విజ్ఞాన శాస్త్రం సముపార్జించిన అందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లేనా?





 శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటి కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని ఆపోసన చేసిన వారందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లు భావించకూడదు. అయితే శాస్త్రీయ దృక్పథానికి ఆధారం మాత్రం శాస్త్రమే. అలాగని శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరూ సకల శాస్త్రకోవిదులు కారు. సామాజికంగా చూస్తే శాస్త్రం అందరికీ తెలియకపోయినా పర్లేదుగానీ, పరిమిత సంఖ్యలోనే శాస్త్రజ్ఞుల సంఖ్య దేశంలో ఉన్నా సర్దుకు పోవచ్చును గానీ శాస్త్రీయ దృక్పథం విషయంలో పరిమితికి తావులేదు. ఇది మొత్తం సమాజానికి ఆసాంతం వుండాలి. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం సామాజిక సంస్కృతిగా ఉండాలి. ప్రతి జన జీవనంలోను శాస్త్రీయ దృక్పథం తొణికి సలాడాలి. శాస్త్రం అంటే ఏమిటో, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో? టూకీగా తెలుసుకుందాం.
ప్రకృతి గురించిన, సమాజాన్ని గురించిన నియమాలను అవగా హన చేసుకోవడం, వాటికి సంబంధించిన వాస్త వాలను ప్రాయోగికంగాను, అనుభవాల ద్వారాను తెలుసుకోవడం, తద్వారా మానవ సమాజ జీవితంలో వాటిని ఇముడ్చుకుంటూ నిన్నటికంటే మెరుగయిన, తక్కువ వేదన కలిగిన ప్రజాజీవితానికి ఉపకరించడం- ఇదే శాస్త్రం (శాస్త్ర సాంకేతిక రంగాలు రెండూ శాస్త్రం అనే ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు కాబట్టి ఇక మీదట శాస్త్రం అంటే సాంకేతిక శాస్త్రాల్ని కూడా కలుపుకొని భావించినట్టు అర్థం చేసుకోవాలి) ప్రకృతిలో అనంతమైన పదార్థాలు, పదార్థాల తీరుతెన్నులు, వైవిధ్యాలు వున్నాయి కాబట్టి శాస్త్ర పరిజ్ఞానాన్ని వర్గీకరించడం సాధారణం. అందుకే భౌతికశాస్త్రాలు (ఇందులో మళ్లీ సాధారణ భౌతిక శాస్త్రాలు, అందులోని ఉపశాఖలు, సాధారణ రసాయనిక శాస్త్రం, అందులోని ఉపశాఖలు వున్నాయి). జీవశాస్త్రాలు (ఇందులోనూ సాధారణ జంతుశాస్త్రం, దానికి సంబంధిం చిన ఉపశాఖలు, సాధారణ వృక్షశాస్త్రం, అందులో సంధానిం చుకొన్న ఉపశాఖలు ఉన్నాయి) అంటూ ప్రధానంగా వర్గీకరించారు. అయితే ఆధునిక విజ్ఞానశాస్త్రం పలు శాఖల మధ్య ఉన్న విడదీ యరాని సంబంధాల్ని గుర్తించి, అంతర్విధాన శాస్త్రాల్ని(interdisciplinary sciences) గుర్తిస్తోంది. మొత్తమ్మీద శాస్త్రానికి వర్గీకరణ వుంది. వైవిధ్యం వుంది. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో రంగంలో ప్రావీణ్యత సంపాదిస్తాడు. లేదా ఆసక్తి కనబరుస్తాడు. ఒక్కో విజ్ఞానశాస్త్ర పుస్తకం ఒక్కో రంగానికి పరిచయం చేస్తుంది. ఒక్కో పరిశోధనా పత్రం ఒక్కో లోతైన అంశాన్ని వెలికితీసి విజ్ఞాన శాస్త్రమనే స్థూల భాండా గార సంపదను ఇను మడింపజేస్తుంది. శాస్త్రీయ దృక్పథం అంటే ఇలా చెప్పు కోగలం. ప్రకృతి లో మనకు అవగత మయ్యే ప్రతి ఘటన (phenomenon or event) కు చోదకశక్తి కారణం. ఇదే ప్రకృతిలో వుంటాయి. ప్రకృతేతర శక్తిగానీ, వాస్తవ జగత్తు బయటగానీ మరేదో చోదకశక్తి ఈ ఘటనలకు కారణం కాదు. కాబట్టి ఈ ఘటన మనకు ఉపకరించేదయితే ఆ చోదకశక్తిని మచ్చిక చేసుకోవడం ద్వారా ఉపకారాన్ని పొందగలం. ఒకవేళ ఆ ఘటన ప్రమాదకరమైనదయితే ఆ చోదకశక్తికి ఆటంకం కలిగించడం ద్వారా ప్రమాదాన్ని నిరోధించగలం. శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరికీ ఈ అభిప్రాయమే ఉంటోంది. అంతమాత్రాన శాస్త్రీయ దృక్పథపు పరిధి పూర్తవలేదు. శాస్త్రీయ దృక్పథం వున్న వారెపుడూ తమను, తమ భావాల్ని నిరంతరం మార్చుకోవడానికి ఇష్టపడతారు. వాస్తవం అంటే నిజం కాబట్టి, సమాధానం కాబట్టి ప్రశ్నే సమాధానాన్ని రాబడుతుంది కాబట్టి అర్థం బోధపడని ప్రతిఘటనకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుం టారు. ఎందుకిలా, ఎపుడలా, ఎవరలా, ఎక్కడిలా, ఏ విధంగా అలా, ఏమిటిలా అంటూ ప్రశ్నల్ని అనునిత్యం మనసా, వాచా, కర్మణా సంధించుకొంటారు. ప్రకృతి లోనే అందుకు కారణాలున్నా యన్న ప్రాథమిక నమ్మకం (ఇంతకు మించి మరేవిధమైన కారణం లేదన్న రూఢి ఏర్పడ్డం వల్ల కలిగిన నమ్మకం) వుండడం వల్ల ప్రకృతిని వారు అన్వే షిస్తారు. వారి విజ్ఞాన దాహానికి అంతుండదు. శాస్త్రానికున్న సార్వత్రికత (universality)ను, వస్తు వాస్త వికత (object ivity) ను వారు తమ పరిజ్ఞా నాభివృద్ధికి గీటు రాయిగా భావిస్తారు. శాస్త్రం రుజువు చేసిన వాస్తవానికి వ్యతిరేకంగా నమ్మినా, ఆచరించినా మూఢనమ్మకం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో వైవిధ్యం వున్నట్టు శాస్త్రీయ దృ క్పథంలో వైవిధ్యం వుండదు. ఆయనకో శాస్త్రం, ఈయనకో శాస్త్రం, ఆయన డాక్టర్‌, ఈవిడ ఇంజనీర్‌, ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, ఈయన ఖగోళ శాస్త్రవేత్త అనగలం కానీ, ఆయన ఆ తరగతికి చెందిన శాస్త్రీయ దృక్పథం వున్నవారు, ఈమె ఈ తరగతికి చెందిన శాస్త్రీయ దృక్పథం ఉన్న ఆవిడ అనే వర్గీకరణ వుండదు. ప్రశ్నించడాన్ని ఎంత సహజంగా ప్రవృ త్తిగా భావించాలో, ప్రశ్నించబడడానికి అంతే సంసిద్ధత చూపగలిగిన మనో నిబ్బరం, ఆసక్తి ఉన్నవారే నిజమైన, కచ్చితమైన శాస్త్రీయ దృక్పథానికి ఆది, తుది గీటురాయి. శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలు చాలామందికి శాస్త్రీయ దృక్పథం వుండదు. శాస్త్రం పరిమితంగానే తెలిసినా అపారమైన శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు ఉన్నారు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.


సత్యసాయిబాబాకు లక్షలాదిమంది భక్తులున్నారు. ఆయన చేసిన విద్య, వైద్య సేవలతో ఆకర్షితులవడం ద్వారానో, ఆయనకున్న పౌరాణిక పరిజ్ఞానం పట్ల అభిమానంతోనో ఆయనను శ్లాఘిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన శూన్యం నుంచి వస్తువుల్ని సృష్టించగలడని, ఇది అతీతశక్తి అని భావించి ఆయనను పూజిస్తే అది ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ ఆయన చేయగలడని ఎవరైనా నమ్మినా ఆయనా, ఆయన భక్తులు పూర్తిగా రుజువు చేసుకోవాలి. ఇందుకు పద్ధతులు న్నాయి. కానీ రుజువులకు సిద్ధపడకుండా, రుజువులు కోరే వారిని తూలనాడుతూ విజ్ఞానశాస్త్రంలో అత్యంత కీలకమైన ద్రవ్యశక్తి నిత్యత్వ సూత్రాని  (Conser vation of Mass-Energey) కి విరుద్ధంగా ప్రకటి స్తున్న ఆయన క్లెయిమ్‌ను గుడ్డిగా నమ్మే శాస్త్రవేత్తలు, పాలకులు, ప్రజలు, విదేశస్తులు, వ్యాపారవేత్తలకు శాస్త్రం ఎంత తెలిసినా శాస్త్రీయ దృక్పథం పూర్తిగా లేనట్టే. మరో ఉదారహణ: మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్న ఐదారు దేశాల సరసన నిలవదగిన ఘనాపాటి విజయాల్ని సాధించింది. చంద్రయాన్‌, అంగారక గ్రహ పరిశోధన (Mars Orbit Mission-MOM) వంటి ప్రయోగాల్లో విజయం సాధిస్తోంది. ISRO అధిపతికి ఉన్న ఖగోళ పరిజ్ఞానం, భౌతిక శాస్త్రంపై అవగాహన తక్కువ వుంటే ఆ స్థాయికి చేరుకోవడం కష్టమే. అయితే ఉపగ్రహ ప్రయోగం లో చోటు చేసుకొన్న ప్రతి ప్రక్రియలోను ప్రకృతికి సంబంధించిన, రుజువు కాబడ్డ సూత్రాలే ఉన్నాయన్న సంపూర్ణ నమ్మకం ఆయనకు ఉన్నట్టు లేదు. ఒకవేళ ఉపగ్రహం ఫెయిలైనా అందుకు కారణాలూ సశాస్త్రీయం గానే వుంటాయి. మరో మాటలో చెప్పాలంటే ఉపగ్రహ జయాపజ యాలకు వందకు వంద శాతం కారణం విజ్ఞాన శాస్త్రమే. మరేదో అతీతశక్తిగానీ, రాళ్లూ, రప్పలూ కావు. ఆ రాళ్లూ రప్పలు కూడా ఈ ప్రకృతిలోని పదార్థలే తప్ప, వాటికీ ఈ పాదార్థిక ధర్మాలే వుంటాయే తప్ప ప్రకృతేతర పాదార్థిక అంతర్నిర్మాణం, శక్తులు వాటికి లేవు. కానీ ఆ సంస్థాధి పతులు పలుమార్లు ప్రయోగాలకు ముందు పూజలు చేయడం, విజయాలను కాంక్షించడం అశాస్త్రీయం. పైగా ఆ తంతేదో వ్యక్తిగత స్థాయిలో చేయరు. అధికారికంగా చేస్తారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక






Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata