పెంపొందిస్తూ వచ్చింది.
మార్పు ప్రకృతిలో నిరంతంరంగా ఉంది. అది ప్రకృతి సహజ లక్షణం. ప్రకృతిలో భాగంగా ఉన్న మనిషి ప్రవర్తన కూడా పరిస్థితులను బట్టి చెందుతూ ఉంది.
భూమి మీద ఎన్నో జీవులు పుట్టినా గత 300 కోట్ల సంవత్సరాలలో మనిషి ఒక్కడే సృజనాత్మక జీవిగా రూపొందాడు.దీనికి కారణం మనిషి మెదడు అభివృద్ధి చెందడమే. ఆ మెదడు అభివృద్ధి చెందడా నికి కారణం ప్రకృతితో మనిషి తన మనుగడ కోసం చేసిన నిరంతర పోరాట ఫలితమే. అందులో శ్రమ పాత్ర అధికంగా ఉందన్నాడు ఏంగెల్స్.
మనిషి ఒక్కో అడుగు వేస్తూ తన మెదడు అభివృద్ధి చేసుకుంటున్న దశలో అనేక కోరికలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఆ కోరికలను అనుకూల పరిస్థితులు వచ్చిన తరువాతే ఆచరణలోకి తీసుకురాగలిగాడు. అలా వేచి ఉండే ధోరణి అలవాటు చేసుకున్నాడు.
భూమి మీద వానరుని నుండి నరునిగా రూపాంతరం చెందుతున్న దశలో తొలి తరం మనిషి ఆఫ్రికాలో ఉన్న ఉత్తర కెన్యా, ఈశాన్య ఇథియోపియాలో, టాంజానియాలోని లేక్ రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో తిరిగిన ఆనవాళ్లు లభించాయి. అందువల్ల అక్కడి నుండే మానవ ప్రస్థానం ప్రారంభ మైందని శాస్త్రవేత్తలందరూ అంగీకరిస్తున్నారు.
5కోట్ల సంవత్సరాల క్రితం లేమూర్ (lemur) జాతికి చెందిన అడాపిష్ కు చెందిన ఒక పుర్రె పారిస్
పరిసరాల్లో దొరికింది. దీనికి ఇతర వానరాల లాగా 32 వేళ్ళున్నాయి. వాటికి గోళ్లున్నాయి. బొటన వేలు పట్టుకోవడానికి వీలుగా ఉంది, కళ్ళు పెద్దవి వాటి మధ్య దూరం ఎక్కువ. మిగతా వానరాల కన్నా చిన్నది. మనిషి ముఖలక్షణాలు ఏర్పడుతున్న ప్రాథమిక దశలో ఉంది.
3కోట్ల సంవత్సరాల కిందట కంకాళం ఈజిప్టులోని ఫాయిమ్ లో దొరికింది. దీని పేరు ఏజిప్ట్ పితికిస్(ageptpithecus).ఇది లేమూర్ జాతి కన్నా చిన్నది. పళ్ళు చింపాంజీవి, అవి చెట్టు మీద నివాసముండేవి.ఆహార అన్వేషణ కోసం
అవి కొంత కాలం నేల మీద కూడా గడపడం అలవాటు చేసుకున్నాయి.
2 కోట్ల సంవత్సరాల కిందట తూర్పు ఆఫ్రికా, యూరప్, ఆసియాలలో ఆంత్రోపాయిడ్ చింపాంజీలు
తిరిగాయి. వీటికి లూయిస్ లీకీ శాస్త్రవేత్త ప్రోకాన్సల్ (procansul) అని పేరు పెట్టాడు. కోటి నలభై
సంవత్సరాల క్రిందట 'రామా పితకస్' అనే జీవి కెన్యాలోనూ, ఇండియాలోనూ దొరికింది. దీని పళ్ళు మనిషికున్నట్లే ఉన్నాయి. ముఖం చదునుగా ఉంది. దీనిని " హోమోనిడ్' అని పిలిచినారు. 'రామా' అంటే అందమైన అని అర్థం.
50 లక్షల క్రితం ఆధునిక మానవున్ని పోలిన వారు కనిపించారు. వీరిని ఆస్ట్రలోపితకస్ పితియకస్ అన్నారు. వీరికి భారీ శరీరం ఉంటుంది. శాఖాహారులు కూడా.
20 లక్షల సంవత్సరాల క్రితం బీడుభూముల్లో మనిషి తొలి అడుగులు పడినాయి. మనిషి నిటారుగా తలెత్తుకొని నడిచిన దశ అది. ఆనాడు మనిషి మెదడు బరువు ఒక టన్ను పౌన్ల(907kgs) దాకా ఉంటుంది. ఎత్తు నాలుగడుగులు.
ఈయనకు 'ఆస్ట్రలో పితకస్'(దక్షిణాది వానరం) అని 1924లో రేనాడ్ డార్ట్ నామకరణం చేశారు. ఇతను తొలి రాతి పనిముట్లు తయారు చేసినాడు. ఇలా 10 లక్షల సంవత్సరాలు గడిచేసరికి హెమో ఎరక్టస్ ( homoeructus)మానవుడిగా రూపాంతరమై నాడు. ఇతడు ఆఫ్రికాలో, చైనాలో కనిపించాడు. ఇతన్ని పెకింగ్ మాన్ అని కూడా అన్నారు.
10 లక్షల సంవత్సరాల క్రితం ఆనాటి మానవులు ఆహారాన్వేషణ కోసం నిరంతరం ప్రయాణించేవారు. ఆ విధంగా ప్రయాణిస్తూ ఉత్తరాఫ్రికాకు చేరినారు. 7 లక్షల సంవత్సరాల క్రితం జావాలోకి వచ్చారు. 4లక్షల సంవత్సరాల క్రితం తూర్పున చైనా దాక, పశ్చిమాన యూరప్ దాక వెళ్లారు. ఆనాటి ప్రపంచ జనాభా 20 లక్షలకు
మించి ఉండదు.
నాలుగు లక్షల సంవత్సరాల క్రితం వరకు భయంకరమైన మంచుయుగం రాజ్యమేలింది. అక్కడక్కడా గుహల్లో అగ్నిని రగిల్చిన ఆనవాళ్లున్నాయి. మళ్ళీ 2 లక్షల సంవత్సరాల కిందట రెండవసారి వచ్చిన మంచుయుగాన్ని
ఆనాటి మనిషి తట్టుకొని నిలబడటం గమనార్హం. ఆ కాలంలో బల్లెం, బరిశ, గద లాంటి ఆయుధాలు, రెండు వైపులా మొనదేరిన ఆయుధం మొదలైనవి తయారు చేసుకున్నారు.మంచుయుగాన్ని తట్టుకోవటానికి అవసరాన్ని బట్టి కొత్త పరికరాలను తయారు చేసుకున్నాడు. వాటిని అందరికి అందుబాటులోకి కూడా తెచ్చుకున్నాడు. జంతువును మచ్చిక చేసుకొని వాటిని తమ ఆహార నిల్వలుగా మార్చుకున్నాడు. నిప్పును తయారు చేయటం నేర్చుకోవడంతో మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది.
ఆనాటి మనిషి వాడే పనిముట్లలో మార్పులు వచ్చాయి. వాటిని వాడటానికి ఆదేశాలిచ్చే మెదడు కేంద్రంలో మార్పులు వచ్చాయి. దాంతో మనిషి ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. ప్రవర్తన శిలాజలంలో దొరకదు.కాబట్టి ఎముకలను, పలు వరసలను పరీక్షించి జీవిత విధానాన్ని బట్టి తెలుసుకున్నారు.
క్రీ.పూ. 12,000 ఏళ్ల ప్రాంతంలో ఒక పెద్ద ప్రేలుడు లాంటిదేదో సంభవించి మంచు యుగానికి ముగింపు పలికిందని పలువురు భావించారు. అంటే మానవుని నాగరికత ప్రారంభమై కేవలం 12,000 సంవత్సరాలు మాత్రమే అయింది.
సంచార జీవి సాక్ష్యాలను మిగల్చలేదు. పర్షియా (ఇరాన్) లోని బక్తియారీ తెగ వారు ఒంటరిగానే
కదలిపోతారు. అలాగే ఇరాన్ నుండి బయలుదేరిన ఆర్యులు కూడా సంచార జీవులే. వారు మౌఖికంగా ఒకరొకరు పాడుకున్న వేదాల ద్వారా ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోగలం. ఈ సంచార జాతుల వాళ్ళు జంతువుల కదలికలను బట్టి తమ జీవిత విధానాన్ని మలుచుకున్నారు. స్త్రీలకు పురుష సంతానాన్ని ఉత్పత్తి చేయడమనే బాధ్యతను పెట్టారు. ఆడపిల్లను దురదృష్టంగా భావించారు.
ఆధునిక మానవునిగా రూపాంతరం చెందే ప్రయాణంలో తొలి మలుపు సంచార జీవితం మాని ఒక చోటే స్థిరపడి వ్యవసాయం చేయడం.
* * *
(స్వేచ్చా లోచన మాస పత్రిక, ఫిబ్రవరి,30.1.2021)
Comments
Post a Comment