జీవం పుట్టుక పై సాహిత్యం



         

         భూమిపై జీవం ఎలా పుట్టింది ? ఈ ప్రశ్న మానవున్ని నిరంతరం వేధిస్తోంది. ఆధునిక విజ్ఞానం ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు కనుగొన్నదనే చెప్పవచ్చు.
            భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తులో (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యురూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే. 
      ప్రకృతిలోని భౌతిక పదార్థం, దానిలోని జీవం కలయిక వల్లే జీవం ఏర్పడుతోందని ప్రశ్నోపనిషత్  (క్రీ.పూ. 500-400) చెపుతుంది. ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో దార్శనికులు కొద్దిపాటి భౌతికవాద దృష్టితో చెప్పినారు. ఉపనిషత్తులతో సంబంధం లేకుండా 'అసితకేశ కంబలుడు' అనే భౌతికవాద దార్శనికుడు నీరు, నిప్పు,గాలి, నేల అనే నాలుగు అంశాల కలయికతో జీవం ఏర్పడిందని చెప్పాడు. 'జీవి మరణించాక నీరు నీటిలో, గాలి గాలిలో, నిప్పు నిప్పులో, నేల నేలలో కలసిపోతుంది. జీవుడు ఎ లోకాలకు వెళ్లడు. స్వర్గం, నరకం, దేవతలు ఏమీ లేవు. ఉన్నవి ఈ నాలుగు అంశాలే' అని చెప్పినాడు.
         ప్రకృథ కాత్యాయనుడు - నీరు, నిప్పు, నేల, గాలితో పాటు చైతన్యం, దుఃఖం, సుఖంల కలయిక తో సృష్టి జరిగిందని చెప్పాడు.
         బుద్ధుడు (క్రీ.పూ. 563–483) ఒక పదార్థం వేరొక పదార్థంగా మారుతుందేగాని ఎన్నటికీ ధ్వంసం కాదని చెప్పాడు. మార్పునకు లోనుకానిదేదీ లేదు. ప్రపంచమంతా చలసశీలమైనది. మార్పు ప్రపంచ అస్థిత్వానికి మూలసూత్రమని చెప్పాడు. గ్రీసు దేశపు 
' హెరాక్లిటస్' కూడా ఇదే సూత్రాన్ని చెప్పినాడు.  
  ‌‌     క్షణక్షణం మనం చూసే ప్రపంచం కొత్తదని
బుద్ధుని భావన. ప్రపంచం గతిశీలమైనదని (మార్పుకు లోనవుతుందని) చెప్పిన బుద్ధుడు పరిణామవాదాన్ని అంగీకరించాడు.కార్యాకారణ సంబంధ సూత్రాన్ని ప్రతిపాదించాడు.
          మన దేశంలో మొదటగా భౌతికవాదాన్ని ప్రచారం చేసినవారు చార్వాకులు. వీరిని లోకాయతులు అని కూడా పిలుస్తారు. వీరిలో క్రీ.పూ. 200 కాలం నాటి బృహస్పతి అనే రుషి మొదటి వాడు. ఈయన గ్రీకు తత్వవేత్త థెలిజ్ కు
సమకాలీకుడు. చార్వాకులు అంటే వాదనా పటిమతో ఇతరులను ఒప్పించి మెప్పించే వారని అర్థం. లోకాయతులు లోకమంతా విస్తరించిన వారని అర్థం, గ్రీసు దేశంలో ఎపిక్యూరస్ (క్రీ.పూ. 342-370) ప్రారంభించిన ఎపిక్యూరియనిజం కూడా ఇలాంటి భౌతికవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాకుల ప్రకారం ఈ ప్రపంచం నిత్యం. ప్రకృతి అంతా కొన్నినియమాల కు లోబడి పరివర్తనాకాలం కలిగి ఉంది. ఈ ప్రపంచాన్ని గాని, మానవున్ని గాని ఎవరూ సృష్టించలేడు, ప్రపంచం తనకు తానుగా ఆవిర్భవించింది. జ్ఞానం పొందాలంటే సాధనం చేయాలి. ఆత్మప్రబోధల, అంతర్దృష్టి వలన జ్ఞానం రాదు. అగ్ని, నీరు, భూమి, గాలి పదార్థ నిర్మాణానికి మూలం. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అచేతన పదార్థాలకు చైతన్యం వస్తుంది. ఆత్మచైత్య సహితమైనది. అది శరీరాన్ని విడిచి బయట ఉండలేదు. మనిషి మరణంతో చైతన్యమూ,
ఆత్మకూడా నశిస్తాయి. ఇలా చార్వాకులు భౌతికవాదాన్ని ప్రచారం చేయడంతో ఛాందస వాదులు వీరి గ్రంధాలను తగులబెట్టారు. చాలా మందిని చంపివేశారు. అందువల్ల మనకు వీరి గ్రంథాలు దొరకటం లేదు.
       క్రీ.పూ. 400లో కపిలుడు సాంఖ్య దర్శనాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ప్రకారం ప్రకృతి నిత్యమైంది. ఈ సృష్టంతా దాని రూపాంతరాలే! నీరూ, గాలి, నిప్పు, నేల - ఈ నాలుగు అంశాలతో జీవం (చైతన్యం) పుడుతుందని చెప్పారు చార్వాకులు.
కొంత మంది అభిప్రాయంలో క్రీ. శ. 150లో కణాదుడనే రుషి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను వైశేషిక దర్శనానికి కర్త. ఇది షడ్దర్శనాలలో ఒకటి. ఇతని సిద్ధాంతం ప్రకారం ప్రతిపదార్థం పరమాణువులనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైంది. సృష్టికర్తను ఆమోదించలేదు. సృష్టి నిర్మాణానికి పరమాణువుల్లో చలనం అవసరం.
అణువుల సంయోగ వియోగాలవల్లే పదార్థాలు రూపొందుతాయన్నది కణాదుడి దృఢమైన అభిప్రాయం. ఇలా సాగిన భారతీయ భౌతికవాదం శంకరుని మాయావాదంతో మళ్లీ భావవాదంలోకి కూరుకుపోయింది. భగవద్గీతతో అది పరాకాష్టకు పోయి తిరిగి లేవలేనంతగా చతికిలపడిపోయింది. భారతీయ విజ్ఞానాన్ని అంధకారం అలుముకుంది. ఇదంతా మాకెప్పుడో తెలుసు, అన్ని వేదాల్లోనే ఉన్నాయంటూ నైరాశ్యంతో మాటలు వల్లించే అజ్ఞానులుగా మతఛాందసవాదం తయారుచేసింది భారతీయులను.
         క్రీ.శ. 1440లో యూరప్ సమాజం సాంస్కృతిక పునరుజ్జీవనం పొంది చీకట్లను తెంచుకొని విజ్ఞానపు వెలుగులోకి దౌడుతీసింది. భారతదేశం ఛాందసవాదపు చీకట్లలోనే ఉండిపోయింది.
       గ్రీకు తత్తవేత్త థేలీజ్ (క్రీ.పూ. 640–546) ఈ సృష్టికి మూలం సముద్రంలోని జలమేనని తర్కంచేసి తేల్చాడు.హెర్లాకిటస్ (క్రీ.పూ. 534-475) “మనం ఏ పని చేసినా శక్తి కావాలి. ఈ శక్తికి మూలం అగ్ని. అందువల్ల అగ్ని ఈ సృష్టికి మూలం" అని చెప్పాడు. "ఈ ప్రకృతి క్షణక్షణం నశిస్తుంది, జనిస్తుంది. నిరంతరం మారుతూ ఉంటుంది" అని ప్రతిపాదించాడు. ఎనాగరస్ (క్రీ.పూ. 500-428) అనే తత్వవేత్త, ప్రకృతి నిర్మాణానికి కొన్ని మూలపదార్థాల కలయిక మూలమని చెప్పాడు. ఆయన శిష్యుడు డెమోక్రటిస్ (క్రీ.పూ. 460–370) నేడు శాస్త్ర విజ్ఞానము నిరూపించిన, పరమాణు సిద్ధాంతాన్ని ఆనాడే సెలవిచ్చాడు. 'పరమాణువులే సృష్టికి మూలం - కంటికి కనిపించని చిన్న చిన్న
కణాలతో ప్రకృతి రూపుదిద్దుకొంది' అని ఆయన చెప్పినప్పటికీ ఆయన వాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంపిడోక్లోజ్ (క్రీ.పూ. 495–435) అనే తత్వవేత్త ప్రకృతి మూలతత్వాలు నాలుగు, అవి నిప్పు, గాలి, నీరు, మేమునేల. నేల ఇందులో శ్రేష్టమైనది. పదార్థ సంయోగ వియోగాల వల్ల రకరకాల పదార్థాలు ఏర్పడుతున్నాయి' అని
పేర్కొన్నాడు.
       ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) గురువులాగా కాకుండా సృష్టి మూలం ఎంపిడోక్లోజ్ చెప్పిన నాలుగు పదార్థాలే కాదని చెప్పాడు. వాటి తత్వాలైన పొడి (భూమి), తడి ( నీరు), వేడి (అగ్ని), చలి (వాయువు) - ఈ నాలుగు గుణాల సంయోగ వియోగాలే సృష్టికి మూలం అని చెప్పాడు.
భూమిపై జీవం ఏర్పడి కోటాను కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. జీవం పుట్టుకకు సంబంధించి 1862లో ఫ్రెంచి శాస్త్రవేత్త 'లూయిపాశ్చర్' ఒక జీవి నుంచి మరొక జీవి అనుక్రమంగా వస్తుందని సూత్రీకరించాడు. దీనితో జీవావిర్భావానికి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం
జీవం పుట్టుక అనే భావాన్ని కొట్టిపారేశారు. జీవం ముందు నుంచి ఉంది. అది అనంతం. అది విశ్వంలోంచి భూమిపై ప్రవేశపెట్టబడిందని వాదించారు. నిర్ణీపం నుంచి జీవపదార్థం ఎలా వస్తుంది ? అంటూ ప్రశ్నించారు. మరోవర్గం
నిర్జీవం నుంచి జీవపదార్థం పుట్టిందని సూత్రీకరించారు. తరువాత పరిశోధనల్ల తేలినదేమంటే నిర్జీవ పదార్థాల్లోని మూలకాలు జీవపదార్థంలోని మూలకణాలు ఒకటే అని దీనితో నిర్జీవ పదార్థం నుంచే ఒక పరిణామ క్రమంలో జీవపదార్థం ఏర్పడిందనే వాదనకు బలం వచ్చింది,
1924లో రష్యాకు చెందిన శాస్త్రవేత్త 'ఒపారిన్', 1929లో ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త హాల్డెన్ 'లు  నిర్జీవ పదార్థం నుంచే జీవం ఆవిర్భ వించిందనే దానికి బలమైన ఆధారాలుకనుగొన్నారు. దానితో దీన్నే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసమ్మతంగాఆమోదిస్తున్నారు. 1995లో బైబిల్ చెప్పింది మాత్రమే నమ్మేమ పోప్ జాన్ పాల్ (వాటికన్ సిటీ)పదార్థం నుంచే జీవం వచ్చిందని, భగవంతుని సృష్టికాదనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించాడు కూడా.


      ___పిళ్లా  కుమారస్వామి, సెల్ : 9490122229

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం