సమాజంతో సైన్స్ కలసి నడవాలనే డా. నాయుడమ్మ
“మన జీవితాల్ని చీకటిమయం చేస్తున్న
అంధవిశ్వాసాల్ని తొలగించడానికీ,
సాహసం చేయగల ఉత్తేజాన్ని యివ్వడానికీ,
భవిష్యత్తును చూడగల, దిద్దగల మేథస్సును అందుకోవడానికీ -
మనకు శాస్త్రీయ అవగాహన చాలా అవసరం.”
1976 నవంబరు 15న బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ డా. యలవర్తి నాయుడమ్మ చెప్పిన ఈ మాటలు లక్షల విలువ చేస్తాయి. డా. నాయుడమ్మ చర్మ సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచస్థాయి శాస్త్రవేత్త మాత్రమే కాదు - విద్యావేత్త, విజ్ఞానరంగ ప్రణాళికా కర్త. అంతకుమించి మానవాళి అభ్యుదయానికి రూపశిల్పి. పేదరికం, మూఢనమ్మకం, నిరక్షరాస్యత మధ్య నలిగిపోయే గ్రామీణ భారతీయుడు విజ్ఞానం బాసటగా నిలవాలని ఆయన తపన.
గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో సామాన్యరైతు దంపతులు - అంజయ్య రాఘవమ్మ గార్లకు 1922 సెప్టెంబరు 10న నాయుడమ్మ జన్మించారు. తురుమెళ్ళ గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం నాయుడమ్మ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాలలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత వారణాసి కాశీవిశ్వవిద్యాలయం నుంచి (1943) కెమికల్ టెక్నాలజీలో బి.యస్సీ. డిగ్రీ పొందారు. 1943లో మదరాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో చేరారు. అక్కడ నాయుడమ్మ చురుకుదనం, ఆసక్తి గమనించి అప్పటి మదరాసు ప్రభుత్వం అధునాతన శిక్షణ కోసం విదేశాలకు పంపాలని నిర్ణయించింది.
1946-47లో ఇంగ్లాండు, 1947-51లలో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎస్.సి., పిహెచ్.డి., పట్టాలు పొందారు. అప్పుడే నాయుడమ్మ చాలా ప్రసిద్ధి చెందిన చర్మ సాంకేతిక నిపుణులు డా. ఎడ్విన్ ఆర్. థీస్ నేతృత్వంలో పరిశోధనా శిక్షణ పొందారు. 1951లో స్వదేశం తిరిగి వచ్చారు. మదరాసులోని సెంట్రల్ లెదర్ రీసర్చి ఇన్ స్టిట్యూట్ (CLRI) లో శాస్త్రవేత్తగా చేరారు. 1958లో సంస్థకు 36 సంవత్సరాలకే డైరెక్టర్ అయ్యారు. ఈ సంస్థను తన నేతృత్వంలో ప్రపంచంలోనే పేర్కొనదగ్గ పరిశోధనా సంస్థగా మలిచారు. పధ్నాలు సంవత్సరాలు ఈ సంస్థను అద్భుతంగా నడిపారు.
చర్మాలకు సంబంధించి శుద్ధి చేయడం, శుద్ధి చేయడానికి వాడే ఏజెంట్ల తయారీ, వాడకానికి సంబంధించిన డా.నాయుడమ్మ చేసిన పరిశోధనా కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, 300 దాకా పరిశోధనా పత్రాలు రచించారు. ఆదే సమయంలో కేంద్ర చర్మ పరిశోధనా సంస్థ కూడా గణనీయంగా వృద్ధి చెందింది. దాంతో సి.యల్.ఆర్.ఐ. వివిధ విభాగాలతో పరిపూర్ణత పొందింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఫలవంతంగా ముందుకెళ్ళడం నాయుడమ్మగారిలో గమనించవచ్చు.
వారణాసిలో రసాయన సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ అయ్యాక, చెన్నపట్టణంలో చర్మసంబంధ సంస్థలో ఉద్యోగం వచ్చినప్పటి నుంచి చర్మకారుల సమస్యలు వారికి తారసపడ్డాయి. అందువల్లనే ఎంతోకాలంగా పరిచయం వున్న చర్మకారుల వృత్తికి సాంకేతిక విజ్ఞానం తోడు చేయగలిగారు. సాంకేతిక విజ్ఞానం సాయంతో కళానైపుణ్యం తోడుగా నడిచే పరిశ్రమగా దానిని మలచగలిగారు.
ఇండియన్ హెల్త్ అండ్ స్కిన్ డెవలప్ మెంట్ సొసైటీ, ది ఇండియన్ లెదర్ ఫేర్ సొసైటీ, ది లెదర్ క్లబ్, ది కోరమాండల్ క్లబ్ వంటి సంస్థలను చర్మశుద్ధిచేసే వారికి తోడ్పాటుగా ప్రారంభించారు. తర్వాత దశలో ఐక్యరాజ్య సమితి సలహాదారు హోదాలో సూడాన్, సోమాలియా, నైజీరియా, టర్కీ, ఇరాన్, టాంజానియా, ఇథియోపియో, కెన్యా, కామరూప్ వంటి దేశాల్లో చర్మ పరిశ్రమ పరిఢవిల్లడానికి యితోధికంగా కృషి చేశారు.
పరిశోధన అనేది కేవలం ప్రయోగాలతో మొదలై, ప్రయోగశాలతో ముగిసిపోకూడదు. దానికి ఉపయోగపడే ధర్మం వుండాలి. అది పరిశ్రమలోనో, మరోచోటనో ఉత్పత్తికి దోహదపడాలి. ఈ రీతిలోనే ఆయన పరిశోధన సాగేది. సి.యల్.ఆర్.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన మరో తెలుగు శాస్త్రవేత్త డా.ఎమ్.శాంతప్ప నాయుడమ్మ కృషి గురించి - చర్మశుద్ధి రంగంలో పనిచేసే కార్మికుల స్థితిగతులు, జీవనస్థాయి, మెరుగుపడాలనే సామాజిక కోణాన్ని డా.నాయుడమ్మ టానింగ్ యిండస్ట్రీకి యివ్వగలిగారు.
1971 తర్వాత నాయుడమ్మ ప్రణాళికా మేథస్సు, పరిపాలనా విధానాల్లో సృజనాత్మకత, యాజమాన్య పద్ధతుల్లో నూతనత్వం - మరింత స్పష్టమయ్యాయి. 1971 ఆగస్టులో సి.ఎస్.ఐ.ఆర్. (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి) డైరెక్టర్ జనరల్ గానూ, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ గా దాదాపు యాభై జాతీయ ప్రయోగశాలలకు, 30 వేలమంది శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించారు. మరింత స్వేచ్ఛతో ఆ ప్రయోగశాలలు పనిచేసేలా చూశారు. సంప్రదాయక పద్ధతి కాకుండా సృజనాత్మకంగా అవసరం కొద్ది పరిశోధన సాగేలా చూశారు. అందువల్ల వివిధ విభాగాలు కలిసి పరిశోధన సాగించే రీతిలో మార్పు వచ్చింది.
1977 CSIR డైరెక్టర్ జనరల్ పదవీకాలం పూర్తి అయ్యాక, మరలా విశిష్ట శాస్త్రవేత్తగా సి.యల్.ఆర్.ఐలో చేరారు. CSIR సహకారంతో మద్రాసులో ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్ నేటివ్స్’ ను స్థాపించారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలకూ, గ్రామీణ ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలకు దోహదపడే ప్రత్యామ్నాయ పద్ధతులు, సాంకేతిక విధానాల రూపకల్పన ఈ సంస్థ ధ్యేయం. 1980లో ‘కమిటీ ఆన్ సైన్స్, టెక్నాలజీ ఇన్ డెవలప్పింగ్ కంట్రీస్’ (COSTED) ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, ఇంకా అనేక హోదాలలో పనిచేశారు. 1971లో ‘పద్మశ్రీ’ పురస్కారం పొందారు. ఆంధ్ర, నాగార్జున, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. 1981లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డుతోపాటు ఎన్నో పురస్కారాలు పొందారు.
కెనడాలోని మాంట్రీయల్ లో జరిగిన అంతర్జాతీయ పరిశోధనామండలి సమావేశానికి హాజరయి, తిరిగివస్తూ డాక్టర్ నాయుడమ్మ 1985 జూన్ 23న కనిష్క విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజ్ఞానాన్ని సమాజంకోసం ఉపయోగించాలనే వారికి గొప్ప స్ఫూర్తిగా నిలిచే సమగ్ర శాస్త్రవేత్త - డా. యలవర్తి నాయుడమ్మ. ఆయన మాటలను మరోసారి గుర్తుచేసుకుందాం...
‘జాతీయ కర్తవ్యంలో భారత శాస్త్రవేత్తకు తగిన పాత్ర వుంది. ఈ గురుతర బాధ్యతను నిర్వహించాల్సింది శాస్త్రవేత్త’ అర్థంలేని భావనలు, మూఢనమ్మకాలు, అసంగత అభిప్రాయాలు తొలగాలి. శాస్త్రీయ విజ్ఞానం నాలుగు చెరగులా పరచుకోవాలి. ఈ మార్గంలో నడక మందకొడిగా వుండవచ్చు. అయితే మన సమాజాన్ని శాసించే విభిన్న ధోరణులనూ, వాటి గమనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం శాస్త్రవేత్తకు ఎంతైనా వుంది.
డాక్టరు నాగసూరి వేణుగోపాల్
సైన్స్ రచయిత,
మొబైల్ 9440732392
Comments
Post a Comment