మన భూమిని రక్షించుకుందాం.


సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి.విశ్వంలో అనేక జీవ జాతుల మనుగడకు అనుకూలత కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం భూమి.ఇది మొత్తం ప్రపంచ ఉపరితలంలో 29.1 శాతాన్ని ఆక్రమించి కోట్లాది ప్రజానీకంతో పాటు పలు జీవ జాతులకు నివాసయోగ్యమైనదిగా వుంది.గ్రహ అన్వేషణలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నప్పటికీ జీవ జాతికి అనుకూలమైన వాతావరణం వున్న మరో గ్రహం నేటికి కనుగొనబడలేదు.గాలి,నీరు,నేలతో ఆవరించిన భూమి "సహజ వనరుల"గని.
దీనిపై జీవావిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగినదని,ధరిత్రి ఇప్పటి స్థితికి చేయడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు కాలం పట్టిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.అంతటి ప్రాముఖ్యత గల భూమిపై అనాలోచిత మానవ చర్యల ఫలితంగా కలుగుతున్న ప్రకృతి విధ్వంసానికి నిలువరించాలన్న లక్ష్యంతో పాటు పర్యావరణం పట్ల స్పృహ కలిగి ఉండడానికి ప్రతి ఏటా "ప్రపంచ ధరిత్రి దినోత్సవం" నిర్వహించడం జరిగుతుంది.పారిశ్రామీకరణ వలన పెరుగుతున్న కాలుష్యం,పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని అమెరికన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్  ధరిత్రి దినోత్సవానికి రూపకల్పన చేశారు.దీనిని మొట్టమొదటిసారి అమెరికాలో 1970 ఏప్రిల్ 22న నిర్వహించారు.అనంతరం ఇది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది.ప్రపంచ స్థాయిలో  ధరిత్రి సంరక్షణ పట్ల మరింత అవగాహన కలిగించి,భూగోళాన్ని సంరక్షించడానికి  "ఎర్త్ డే నెట్వర్క్"కూడా ఏర్పడింది.ఐక్యరాజ్యసమితి 2009లో ఈ ధరిత్రి దినోత్సవానికి ఆమోదం తెలిపి దీనిని"ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే"గా మార్చింది. ఈ దరిత్రి దినోత్సవాన్ని ప్రస్తుతం192 దేశాలు జరుపుకుంటున్నాయి.నేటికి 51 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా "వాతావరణ చర్యలు"(climate action) అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా  ఎర్త్ డే  నిర్వహిస్తున్నారు .
                నేడు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న అనేక కార్యకలాపాలు భూమి కాలుష్యానికి కారణమవుతోంది.శిలాజ ఇంధనాలు విచ్చలవిడిగా వాడడం వల్ల హరిత వాయువులు(గ్రీన్ హౌస్ వాయువులు) విడుదలై వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవిస్తున్నాయి.తద్వారా భూగోళం అమితంగా వేడెక్కి హిమాని నదులలో మంచు కరిగి వరదలు సంభవించి నేల కోతకు గురికావడం,కరువులు తాండవించడం లాంటి అకాల ముప్పులను చువిచూస్తున్నాం.అడవుల నరికివేత,పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు,అణుశక్తి వలన రేడియోధార్మిక పదార్ధాలు భూమిలోకి ప్రవేశించడం వలన నేల విపరీత కాలుష్యానికి గురవుతుంది.వాయు కాలుష్యం పెచ్చుమీరడం మూలంగా ఓజోన్ పొర కూడా రోజు రోజుకు దెబ్బతింటోంది పట్టణాలు,నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది.వ్యవసాయదారులలో వాణిజ్య స్వభావం పెరిగి రసాయన ఎరువులు విచ్చల విడిగా వాడడం మూలంగా పదికాలాల పాటు పదిలంగా చూసుకోవాల్సి భూమి నిస్సారంగా మారుస్తున్నారు.దీనికి ఉదాహరణ వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన హరిత విప్లవం ఒక కారణం అని పేర్కొనవచ్చు. వ్యవసాయంలో పురుగు మందు అవశేషాలు పంటల నుండి మానవ శరీరంలోకి ప్రవేశించి అనేక నూతన వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ మరియు చెత్త కూడా భూ కాలుష్యానికి ప్రధానంగా మారింది.గడిచిన దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటుకు రెట్టింపు పరిమాణంలో చెత్త పెరిగింది.ముఖ్యంగా ప్లాస్టిక్,లోహ మరియు ప్యాకేజీ తదితర వ్యర్థ పదార్థాల పరిమాణం కూడా విపరీతంగా పెరిగింది.భారతదేశంలో నగరాలు రోజుకు టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారిన తరుణంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ భారంగా మారింది.విచ్చలవిడి గనుల తవ్వకం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కాలుష్యానికి దారి తీస్తోంది.ముఖ్యంగా గనుల తవ్వకం వలన దట్టమైన అడవులు అంతరించిపోవడంతో పాటు దాని నుంచి వెలువడే దుమ్ము,దూళి వల్ల గాలి,నీరు,నేల కాలుష్యానికి గురికావడం జరుగుతుంది.మొత్తంగా మానవ చర్యల ఫలితంగా భూగోళం పలు రకాల కాలుష్యాలకు గురవుతోంది.తద్వారా జీవ వైవిద్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటూ,మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
            భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీరును పరిశీలిస్తే.. వాయు కాలుష్యంపై "గ్రీన్ పీస్" ఆగ్నేయాసియా నివేదిక ప్రకారం శిలాజ ఇంధనాల వాడకం వల్ల వాయు కాలుష్యంతో అంతర్జాతీయంగా ఏట చెల్లిస్తున్న మూల్యం ఏడాదికి2.9 లక్షల కోట్ల డాలర్లు అని,ఇది ప్రపంచ జీడీపీలో 3.3శాతానికి సమానం అని పేర్కొంది. భారతదేశంలో ఏటా10 లక్షల మంది ప్రాణాల్ని శిలాజ ఇంధన కాలుష్యం కనిపిస్తుందని ఆ నివేదిక పేర్కొన్నది.అదేవిధంగా శిలాజ ఇంధనాలు వెదజల్లుతున్న విష ధూళి కణాల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోతున్న దేశాల జాబితాలో అమెరికా,చైనా తర్వాత భారతదేశం ఉండడం శోచనీయం.ఆరోగ్యం,కాలుష్యాలపై అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థ దేశాల వారిగా అర్థాంతర మరణాలు గణించి అందులో40 శాతం వాహన, పారిశ్రామిక కాలుష్యం అని తేల్చిచేప్పేసింది. అందులో భారతదేశం వాటా 23 లక్షలుగా లెక్కకట్టింది.దేశీయంగా ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం వల్ల సంభవిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి నివేదిక గత ఏడాది క్రితం పేర్కొంది.అదేవిధంగా వివిధ దేశాల్లో ఏటా 30 లక్షల గర్భస్త పిండాలనువాయుకాలుష్యం కటేస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవల పేర్కొనడం నివ్వెరపోయే అంశం.మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాల జాబితాలో అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలవడం ప్రమాదకరస్థాయికి అద్దం పడుతుంది.పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరుస్తూ భూగోళ సుస్థిరతను ఆకాపాడుకోవడానికి ప్రకృతి వనరులు,ఇంధన వినియోగ తీరుపై పృథ్వి భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యక్రమం పేర్కొంటోంది.
              ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు అరికడుతూ భూగోళ సంరక్షణపై ప్రపంచస్థాయిలో ఐక్యరాజ్య సమితి ఇప్పటివరకు పలు సదస్సులతో పాటు ఒప్పందాలకు పిలుపునిచ్చింది.   
        1972లో పర్యావరణ హక్కుల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్టాక్ హోంలో మొట్టమొదటి సదస్సు నిర్వహించి అనేక తీర్మానాలు చేశారు.వాటికనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడానికి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(UNEP)ఏర్పాటు చేశారు.తదుపరి "బ్రంట్ లాండ్ కమిషన్" సహజ వనరులు ప్రస్తుత అవసరాలకు వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు అందించే "సుస్థిరాభివృద్ధి" భావనకు బాటలు వేయడం జరిగినది.బ్రంట్  ల్యాండ్ నివేదిక అంశాల ఆధారంగా 1988 లో పర్యావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (IPCC) కూడా ఏర్పాటు చేసి వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అంచనా వేసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.1992 బ్రెజిల్ లోని రియో డిజనీరో లో జరిగిన "ధరిత్రి సదస్సు" ప్రపంచ చరిత్రలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించాలానే లక్ష్యంతో నిర్వహించిన మొట్టమొదటి చారిత్రాత్మకమైన సదస్సు.ఇందులో జీవవైవిద్యం భూతాపం పెరగడం,వర్షాధార అరణ్యాల పరిరక్షణ మొదలైన అంశాలు ప్రధానాంశంగా చేర్చబడినవి.భూతాపం వల్ల సంభవించే దుష్ఫలితాలను అరికట్టడానికి ఈ సదస్సులో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (UNFCC) అనే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగినది.తదుపరి వాతావరణ మార్పులపై నిర్దిష్టమైన లక్ష్యాలతో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒప్పందాలలో "క్యోటో ప్రోటోకాల్" ప్రాముఖ్యతను సంతరించుకున్నది.ఈ ఒప్పందం ప్రకారం పారిశ్రామిక దేశాలు తమ హరితగృహ వాయువుల విడుదలను తగ్గించాలని సభ్య దేశాలలో184 దేశాలు ఆమోదించగా,వర్ధమాన దేశాలకు ఇస్తున్న మినహాయింపులను సాకుగా చూపి పర్యావరణ కాలుష్యానికి అతిపెద్ద కారకురాలైన అమెరికా సంతకం చేయడానికి నిరాకరించింది.అంతిమంగా ఎలాంటి ఫలితం లేకుండానే ఈ ప్రోటోకాల్ గడుపు ముగిసింది.తదుపరి క్యోటో ప్రోటోకాల్ గడువు ముగియడంతో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సుదీర్ఘ చర్చల ఫలితంగా ప్రపంచ దేశాల సయోధ్యతో 2015 "పారిస్ ఒప్పందం" కుదిరింది.ఈ ఒప్పందంపై అమెరికా సంతకం చేసినప్పటికీ గతేడాది ఒప్పందం నుంచి వైదొలగడం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అమెరికన్ నిర్ణయంతో మిగతా దేశాలు కాలుష్య కట్టడిలో అంతర్మధనం చెందుతున్న తరుణంలో ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని సుస్థిరాభివృద్ధి సాకారం చేయడానికి ఐదు దశాబ్దాలుగా చేస్తున్న కృషి సంపన్న దేశాలకు మరియు వర్ధమాన దేశాలకు మధ్య సయోధ్య కుదరక ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు.ఐక్యరాజ్యసమితి ఈ ఒప్పందాలపై పున సమీక్షించి సమర్థవంతంగా అమలు పరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.అప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.
                    ఐక్యరాజ్యసమితి  సుస్థిరాభివృద్ధి చర్యల కనుగుణంగా భారతదేశం కూడా వాతావరణ మార్పులను అరికడుతూ భూగోళ సంరక్షణకై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా అటవీ సంరక్షణ చట్టం, జీవవైవిధ్య సంరక్షణ చట్టం,పర్యావరణ సంరక్షణ చట్టం రూపొందించి అమలు పరుస్తోంది.2022 నాటికి శిలాజేతర ఇంధనాల వాటాను175 మెగావాట్లకు పెంచుతామని ప్రతిన పూనిన భారత్ ఆ లక్ష్యాన్ని 450గిగా వాట్లుగా మార్చుకున్నట్లు గత ఏడాది సెప్టెంబర్ లో ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పేర్కొనడం హర్షించదగ్గ విషయం.అదేవిధంగా 2014లో "జాతీయ సౌర విద్యుత్ మిషన్"లో భాగంగా 2022 నేటికి100 గిగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగినది.జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో 33శాతం అడవులు ఉండాలని నిర్దేశించుకోడం జరిగినది.కానీ నేటికి అడవులు21.6శాతానికే పరిమితమైనవి.కావున అడవుల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో అధికరణ 48A ప్రకారం పరిసరాలు,అడవులు మరియు వన్యప్రాణి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొనబడినది.ప్రస్తుతం పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా భూగోళ సుస్థిరతను కాపాడడానికి ప్రపంచ దేశాలు దీర్ఘకాలిక లక్ష్యాలతో కృషి చేయవలసిన అవసరం వుంది.దానికై సుస్థిర వ్యవసాయోత్పత్తికి,అడవుల యాజమాన్యానికి,నేలకోత నివారణకు,నీటి కాలుష్యం నియంత్రణకు "హరిత సాంకేతిక" వినియోగం పెరగాలి.నీటి వినియోగాన్ని తగ్గిస్తూ,ఉత్పాదకత పెంచే సేద్య విస్తీర్ణంపై పరిశోధనలు జరగాలి.పర్యావరణానికి హాని కలిగించే ఖనిజ వనరులు స్థానంలో ప్రత్యామ్నాయ ఖనిజ వనరులను ఉపయోగించాలి.శిలాజ ఇంధన వనరులకు బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన పవన,సౌర, బయోగ్యాస్,బయోమాస్,హైడ్రోజన్ శక్తి,సముద్ర తరంగ శక్తి మరియు జీవ ఇంధనాలపై దృష్టి పెట్టాలి.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి దానికి బదులు జనుము,గోగునార లాంటి  ప్యాకింగ్ సంబంధిత వస్తువుల వినియోగాన్ని తీసుకురావాలి.ఘన వ్యర్థ పదార్థాలను పున: చక్రియ ప్రక్రియ ద్వారా కంపోస్ట్ మరియు జీవ ఎరువులను తయారు చేయాలి.వ్యవసాయంలో రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలి.

    
___సంపతి రమేష్ మహరాజ్
జన విజ్ఞాన వేదిక,9959556367


Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం