జీవ కణాన్ని మనిషి కృత్రిమంగా ఎప్పటికీ తయారు చేయలేడా?
మతాలు చెప్పే కాకమ్మ కథలు పక్కకు పెడితే, జీవం నిర్జీవ పదార్ధం నుంచి పరిణామం చెంది వచ్చిందని, ఆ తర్వాత క్రమక్రమంగా ఈ జీవరాశులన్నీఒకదానినుంచి మరొకటి పరిణామం చెంది విర్భవించాయని సైన్సు చెబుతోంది. దానికి ఆధారాలు కూడా చూపింది. ఎన్నో వివరణలు కూడా ఇచ్చింది.
ఒపారిన్, మిల్లర్ చేసిన ప్రయోగాల్లో ఆ పరిణామ క్రమాన్ని కొంతవరకు సాధించారు కూడా!
క్లుప్తంగా చూస్తే- ఆర్ ఎన్ ఏ, డి ఎన్ ఏ, ఎమినో ఆసిడ్స్, ప్రోటీన్స్,... ఆ తర్వాత ఏక కణ జీవం ఇలా పరిణామ చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, జీవ కణాన్ని నేరుగా నిర్జీవ పదార్థాలతో తయారు చేయడం మాత్రం ఇంతవరకూ సాధ్యం కాలేదు.
జీవకణంలో ఉండే భాగాలు, వాటి నిర్మాణం గురించి శాస్త్రవేత్తలకి క్షుణ్ణంగా తెలుసు. కానీ ప్రయత్నం చేసిన ప్రతీసారీ శాస్త్రవేత్తలు వైఫల్యాన్నే ఎదుర్కొంటున్నారు!
జన్వువులను తయారు చేయగలిగారు, వాటిని మార్చగల్గుతున్నారు గానీ, పూర్తిగా ఏక కణ జీవిని మాత్రం తయారు చేయలేకపోతున్నారు.
ప్రయత్నాలు చేసీ, చేసీ విసిగి పోయి, ఇక కృత్రిమంగా పూర్తి జీవ కణాన్ని తయారు చేయడం సాధ్యం కాదని లేదా దాదాపు అసాధ్యం అని తేల్చేసారట!
అంతేకాక ఆ ప్రయత్నం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదని, పైగా అనవసరమైన శ్రమ అనీ కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అయితే నిజంగానే ఇది ఎప్పటికీ సాధ్యం కాదా? లేక అది ప్రస్తుతానికి మాత్రమేనా?...
అయితే 'ఎప్పటికీ సాధ్యం కాదు' అన్నది కూడా హేతుబద్ధమైన నిర్ణయం కాదని మనం భావించవచ్చు.
ఏ విషయంలో నైనా విజయానికి పలు కారణాలున్నట్లే, వైఫల్యానికి కూడా కొన్ని కారణాలుంటాయి.
అలాగే ఈ జీవ కణాన్ని తయారు చేయలేకపోవడానికి కూడా కొన్ని'అడ్డంకులు' ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
మొట్టమొదటిది- దాని పరిమాణంలోని సూక్ష్మత, ఆ తర్వాత దాని సంక్లిష్టత! ఇవీ ప్రధానంగా మనకి కనిపించే కారణాలు. ప్రాక్టికల్ గా శాస్త్రవేత్తలు మరికొన్ని అడ్డంకులను ఎదుర్కొని ఉంటే ఉండవచ్చు.
వాటిన్నింటినీ చాలావరకు అధిగమించారు కానీ, కనిపించని మరో బలమైన కారణం కూడా ఒకటి ఉంది!
అదే "తయారయ్యే పద్ధతి (RECIPE) !"...
ఈ విశ్వంలో ఏ పదార్థమైనా పరిణామం చెంది వచ్చినదే. అయితే ఆ పదార్ధం "ఎలాగైతే" తయారయిందో అది "అలాగే" తయారు కావడానికి అవకాశం ఉన్నదన్నమాట!
అంటే దానికి shortcut అనేది ఉండదన్నమాట..
దీనిని మరోరకంగా కూడా చెప్పవచ్చు. ఈ విశ్వంలో జరిగిన పరిణామంలో ఏ పదార్ధం అయితే తయారు కావడానికి 'అవకాశం ఉన్నదో' అదే తయారైంది అన్నమాట!
అంటే ఇక్కడ మనకి తెలుస్తోంది ఏమిటంటే- ఏ పదార్థమైనా అది ఏ 'పద్ధతిలో' అయితే తయారయిందో అది ఆ 'పద్ధతి' లోనే తయారు కాగలుగుతుంది తప్ప, మరో పద్ధతిలో తయారు చేయడానికి వీలు లేదన్నమాట!
జీవ పదార్ధం కూడా అంతే.. నిర్జీవం నుంచి జీవం ఏ పద్ధతిలో అయితే తయారయిందో, దానిని తిరిగి తయారు చేయాలన్నా మనం ఆ పద్ధతినే అవలంబించాలన్నమాట...
అయితే మిల్లర్ చేసిన ప్రయోగంలో ఈ పద్ధతినే అనుసరించారు కాబట్టే కొంతవరకు సాధించగలిగారు! అలా కాకుండా, నేరుగా నిర్జీవ మూలకాలను తీసుకొని ప్రయత్నం చేస్తే గనుక విఫలమే ఎదురయ్యేది.
ఉదాః ఒక మిరప కాయ బజ్జీని తీసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ సమ పాళ్ళలో ఉండడం ఒక ఎత్తు అయితే, అది ఎలా తయారు కాగలదో అది మరో ఎత్తు. అంతేకాక తయారీ విధానంలో ఏమాత్రం తేడా జరిగినా కూడా బజ్జీ తయారు కాదు.
అలాకాక, నేరుగా దానికి కావాల్సిన మూలకాలను తీసుకొని బజ్జీ తయారు చేయాలని కనుక చూస్తే అది ఎప్పటికీ తయారు కాదు!
మరో మంచి ఉదాః ఒక కందిపప్పు గింజనో, పెసరపప్పు గింజనో,.. ఏదైనా ఒక చెట్టు గింజని తీసుకుందాం.
ఆ గింజలో ఉండే మూలకాలన్నింటినీ తీసుకుని నేరుగా కలిపి, ఆ గింజని తయారు చేయడానికి గనుక ప్రయత్నం చేస్తే అది తయారు అవుతుందా? బహుశా ఎప్పటికీ కాదు. అంటే అది చెట్టునుంచి ఏ విధంగా తయారు అయి వచ్చిందో అలాగే రావాలి తప్ప, మరో రకంగా వీలు లేదన్నమాట. ఇలా మనం ఎన్ని ఉదాః అయినా చెప్పుకోవచ్చు.
చిట్టచివరికి నిర్జీవ పదార్తాలైన రాళ్ళు, రప్పల్ని కూడా నేరుగా మూలకాలతో తయారు చేయలేం. ఇలా ఏ పదార్థాన్ని తీసుకున్నాఅవి ఎలా తయారయ్యాయో, అలా రావాల్సిందే తప్ప, మరో దారి లేదు.
అంటే చివరికి మనకి అర్థం అయింది ఏమిటంటే- జీవ పదార్థమే కాదు, నిర్జీవ పదార్దాన్ని కూడా నేరుగా మూలకాలను ఉపయోగించి తయారు చేయడం సాధ్యం కాదన్నమాట...
ఇదంతా బహుశా ఈ విశ్వంలో ఉన్న "సంభావ్యత (Probability)" గా మనం అర్థం చేసుకోవాలేమో!
అంటే మరో రకమైన పద్ధతి ఈ విశ్వంలోనే లేకపోయి ఉండవచ్చు... ఒకవేళ ఉన్నా అది మనకింకా తెలియదు.
కాబట్టి, "జీవ రాశుల్ని ఆ దేవుడే సృష్టించాడనీ, అది మనిషికి అందుకే సాధ్యం కావడం లేదనీ ఆస్తికులు సంబరపడాల్సింది ఏమీ లేదు!..
అలాగే తయారు చేయలేకపోతున్నామని నాస్తికులు బాధపడాల్సింది కూడా ఏమీ లేదు!''🙂....
- దుర్గా ప్రసాద్
Comments
Post a Comment