భూమ్మీద మొదట కోతి పుట్టిందని, దాన్నుంచే మానవుడు పుట్టాడని విన్నాను. ఈ కోతి శాస్త్రీయంగా పుట్టిందా?


         pc bannedbook.org

దేవుడే మానవజాతిని సృష్టించాడని 19వ శతాబ్దానికి ముందు నమ్మేవారు. ఒక పవిత్ర శక్తి నుంచి ప్రాణులన్నీ వచ్చాయని అనుకునేవారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం వచ్చే వరకు ఇవే భావనలు ఉండేవి. జీవ పరిణామం వల్లే ఇదంతా జరుగుతోందని చార్లెస్ డార్విన్ ఎలా నిర్ధరణకు వచ్చారు? 

ఈ భూమ్మీద మొదట, అంటే భూమి ఏర్పడ్డ సుమారు 550 కోట్ల సంవత్సరాల క్రితం ఏ విధమైన జీవీ లేదు. కోతులు, కొంగలు ఏమీ లేవు. కేవలం సూర్యుడిలాగా స్వతహాగా కాంతినిచ్చే బుల్లి నక్షత్రంలాగే వాయు ధూళి రూపంలోనే వుండేది. క్రమేపీ తనలో ఉన్న కేంద్రక ఇంధనాల (Nuclear Fuel) యిన హైడ్రోజన్‌, డ్యూటీరియం వంటి వాయువులు కేంద్రక సంలీన చర్యల (Nuclear Fusion reactions) ద్వారా పెద్ద పెద్ద పరమాణువులుగా మారాయి. ఆ క్రమంలో ద్రవరూప పదార్థం సలసల మరుగుతూ ఏర్పడింది. ఉష్ణం, శక్తి ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే ఉండిపోవు. అధిక శక్తి ప్రాంతం నుంచి అల్పశక్తి ప్రాంతం వైపు శక్తి ప్రసరించడం సహజ లక్షణం. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం (Zero Law of Thermo dynamics) అంటారు. కాలక్రమేణా ఉష్ణాన్ని, కాంతి శక్తిని పోగొట్టుకున్న భూగోళం ఘనాకృతికి మారింది. ఆ సందర్భంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి వాయురూప నత్రజని, నీటి ఆవిరి ఏర్పడ్డాయి. ఇవి వాతావరణాన్ని ఏర్పర్చాయి. పై పొరలో బురబుర సలసల మరిగే ద్రవ ఘన రూప నేల ఉవ్వెత్తున ఎగిరిపడే లావా ఉప్పెనలు, ఆ పై భాగాన అతి వేడిగా ఉన్న వాయు వాతావరణం దాదాపు 500 కోట్ల సంవత్సరాల క్రితపు భూమికున్న భౌతిక రూపం. శక్తి వికరణం చెందేకొలదీ ఉష్ణోగ్రత తగ్గి నీటి ఆవిరి వర్షంగా మారింది. ఈ వర్షం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది. ఆ చల్లదనానికి లావా లాగా ఎగిసిన ఉప్పెనలు కొండలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అవే సముద్రాలుగా మారాయి. కొండల మీద పడ్డ వాన నేల పొరల్ని రాసుకొంటూ భూమ్యాకర్షణ వల్ల సముద్రాలవైపు పయనించింది. ఇవే నదులుగా మారాయి. సముద్రంలోని నీరు తిరిగి ఆవిరి కావడం, నేలపైకి మేఘాలుగా రావడం, వర్షంగా మారడం, నదీనదాలు నిండడం వంటి నీటి చక్రం స్థాపితం అయ్యింది. ఆ క్రమంలో వేడి వేడిగా వున్న నేల ప్రాంతం నుంచి రకరకాల రసాయనిక ధాతువులు సముద్రాల్లో చేరాయి. అపుడక్కడ ఉన్న ఉష్ణోగ్రత, రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో కాకతాళీయంగా (ముందే ఎవరో సృష్టికర్త రాసి పెట్టినట్టు కాకుండా) DNA, RNA వంటి అరీశ శకలాలు ఏర్పడ్డాయి. DNA, RNA లాంటి సంక్లిష్ట అణువులు ఏర్పడ్డాయంటే అంతకన్నా తేలికయిన కార్బన్‌ డయాక్సైడ్‌, నత్రజని సమ్మేళనాలు, సేంద్రియ, నిరింద్రియ పదార్థాలు (Organic and Inorganic Compounds) కూడా ఏర్పడ్డాయనే అర్థం. కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితుల కారణాన DNA  లేదా RNA వేలిక చుట్టూ తైల అణువుల పొర (lipid layer)  అధ్యణు రసాయనిక ప్రక్రియల (Supramolecular chemical processes) ద్వారా స్వక్రమానుగత పొర (Self Assembled Monolayer) గా ఏర్పడింది. ఇదే తొలి జీవకణం. దీనికి స్వపునరుత్పత్తి (self replication) లక్షణం వుంది. ఇలాంటి దశల మధ్య కాలవ్యవధి సంవత్సరాలు, ఒక మనిషి జీవితకాలం వంటి స్థాయిలో ఉండదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమానుగత చర్యలు పర్యవసానంగా వుంటుంది. అంటే కొద్దికొద్దిగా పరిమాణాత్మకంగా (Quantitatively) మార్పులు చెందుతూ వ్యవధిలో ఓ సందర్భ దశలో గుణాత్మక (Qualitative) మార్పులు చెందడం ద్వారా సంభవించాయి. ఇలాంటి తొలి జీవకణాలకు కాలక్రమేణా జీవులకున్న లక్షణాలు పరిపుష్టి చెందాయి. DNA/ RNA లో వున్న రసాయనిక క్రమం జన్యుస్థాయి (Genetic Rule) ని సంక్రమం చేశాయి.
ఇలాంటి కణాలు కొన్ని కోట్ల సంవత్సరాల గతితార్కిక సైద్ధాంతిక ప్రక్రియల ద్వారా వృక్షజాతులుగా, మరికొన్ని జంతు జాతులుగా పరిణామం చెందాయి. ఎముకలు లేని (అకశేరుక) జీవుల (Invertebrates animals) యుగం కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు సాగింది. అందులో కొన్నింటిలో జీవ రసాయనిక మార్పులు జరిగి భూమ్మీద సంచరించేలా సకసేరు (ఎముకలున్న) జంతువులు (Vertebrate animals) రూపొందాయి. ఆ క్రమంలో కేవలం కోటి, 5 కోట్ల సంవత్సరాల పూర్వమే పాలిచ్చే జంతువులు (Primates) ఏర్పడ్డాయి. కోతులు రూపొంది యిప్పటికి రెండు మూడు కోట్ల సంవత్సరాలకు మించదు. ఈ జాతుల్లోని కొన్ని పరిణామక్రమంలో మానవ శరీరంలోకి పరిణమించాయి. మానవుడు అనే క్షీరద జీవి (Mamnal) రూపొంది కోటి 20 లక్షల సంవత్సరాలకు మించదు. కాబట్టి కోతులు మొదట ఏర్పడలేదు. అవి ఈ మధ్యే జీవ పరిణామ క్రమంలో రూపొందాయి.


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం