అన్ని శాస్త్రాలకు కన్నతల్లి వైద్యం
అన్ని శాస్త్రాలకు కన్నతల్లి వైద్యం
తరతరాల వైద్యవృత్తిలో తాము పోగుజేసిన జ్ఞానాన్ని విశ్లేషించి నేటి శాస్త్ర విజ్ఞానంతో పోల్చిచూసి ఆశ్చర్యం గొల్పే అనేక శాస్త్రీయ విషయాలను ప్రాచీన భారతీయ వైద్యులు
కనుగొన్నారని అర్థమవుతుంది. మనిషి గురించి ప్రకృతి గురించి, వాటి పరస్పర సంబంధం గురించి, వైద్యం గురించి, మత గ్రంథాలలో చెప్పబడిన భావాలకు పూర్తి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1. ప్రకృతి పంచభూతాలతో (భూత' అంటే పదార్థం) ఏర్పడింది. అవి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి.
2. ఈ ఐదు పదార్థాల యొక్క విభిన్న కలయికల ఫలితమే ప్రకృతిలోని వివిధ వస్తుజాలం. ఇవి కూడా ఒక నిర్జీవ రూపం నుండి ఇంకో నిర్జీవ రూపానికి, నిర్జీవ దశ నుండి సజీవ దశకు, సజీపదశ నుండి నిర్జీవ దశకు ఇలా నిరంతరం రూపాంతరం చెందుతుంటాయి.
3. పదార్థాల యొక్క ఈ 'నిరంతర మార్పు' లక్షణం వాటి స్వభావంలోనే వుంది. నిప్పు వేడిగాను, నీరు చల్లగాను ఉండటం వాటి సహజ లక్షణం ఎలాగో, ఈ పదార్థాలు మార్పు చెందడం గూడ వాటి స్వతఃసిద్ధస్వభావం' వలనే జరుగుతుంది.
4. ప్రకృతిలోని పంచభూతాలతోనే మానవుడు ఏర్పడినాడు. దీన్ని ప్రాచీన వైద్యులు మానవుడు ఒక 'రసోత్పత్తి' అని పేర్కొన్నారు. 'రస' అంటే నిరంతర చలనం అని అర్ధం. 'అగ్ని' (ప్రచనం, జఠరాగ్ని) వలన రసగా మారుతుంది. ఈ రస మరల శరీరంలోని రక్తం, మాంసం, క్రొవ్వు, మూలుగ, ఎముక, వీర్యం మొదలగు భాగాలుగా రూపాంతరం చెందుతుంది.
వైద్యశాస్త్ర లక్షణాలు
ప్రకృతి గురించి, మానవుని గురించి ఇటువంటి అవగాహన వలన వైద్య వృత్తిలో కూడా తీవ్ర పరిణామాలు సంభవించాయి. వైద్యవృత్తిలో ఎటువంటి మత ప్రమేయాన్నైనా పూర్తిగా తిరస్కరించారు. ఆరోగ్య, అనారోగ్యాలకు పాప, పుణ్యాలకు ఎటువంటి సంబంధం లేదని, ప్రతిరోగినీ క్షుణ్ణంగా పరిశీలించి రోగనిర్ధారణ చేసి వాతావరణాన్ని బట్టి రుతువును బట్టి, శరీర ధర్మాన్ని బట్టి, సక్రమమైన పాళ్ళలో మందునిస్తే రోగ నివారణ అవుతుందని చెప్పారు. ప్రకృతిలోని పదార్థాలతోనే మానవుడు ఏర్పడినందున ప్రకృతిలోని పదార్థాలలో వైద్యానికనువైన దానిని రోగానికి మందుగా ప్రకటించారు. ఆరోగ్య అనారోగ్యాలు కులాలకు, అంతస్థులకు అతీతంగా వున్నందున వైద్యుల దృష్టిలో మానవులంతా సమానమేనని ప్రకటించారు. ఈ విధంగా ప్రాచీన వైద్యం లౌకికతత్వ, భౌతికవాద, మానవతావాద దృక్పథాలను చేపట్టింది.
ఈ విధంగా భారతీయ చింతనలో మొట్టమొదటిసారిగా శాస్త్రానికి కావల్సిన ప్రాథమిక అంశాలను వైద్యులు రూపొందించారు. ఆనాటి సాంకేతిక స్థాయి రీత్యా, కృత్రిమంగా ప్రయోగశాలలలో పరిశీలించే అవకాశాలు లేని కాలంలో కూడా ఇటువంటి శాస్త్రవిజ్ఞానాన్ని రూపొందించడం ప్రాచీన వైద్యుల చింతనకు, గొప్పదనానికి నిదర్శనం.
రుగ్వేదంలో అశ్వినీ దేవతల గురించి ప్రస్తావన నాలుగు సార్లు వస్తుంది. వీరు ఆరోగ్యానికి దేవతలు. వీరు ఆనాటికి ఒక ప్రాచీన తెగకు చెందినవారు.
" మీరు ముసలి వారికి యవ్వనం ఇవ్వగలరు. బాధ లేకుండా కాన్పు చేయగలరు. కాలిన గాయాలకు, క్రూర మృగాలు చేసిన గాయాలను నయం చేయగలరు. మీరు మా కోసం ఔషధ తీసుకొస్తారు. సింధు,అశక్ని నదుల్లో సముద్ర గర్భంలో పర్వత సానువుల్లో ఉన్న ఔషధాలు మీకు తెలుసు. మా క్షేమం కోసం వాటిని తీసుకురండి.మా శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో మా వ్యాధులు ఎలా బాగు చేసుకోవాలి నేర్పండి. మా శరీరాల్లోని లోపాలను తొలగించండి"అని వారిని ప్రార్థించారు.
అయితే ఎంతో భవిష్యత్ వున్న శాస్త్రం క్రమేణా అంతరించిపోయింది. ప్రాచీన కాలంలోనే శాస్త్రాభివృద్ధిని సాధించినందుకు సహజంగానే వైద్యులను అభినందించాలి. కాని అందుకు భిన్నంగా యజుర్వేదం, బ్రహ్మణాలు, ధర్మసూత్రాలు, స్మృతులు మొదలగు ప్రాచీన మతగ్రంథాలతో వైద్యులను అసహ్యించుకున్నారు. పూయం చికిత్సకస్య అన్నమే వైద్యుని నుండి పొందిన ఆహారం చీముకున్నా చెడ్డది) భేషజేపూ సోనియామ్ (వైద్యునికచ్చిన ఆహారం రక్తం, చీములాంటిది) అని మనుధర్మ శాస్త్రంలో చెప్పబడింది. వశిష్ఠ ధర్మ సూత్రాలలో 'వైద్యుడు, దొంగ, చాకలి, కుమ్మరి, శూద్రులు ఇచ్చిన ఆహారం ముట్టరాదని' మహాభారత శాంతిపర్వంలో, 'వైద్యునికి ఆహారం పెట్టరాదని' అనుశాసనపర్వంలో 'కానుకలివ్వరాదని' ఆంక్షలు పెట్టబడ్డాయి. రుగ్వేదంలో మంచి వైద్యులైనందుకు ఆకాశానికెత్తబడిన అశ్వనీదేవతలు, యజుర్వేదంలో దైవస్థానం నుండి క్రిందకు త్రోసి వేయబడ్డారు. అధర్వణవేదం వైద్యం గురించి చెప్తున్నందున మొదట ఉపేక్షించబడ్డది. రానురాను కించబరచబడ్డది. ఉపనిషత్తులో ఎక్కడా వైద్యుల గురించి, వైద్యశాస్త్రానికి ప్రసిద్ధి గాంచిన ప్రాచీన నగరం 'తక్షశిల' అపవిత్రమైనదిగా భావించబడ్డది.
"సామాన్య ప్రజలకు వైద్యం చేసే వాడు అపవిత్రుడు" అని గౌతముడు,మనువు ప్రకటించారు. బ్రాహ్మణులు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు.స్మృతులు వైద్యశాస్త్రాన్ని తిరస్కరించాయి. వైద్యుల్ని అపవిత్ర అస్పృశ్య వర్గాలతో జత చేశారు. చాకలి కమ్మరి మంగలి వేటగాళ్లు నేరస్తుల జాబితాలోకి వైద్యుల్ని చేర్చినారు.
ఆనాటి వర్ణవ్యవస్థకు, మత సిద్ధాంతాలకు ప్రమాదకరంగా 'శాస్త్రం' తయారైనందున వైద్యులపై తీవ్ర నిర్బంధం ప్రయోగించి లొంగదీసుకున్నారు.
ప్రాచీన వైద్యులపై వైదికుల ద్వేషానికి గల కారణాలు
పరిశుభ్రత ప్రాధాన్యత
వైద్యులను వైద్య వృత్తిని అసహ్యించుకోవడానికి వృత్తిరీత్యా కారణమేమైనా వుందా? అపరిశుభ్రంగా అసహ్యంగా వున్నారని అటువంటి వైఖరి చేపట్టారా? అని
అనుకుందామన్నా అటువంటి దాఖలాలు మత గ్రంథాలలో, ధర్మసూత్రాలలో ఎక్కడా కానరావు. కాని ఆనాటి వైద్యులు ఎంత పరిశుభ్రంగా, హుందాతనంగా వుండేవారో తెలియజేసే సమాచారం చాలా వుంది.
చరక సంహితలో మంచి వైద్యుల లక్షణాలు ఎన్నో రాశారు. వైద్యుడు పరిశుభ్రమైన అలవాట్లు కలిగి వుండాలి.
1.గడ్డం, గోళ్ళు పెరగనివ్వరాదు.
2.తెల్లటి దుస్తులు ధరించాలి.
3.చిరుమందహాసంతో నింపాదిగా నడవాలి, 4.ఎల్లవేళలందూ సాయం చేయడానికి సిద్ధంగా వుండాలి.
5.సంభాషణలోను, ప్రవర్తనలోను స్నేహపూర్వకంగాను, నిర్మొహమాటంగా వుండాలి. 6.తన ఆలోచనకు, విజ్ఞతకు ఎప్పుడూ అంతరాయం జరగకుండా చూసుకోవాలి.
రాజకీయ కారణం
వైద్యులు అపరిశుభ్రంగా వున్నందున, హుందాతనం లేనందున నిరసించబడ్డారని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు. మరివారిని చీత్కరించడానికి కారణం ఏమిటి? రాజకీయమే ప్రధాన కారణమని ఆనాటి ధర్మసూత్రాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. వైద్యులు సాధించిన శాస్త్రవిజ్ఞానం పురోహితవర్గ ఆధిక్యతను వర్ణ వ్యవస్థను తిరస్కరిస్తున్నది. వాటిని సమర్ధించడానికి సృష్టించబడిన కర్మసిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నది. ఆనాడు ప్రభువులకు, పురోహితులకు ప్రాణసమానమైన అన్నింటినీ ప్రశ్నించి అసమాన సాంఘిక వ్యవస్థ ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టినందుకే వారి కోపాగ్నికి వైద్యులు బలయ్యారు. మత గ్రంథాలు, ధర్మ సూత్రాలలోని భావాలను ఎలా తిరస్కరించారో తెలుసుకోవడానికి అనేక ఉదాహరణలివ్వవచ్చు.
కర్మ సిద్ధాంతం మోసం
కర్మ సిద్ధాంతం సనాతనులకు అతి ప్రియమైనది. గత జన్మలో చేసి మంచి, చెడ్డలను బట్టి ఈ జన్మలోని కష్టసుఖాలుంటాయని వాటినెవ్వరూ తప్పించుకోలేరని, తొలగించుకోలేరని వాటిని 'మనకర్మ' అని వత్తిపలుక్కుంటూ అనుభవించడమే శరణ్యం అని కర్మసిద్ధాంతం చెపుతుంది. అలాగే ఆరోగ్యం, అనారోగ్యాలు కూడా గత జన్మఫలితాలేనని వాటినెవరూ ఈ జన్మలో మార్పు చేయజాలరని అంటుంది. దీని ప్రకారం రోగం వస్తే దానికి వైద్యం చేయడం. నిష్ప్రయోజనం, శ్రమదండుగ, వృధాఖర్చు అన్నమాట. గత జన్మలోని పాపాలకు పరిహారం అనుకుని వూరుకోవాలి.
కాని ఇటువంటి ఆలోచనకు ప్రాచీన వైద్యులు పూర్తిగా వ్యతిరేకం. అనారోగ్యం, గత జన్మలో చేసిన చెడ్డను బట్టిగాక శరీరంలోని వివిధ పదార్థాల సమతూకం చెడినందున వస్తుందని అందువలన ఆ సమతూకాన్ని ఆహారం ద్వారా, మందు ద్వారా తిరిగి సాధించి రోగ విధానం చెయ్యవచ్చని చెప్పారు. ఈ విధానం వలన నయం చెయ్యగల రోగాలను నయం చెయ్యడం, నయంగాని రోగాల బాధను ఉపశమనం చెయ్యడం సాధ్యం అని నమ్మారు. అంతేగాక గత జన్మ ఉందా లేదా అన్న మీమాంస వైద్యానికి అనవసరం అని ప్రకటించారు. ఆ రకంగా కర్మ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి దాని పరిరక్షకుల ఆగ్రహానికి గురయ్యారు.
(సేకరణ:పిళ్లా కుమారస్వామి,9490122229)
Teliyani visayaalu telusukunnanu,nirdha,social health planer/activist
ReplyDelete