పరీక్షకు నిలబడని పురాణ కల్పనలు.


             pc Wikipedia
                'మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుంది. ప్లాస్టిక్‌ సర్జరీ జరిగిందనడానికి వినాయకుడే సాక్షి'వంటి విపరీత వాదనలు చూస్తున్నాం. వింటున్నాం. చదువుతున్నాం. భారతీయ శాస్త్ర విజ్ఞానం ఆ కాలంలోనే వెల్లివిరిసిందని కూడా సదరు కుహనా మేధావులు ఉటంకించడం ఇంటర్నెట్‌లో కావాల్సినంత వినోదాన్ని, హాస్యాన్ని సృష్టిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ వరకు అనేక మంది అబద్ధాలను ప్రచారం చేసే పనిలో వున్నారు.
         నిర్మొహమాటంగా చెప్పాలంటే అవన్నీ అర్థం లేనివని, కాల్పనిక విజ్ఞానమని, ఎలాంటి శాస్త్రీయ పరీక్షకు నిలబడనివని రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం అందుకున్న భారత సంతతికి చెందిన వెంకీ రామకృష్ణన్‌ ఇటీవల ఎన్‌డిటివిలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు

.'జీన్‌ మెషీన్‌' గ్రంథ రచయిత కూడా అయిన వెంకీ చెప్పిన కొన్ని ముఖ్యాంశాలు..

'భారతీయ ఇతిహాసం మహాభారతంలో గాంధారి 100 మంది కౌరవులకు జన్మనివ్వడం టెస్టుట్యూబ్‌ బేబీలకు ఉదాహరణ'గా ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి మీరేమంటారు?

ఇది పూర్తిగా అర్థం లేని విషయం. అటువంటి కథలను కల్పితాలుగా మాత్రమే చూడాలి. వాస్తవికంగా తీసుకోకూడదు. సైన్స్‌ అంటే మీరు ప్రతిపాదించిన అంశాన్ని పరీక్షించేదిగా వుండాలి. ప్రయోగం చేయగలగాలి. ప్రయోగం తాలూకు సాక్ష్యాన్ని చూపించాలి. దాన్ని చూపించడమే కాదు, ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చదివి తాము కూడా మరోసారి చేయగలిగే విధంగా వుండాలి. ఐవిఎఫ్‌ గురించి, టెస్టుట్యూబ్‌ బేబీల గురించి ఆ రోజుల్లోనే వున్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అలా మాట్లాడేవారు ఇప్పుడు మనం పుట్టుకనిస్తున్న టెస్ట్‌ట్యూబ్‌ బీబీలను అనాటి పద్ధతుల ప్రకారం ఎలా ఉత్పత్తి చేయవచ్చో వివరంగా ఇవ్వాల్సి వుంటుంది. అప్పుడే అది సైన్స్‌ అవుతుంది. కానిపక్షంలో అది సైన్స్‌ కాదు.
 
గాలిలో ఎగిరే యంత్రాలకు సంబంధించి కూడా అప్పట్లో ఎన్నో స్వైర కల్పనలు చేశారు. కాని విమానానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నిర్మాణ నమూనాలు, సూచనలు అవేవీ లేకుండా అది సైన్స్‌ కాబోదు. సైన్స్‌ ఒక ప్రయోగం. ఇతరులు ఎవరైనా దాన్ని తిరిగి ఉత్పత్తి చేయగలిగేలా వుండాలి. సైన్స్‌ని, కాల్పనిక విజ్ఞానాన్ని వేరు చేసేది ఈ ప్రాథమిక సూత్రమే.

         pc boldsky.com
మహాభారతంలో కర్ణుడు బీజ కణ మార్పిడి ద్వారా పుట్టాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రస్తావించారు..?

కణానికి సంబంధించిన భావన 1600 సంవత్సరం వరకు ఉనికిలో లేదు. ఎందుకంటే అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం అప్పటి వరకు మనకు అందుబాటులో లేదు. అసలు ఒక కణాన్ని చూసేందుకు కావాల్సిన శక్తివంతమైన మైక్రోస్కోప్‌ కూడా అప్పటికి లేదు. అలాంటిది ఎన్నో వేల సంవత్సరాల కిందటే కణాల గురించి ఎవరికైనా తెలుసని చెబుతుంటే బుర్ర తిరిగిపోతుంది.

మహాభారతం కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ అంటున్నారు..?

ఒకవేళ అలాంటిది వుండి వుంటే...శాటిలైట్‌ టెక్నాలజీకి ఆధారమైన న్యూటన్‌ చలన సూత్రం వంటి అతి మౌలికాంశాల గురించైనా ఎవరూ ఎందుకు చెప్పలేదు? ఈ మొత్తం సాంకేతిక వ్యవహారం 1800 లేదా 19వ శతాబ్దం వరకు నిజంగా అర్ధమయ్యేదే కాదు. కనుక ఏవో కొన్ని ఘటనల వర్ణనలను బట్టి అప్పటికే అవి వున్నాయనుకోవడం సరికాదు. అంతమాత్రానే అవి నిజమై పోవు. ఒకవేళ వారు విద్యుత్‌ అంటే ఏంటి? ఎలా ఉత్పత్తి చేయవచ్చు? ఇంటర్నెట్‌ని, కంప్యూటర్లను ఎలా రూపొందించవచ్చు? వంటి వివరాలను చెప్పివుంటే అది వేరే సంగతి.ఎందుకంటే ఇంటర్నెట్‌ కంప్యూటర్‌ మీద ఆధారపడుతుందని, కంప్యూటర్‌ ట్రాన్సిస్టర్ల మీద, అవి క్వాంటమ్‌ మెకానిక్‌ సూత్రాల మీద ఆధారపడి పని చేస్తాయని మీకు తెలుసు కదా. 2000 సంవత్సరాల కిందటే వాటి గురించి తెలిసినట్లయితే అవెక్కడున్నాయి? అవేవీ అప్పుడు లేవు. అప్పట్లో వాటి గురించి ఎవరికీ తెలియదు. అంటే ఇవి అప్పట్లో వున్నాయనడం కూడా అర్ధంలేని మాటలే. ఇలాంటి పుక్కిటి పురాణాలు చెప్పుకుని ఎందుకు సంతోషపడుతుంటారో అర్థమే కాదు. భారతీయులు ఈ వలసవాద న్యూనతా భావన నుంచి బైటపడాల్సి వుంది.

(5.2.2019, ప్రజాశక్తి)

Comments

  1. Excellent post .....
    All puranas are stories just stories...

    ReplyDelete
  2. Excellent post .....
    All puranas are stories just stories...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం